కొలువుతీరిన కూటమి సర్కార్
ABN , Publish Date - Jun 12 , 2024 | 11:53 PM
సీఎంగా చంద్రబాబు నాయుడు అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు ఏలూరు జిల్లా నుంచి నూజివీడు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

సీఎం చంద్రబాబు సహా మంత్రులుగా కొలుసు, నిమ్మల ప్రమాణ స్వీకారం
కూటమి ప్రభుత్వం కొలువుతీరింది. సీఎంగా చంద్రబాబు నాయుడు అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు ఏలూరు జిల్లా నుంచి నూజివీడు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లాల వారీగా ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో బీసీలకు ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చారో మంత్రి వర్గంలోను అదే ప్రాధాన్యత కొనసాగించారు. ఈ క్రమంలో జిల్లా రాజకీయాలు పెద్ద ఎత్తున మారనున్నాయి. విభజిత జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మంత్రివర్గంలో చేరడంతో ఆయా జిల్లాల్లో అభివృద్ధి, సంక్షేమం యుద్ధ ప్రాతిపదికన పుంజుకోవాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఐదేళ్లుగా పెండింగ్‌లో వున్న పనులను పూర్తిచేయాలి. ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని, ఆగ్రహాన్ని చల్లార్చాల్సిన బాధ్యత కొత్త కూటమి ప్రభుత్వానిదే. ఈ దిశగా వేగంగా అడుగులు వేయాలి.
(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి):
కూటమి ప్రభుత్వం కొలువుతీరిన సమయంలో జిల్లా వ్యాప్తంగా వేలాది మంది సంబరాలు చేసుకున్నారు. అత్యధికు లు మిఠాయిలు పంచుకున్నారు. ఒకరికి ఒకరు ఆలింగనాలు చేసుకుని అభినందనల్లో మునిగితేలారు. టీడీపీ, బీజేపీ, జన సేన నేతలంతా ప్రత్యక్షంగా ప్రసారమవుతున్న ఎల్‌ఈడీల ముందు వేలాది మంది మహిళలు, యువకులు, రైతులు ప్రమాణ స్వీకారాన్ని ఆసక్తిగా గమనించారు. కొత్త మంత్రులు ఎవరనేది మంగళవారం రాత్రి పొద్దుపోయిన తరువాత ప్రకటించారు. తమ జిల్లాలకు చెందిన వారు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ కేరింతలు కొట్టారు. చంద్ర బాబుకు అనుకూలంగా నినాదాలు చేశారు. శ్రీకాకుళం నుంచి పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రమాణ స్వీకార వేదిక వద్దకు చేరేందుకు తెల్లవారుజామునే ఏలూరు పరిస రాల్లో స్నానాదికాలు ముగించి పయనమయ్యారు. వీరందరికి తగు సౌకర్యాలు కల్పించటంలో అధికారులు జాగ్రత్తపడ్డారు. పాస్‌లు ఉన్న వారికే ప్రాధాన్యత ఇవ్వడం, వేదిక ప్రాంగణం ఇరుకుగా ఉండటంతో చాలామంది నేతలు, కార్యకర్తలు ఒకింత అసహనానికి లోనయ్యారు. కారు పాస్‌లు, సభా పాస్ లు ఉంటేనే ప్రమాణ స్వీకారానికి అనుమతించారు. మరెవరిని ముందుకు కదలనివ్వకుండా పోలీసులు అడ్డు తగలటం పట్ల కొంత అసంతృప్తి వ్యక్తమైంది.
మరోలా సీనియర్ల సేవలు
మంత్రి వర్గంలో కొందరికే అవకాశం దక్కడంతో మిగిలిన వారి సేవలను వినియోగించుకోవడానికి కూటమి నాయకత్వం సిద్ధమవుతోంది. టీడీపీ హయాంలో ప్రభుత్వ విప్‌గా చింతమనేని ప్రభాకర్ వ్యవహరించారు. ఈసారి ఆయన సేవలు వినియోగించుకునే దిశగా ప్రయత్నాలు సాగుతున్నా యి. చురుగ్గా ఉన్న ఎమ్మెల్యేలకు పార్టీ కీలక బాధ్యతలు అప్పగిస్తారని భావిస్తున్నారు. ఈ తరహా కసరత్తు ఒకటి, రెండు రోజుల్లో ముగియనుంది. ఆ తరువాత కీలక ప్రకటనలు వెలువడతాయని ఆశిస్తున్నారు. ఈ నెల 17న శాసనసభ సమావేశమయ్యే అవకాశం ఉన్నందున దానికంటే ముందు, లేదా ఆ తదుపరి చంద్రబాబు తీసుకునే కీలక నిర్ణయాలు అత్యద్భుతంగా ఉంటాయని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. మంత్రి వర్గ కూర్పులో ఎవరికి ఎలాంటి అసంతృప్తి లేకపో యినా వీలైనంత మేర అందరు సంతృప్తిపడే విధంగానే వరుస నిర్ణయాలు ఉంటాయని, సీనియర్లు చెబుతున్నారు. పొత్తులో భాగంగా త్యాగాలకు ఓర్చిన గన్ని వీరాంజనేయుల తోపాటు బొరగం శ్రీనివాసరావు, ఆకుమర్తి రామారావు, ముద్దరబోయిన వెంకటేశ్వరరావు వంటి నేతలకు తగు ప్రాధాన్యత కల్పిస్తారని అంచనాకు వచ్చారు.
అధికార యంత్రాంగం అప్రమత్తం
ఇప్పుడున్న యంత్రాంగంలో పలువురు అధికారులు ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలతో గడిచిన రెండు రోజులుగా సమావేశమవుతున్నారు. కొద్ది రోజుల వ్యవధిలోనే ఒకింత ప్రక్షాళనకు అవకాశమివ్వడంతో తమ పోస్టింగులు చెదరకుండా చూస్తున్నారు. మరికొందరు ప్రాధాన్యత కలిగిన పోస్టుల్లో నియామకానికి పావులు కదుపుతున్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యేలు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ప్రమాణం చేసిన తర్వాత మాట్లాడదామని సర్ది చెబుతున్నారు. ఈ పరిస్థితి అన్ని నియోజకవర్గాల్లోనూ కనిపిస్తోంది. ప్రత్యేకించి జనసేన తరపున ఎన్నికైన ఎమ్మెల్యేలను కొందరు అధికారులు కలిసి ఏదో రూపంలో తమకు ప్రాధాన్యత కలిగిన పోస్టింగ్‌లు ఇప్పించాలని సందేశాలు పంపుతున్నారు.
ఈ నెలలోనే పోలవరానికి సీఎం
నవ్యాంధ్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు ఈనెలాఖరు నాటికి పోలవరం ప్రాజెక్టును సందర్శించగలరని సంకేతాలు వెలువడుతున్నాయి. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరం పనులను తిరిగి పరుగులు పెట్టించి, పూర్తి చేస్తానని ఇంతకు ముందే ఎన్నికల ప్రచార సభల్లో స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే తొలుత అత్యున్నత స్థాయిలో కీలక నిర్ణయాలకు అనువుగా పైళ్లపై సంతకాలు పెట్టి, కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు పనులు 78శాతం పూర్తి అవ్వగా, మిగతా పనులు అన్ని ఎక్కడికక్కడే నిలిచే ఉన్నాయి. ఇప్పుడు కేంద్ర సహకారం ఉండటంతో కేంద్రంలో ఉన్నతాధికారులు ఒకరిద్దరు ఇప్పటికే ప్రాజెక్టును పరిశీలించి వెళ్ళారు.
విజయవాడ వెళ్లే రహదారులన్నీ కిటకిట
పాస్‌లు లేవంటూ కలపర్రు టోల్‌ప్లాజా
వద్ద కూటమి శ్రేణుల అడ్డగింత
పోలీసులతో వాగ్వాదం.. బారికేడ్లు తోసుకుని కార్యకర్తలు ముందుకు..
పెదపాడు : సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవ ఘట్టాన్ని తిలకించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు గన్నవరం వైపు కదలడంతో జిల్లాలోని రహదారులన్నీ కిటకిటలాడాయి. పెద్ద సంఖ్యలో విజయవాడ వైపు వెళుతున్న వాహనాలను పోలీసులు పాస్‌లు లేవంటూ ఎక్కడికక్కడ అడ్డగించి దారి మళ్లించినా ఫలితం లేకపోయింది. పెదపాడు మండలం కలపర్రు టోల్‌ప్లాజా వద్ద పోలీసులు బారికేడ్లు అడ్డుగా పెట్టి సీఎం సభకు వెళ్లే వారిని నిలువరించారు. క్షణాల్లోనే పార్టీ శ్రేణుల వాహనాలతో జాతీయ రహదారి మొత్తం నిండిపో యింది. కొద్దిసేపు వేచి చూసిన నాయకులు, కార్యకర్తలు బారి కేడ్లు తొలగించాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఒక దశలో పోలీసులు డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఘర్షణ వాతావరణం ఏర్పడకుండా పోలీసులు సంయమనం పాటించారు. కార్యకర్తలు బారికేడ్లను బలవంతంగా పక్కకు తోసేసి ముందుకు కదిలారు. నాయకులు, కార్యకర్తలు జై చంద్రబాబు అనే నినాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. వాహనాలు ముందుకు కదలడంతో పోలీసులు చూస్తుండి పోయారు. పాస్‌లు లేని వారిని పోలీసులు వెనక్కి తిప్పి పంప టంతో టీడీపీ శ్రేణులు నిరాశచెందాయి. భీమడోలులో పోలీ సులు కార్యకర్తలను అడ్డుకున్నారు. పాస్‌లు ఏలూరు ఎంపీ కార్యాలయంలో ఉన్నాయని, అక్కడి నుంచి తీసుకుని వెళతా మని చెప్పినా వినకుండా పోలీసులు వినిపించుకోలేదు. నిడ మర్రు, గణపవరం నుంచి వచ్చిన కార్లను ఆపేయడంతో పోలీ సులు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
భారీ బందోబస్తు.. వాహనాల దారి మళ్లింపు
ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం బుధవారం చేస్తోన్న సందర్భంగా బుధవారం ఉదయం పదో నెంబర్ జాతీయ రహదారిపై పటిష్టమైన బందోబస్తును ఏర్పా టుచేశారు. ఎస్పీ డి.మేరీ ప్రశాంతి ఆదేశాలతో జిల్లా పరిధి లోని జాతీయ రహదారి వెంబడి సర్వీసు రోడ్లు అడ్డరోడ్లు ఉన్న ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు. పాస్‌లు ఉన్న వాహనాలను మాత్రమే విజయవాడ వైపుకు అనుమతించారు. మిగిలిన వాహనాలను వెనక్కు పంపించారు. రాజమహేంద్ర వరం నుంచి వచ్చే భారీ వాహనాలను దేవరపల్లి, నల్లజర్ల, దూబచర్ల, భీమడోలు, గుండుగొలను, జంగారెడ్డిగూడెం రోడ్డు, చింతలపూడి రోడ్డు, శనివారపుపేట రోడ్డు (దుగ్గిరాల బ్రిడ్జి) కలపర్రు టోల్ గేటు వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహిం చారు. భారీ వాహనాలను వేరే మార్గాలలో మళ్ళించారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నియంత్రణ చర్యలు చేప ట్టారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం తర్వాత తిరుగు ప్రయా ణాల్లోను వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తు నిర్వహించారు.
ప్రజల రుణం తీర్చుకుంటా
మంత్రిగా పార్థసారథి ప్రమాణ స్వీకారం
నూజివీడు: ‘నా విజయానికి కార్యకర్తల శ్రమే కారణం. నన్ను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటా. 15 ఏళ్ళుగా నూజివీడు నియోజకవర్గంలో అభివృద్ధి కుంటు పడింది. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయించి రైతులకు సాగు, తాగు నీరందేలా చర్యలు తీసుకుంటా. నూజివీడు పట్టణ సమస్యలను పరిష్కరించి నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటా’ అని మంత్రి పార్థసారథి అన్నా రు. టీడీపీ తరపున నూజివీడు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన కు చంద్రబాబు కేబినెట్‌లో బెర్త్ దొరకడంతో బుధవారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజకీయంగా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా పార్థసారథిని ఎప్పటికప్పుడు అదృష్టం వరిస్తూనే వుంది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో కాంగ్రెస్‌లో తీవ్ర పోటీ వున్నా ఉయ్యూరు నుంచి టిక్కెట్ దక్కించుకుని భారీ మెజారిటీతో గెలిచారు. తర్వాత పెనమ లూరు నుంచి తొలిసారి గెలుపొందారు. 2024లో తిరిగి టిక్కెట్ వచ్చే సూచనలు లేకపోవడంతో ఆయన ఆ పార్టీకి రాజీనామా చేసి ఈ ఏడాది ఫిబ్రవరిలో టీడీపీలో చేరారు. ఆయన నూజివీడు నుంచి పోటీ చేసి 12 వేల మెజార్టీతో గెలుపొందారు. కూటమిలో బీసీ అభ్యర్థులు భారీ సంఖ్యలో గెలిచినప్పటికీ వైసీపీ నుంచి పార్థసారథికి బీసీ కోటాలో మంత్రి బెర్త్ దొరకడం అదృష్టమేనని టీడీపీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు నూజివీడు నుంచి మొదటిసారి డాక్టర్ ఎం.ఆర్ అప్పారావు మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 1978, 1989లలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పాలడుగు వెంకట్రావు మంత్రిగా పనిచేశారు. తరువాత తెలుగుదేశం తరపున నాలుగుసార్లు కోటగిరి హనుమంతురావు గెలిచినా ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యే పార్థసారథికి తొలిసారి మంత్రి పదవి దక్కింది. పార్థసారథి ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ కేబినెట్‌లో విద్యా శాఖ మంత్రిగా పనిచేశారు.
జవాబుదారీగా పనిచేస్తా
మంత్రిగా నిమ్మల ప్రమాణ స్వీకారం
పాలకొల్లు అర్బన్: ‘ప్రజలు ఇచ్చిన భారీ మెజారిటీ మాలో బాధ్యత, జవాబు దారీతనం పెంచా యి. గత జగన్ ప్రభుత్వం లోని మంత్రుల మాదిరి మేం ప్రవర్తించం. ప్రజల కు అందుబాటులో ఉండి ఇచ్చిన హామీలు నెరవే రుస్తూ.. రాష్ర్టాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లే దిశగా పనిచేస్తాం. నిరుద్యోగులకు అండగా ఉంటాం’ అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. టీడీపీ తరపున పాలకొల్లు ఎమ్మెల్యేగా మూడోసారి ఎన్నికైన ఆయనకు చంద్రబాబు కేబినెట్‌లో బెర్త్ దొరకడంతో బుధ వారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నిత్యం జనంలో ఉంటూ ప్రజాపోరాటం చేయడంతో జగన్ హవాలోనూ భారీ ఆధిక్యతతో 2019లో విజయం సాధించారు. ఈసారి ఎన్నికల్లో అనూహ్యమైన ఆధిక్యత లభించింది. అధిష్ఠానానికి విధేయునిగా ఉండడంతో మంత్రి పదవి కేటాయించారు. జిల్లాలో బలమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో పాటు, తెలుగుదేశం పార్టీ కోసమే కష్టపడే మనస్తత్వం కలిసి వచ్చింది. మంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన బుధవారం రాత్రి పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు, నరసాపురం మీదుగా పాలకొల్లు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఎక్కడికక్కడ భారీ ఎత్తున స్వాగతం లభించింది.