Share News

జెండా ఎగరేద్దాం..!

ABN , Publish Date - Feb 28 , 2024 | 12:12 AM

సార్వత్రిక ఎన్నికలకు తెలుగుదేశం–జనసేన కూటమి ఎన్నికల శంఖారావం పూరించనుంది. పొత్తులు అనంతరం తొలిసారిగా రాష్ట్ర నడిబొడ్డునవున్న తాడేపల్లిగూడెంలో ఉమ్మడి సభ నిర్వహించనున్నారు. పెంటపాడు మండలం ప్రత్తిపాడు జాతీయ రహదారికి ఆనుకుని వున్న 25 ఎకరాల భూమిలో సభా ప్రాంగణం సిద్ధమైంది.

జెండా ఎగరేద్దాం..!
ప్రత్తిపాడు వద్ద సభా వేదిక ఏర్పాట్లు

నేడే టీడీపీ–జనసేన తెలుగు జన విజయకే తన సభ

తొలి ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు, పవన్‌ హాజరు

ఛలో తాడేపల్లిగూడెంకు లక్షలాది మంది రాక

బస్సులు ఇచ్చేందుకు ప్రభుత్వం నిరాకరణ

బైక్‌లు, కార్లలో వచ్చేందుకు అభిమానుల ఏర్పాట్లు

(భీమవరం–ఆంధ్రజ్యోతి/పెంటపాడు/తాడేపల్లిగూడెం రూరల్‌)

సార్వత్రిక ఎన్నికలకు తెలుగుదేశం–జనసేన కూటమి ఎన్నికల శంఖారావం పూరించనుంది. పొత్తులు అనంతరం తొలిసారిగా రాష్ట్ర నడిబొడ్డునవున్న తాడేపల్లిగూడెంలో ఉమ్మడి సభ నిర్వహించనున్నారు. పెంటపాడు మండలం ప్రత్తిపాడు జాతీయ రహదారికి ఆనుకుని వున్న 25 ఎకరాల భూమిలో సభా ప్రాంగణం సిద్ధమైంది. సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్‌కల్యాణ్‌లు హాజరవుతున్నారు. రాష్ట్ర భవిష్యత్తుకు ప్రణాళికను ప్రకటించనున్నారు. సభకు ‘తెలుగు జన విజయకేతనం’ అని పేరు పెట్టారు. సభా వేదికపై చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లతో కూడిన భారీ స్ర్కీన్‌ ఏర్పాటు చేశారు. కూటమి అధినేతలు ఇద్దరు సభకు హాజరు కానుండడంతో ఇరు పార్టీలో మంచి జోష్‌ నెలకొంది. అంచనాలకు మించి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు హాజరవుతారని భావిస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని అవాంతరాలు సృష్టించినా సభ విజయవంతానికి ఇరు పార్టీల నాయకులు కసరత్తు పూర్తి చేశారు. సభా ప్రాంగణాన్ని బ్లాక్‌లుగా విభజించారు. మహిళల కోసం ప్రత్యేకంగా బ్లాక్‌లు కేటాయించారు. సభ సక్రమంగా సాగేందుకు దాదాపు వెయ్యిమంది వలంటీర్లను నియమించారు. ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ కోసం 500 మంది వలంటీర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.తెలుగుదేశం ముఖ్య నాయకులు అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటి పల్లారావు, జనసేన రాష్ట్ర నేత నాదెండ్ల మనోహర్‌లు మంగళవారం సభా ప్రాంగణాన్ని సందర్శించారు. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, జనసేన అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు, క్రమశిక్షణ సంఘం ప్రతినిధి మల్లినీడి బాబి, తాడేపల్లిగూడెం టీడీపీ, జనసేన ఇన్‌ఛార్జ్‌లు వలవలబాబ్జి, బొలిశెట్టి శ్రీనివాస్‌లు సభా ప్రాంగణాన్ని పరిశీలించారు.

పశ్చిమ నుంచే భారీగా

భారీ బహిరంగ సభకు ఉమ్మడి పశ్చిమ గోదావరి నుంచి అధిక సంఖ్యలో ప్రజలు హాజరుకానున్నారు. నాలుగు రోజుల నుంచి ఇరు పార్టీల నాయకులు నియోజకవర్గాల్లో పర్యటించారు. తాడేపల్లిగూడెం, తణుకు, ఉంగుటూరు, భీమవరం, పొలకొల్లు, నిడదవోలు, ఆచంట, గోపాలపురం, పాలకొల్లు నుంచి భారీగా ప్రజలు వస్తారని అంచనా వేస్తున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి కనిష్టంగా పది వేల మంది తరలి వచ్చేలా ప్రణాళిక చేశారు. తాడేపల్లిగూడెంలో రెండు పార్టీలు ప్రత్యేకంగా కసరత్తు చేశాయి. తెలుగుదేశం నుంచే 25 వేల మంది హాజరయ్యేలా వాహనాలు సిద్ధం చేశారు. జనసేన భారీ బైక్‌ ర్యాలీతో సభాస్థలికి చేరుకోవాలని సన్నాహాలు చేసింది. అలంపురం నుంచి బాదంపూడి వరకు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లతో కూడిన ఫ్లెక్సీలను నియెజకవర్గ ఇన్‌ఛార్జ్‌ వలవల బాబ్జి ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణం వద్ద రెండు పార్టీల ఫ్లెక్సీలు అలరిస్తున్నాయి. చీకటి పడే అవకాశం ఉండడంతో సభా ప్రాంగణం వద్ద ఫ్లడ్‌లైట్‌లను ఏర్పాటు చేశారు.

మధ్యాహ్నం నుంచే తరలింపు

ఉమ్మడి సభ మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభం కానుంది. రెండు హెలికాప్టర్లలో చంద్రబాబు, పవన్‌ సభకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం నుంచే ప్రజలను తరలించేలా నాయకులు సన్నాహాలు చేశారు. తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల నుంచి జనసమీకరణ చేస్తున్నారు. ప్రైవేటు వాహనాలను సమకూరుస్తున్నారు. ఆర్టీసీ బస్సులు ఇచ్చేందుకు ప్రభుత్వం నిరాకరించింది. అయినా తాడేపల్లిగూడెం చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి ద్విచక్ర వాహనాలపై వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు హాజరుకానున్నారు. ఆ దిశగా అన్ని నియోజకవర్గాల నుంచి ఇరు పార్టీ ముఖ్య నాయకులకు సమాచారం అందింది. చంద్రబాబు, పవన్‌ పాల్గొనే తొలి ఉమ్మడి సభ కావడంతో ప్రజలు స్వచ్ఛందంగా రానున్నారు. ఆటోలు, కార్లు, బస్సులు ఏర్పాటు చేశారు. ప్రైవేటు స్కూల్‌ బస్సులను ఇవ్వకుండా ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. ఇవేమీ తెలుగుదేశం, జనసేన నాయకులు పట్టించుకోలేదు. సొంతంగా వాహనాలు సమకూర్చుకుంటున్నారు.

వైసీపీలో వణుకు : అచ్చెన్న

‘ఉమ్మడి సభ నిర్వహిస్తామని ప్రకటించగానే వైసీపీలో వణుకు ప్రారంభమైంది. సభ ఎలా జరుగుతోందనన్న ఆందోళనతో ఉంది. ఎన్ని అవంతరాలు సృష్టించినా టీడీపీ, జనసేన కార్యకర్తలు వేలాదిగా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. సభను విజయవంతం చేసేందుకు ఇరు పార్టీల నాయకులు అహర్నిశలు శ్రమించారు. వైసీపీ దుష్టపాలనను అంతం చేసేందుకు అధిక సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు హాజరై సభను వియవంతం చేయాలి’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.

ఇది అందరి పండుగ : మనోహర్‌

‘తెలుగుదేశం, జనసేన ఉమ్మడి సభ అందరి పండుగ. ఇది జెండా పండుగ. తెలుగుదేశం–జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. తొలిసారిగా ఉమ్మడి సభ నిర్వహిస్తున్నాం. తాడేపల్లిగూడెం వేదికగా నిర్వహించే సభను అన్ని వర్గాల ప్రజలు ఆదరించాలి. విజయంతం చేయాలి. పోలీసులు సహకరిస్తున్నారు. వలంటీర్లను ఏర్పాటు చేశాం’ అని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ చెప్పారు.

వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యం : తోట సీతారామలక్ష్మి

‘వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యం. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు టీడీపీ, జనసేన కలిసి ముందుకు వెళ్తున్నాయి. నేటి సభలో చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ ప్రజలకు దిశా నిర్ధేశం చేస్తారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పక్కా ప్రణాళికతో ముందుకు సాగేందుకు ఈ సభ వేదిక కానుంది’ అని జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి చెప్పారు.

Updated Date - Feb 28 , 2024 | 12:12 AM