Share News

పశ్చిమ నూతన కలెక్టర్‌గా సుమిత్‌కుమార్‌

ABN , Publish Date - Feb 15 , 2024 | 12:46 AM

పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి ఆకస్మికంగా బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో అల్లూరి సీతారామరాజు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ గాంధీ నియమితులయ్యారు.

పశ్చిమ నూతన కలెక్టర్‌గా సుమిత్‌కుమార్‌

కలెక్టర్‌ ప్రశాంతి మార్కెటింగ్‌ శాఖకు ఆకస్మిక బదిలీ

వెనుక కారణాలేంటి ?.. సర్వత్రా విస్మయం..

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి ఆకస్మికంగా బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో అల్లూరి సీతారామరాజు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ గాంధీ నియమితులయ్యారు. ప్రశాంతిని వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌గా నియమించారు. అయితే ప్రశాంతి ఆకస్మిక బదిలీపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. భీమవరం కేంద్రంగా ఏర్పడిన కొత్త జిల్లాకు 2022 ఏప్రిల్‌ 4న తొలి కలెక్టర్‌గా ఆమె బాధ్యతలు స్వీకరించారు. పాలనను గాడిలో పెట్టేందుకు ప్రయత్నించారు. కలెక్టర్‌ ప్రశాంతి ముక్కుసూటిగా ఉంటారు. ప్రభుత్వం నిర్ణయాన్ని కచ్చితంగా అమలు చేస్తారన్న అభిప్రాయం అన్నివర్గాల్లోనూ ఉంది. ఆమె హయాంలోనే భీమవరంలో ప్రధాని నరేంద్రమోదీ పర్యటించారు. అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు. ఈ బహిరంగ సభ నిర్వహణలోను, సీఎం జగన్‌ నిర్వహించిన పలు సభల నిర్వహణలోను కలెక్టర్‌ కీలకంగా వ్యవహరించి ప్రశంసలు పొందారు. పాలనలో ముక్కుసూటిగా ఉంటారు. ప్రజా ప్రతినిధులు ఎన్ని ఒత్తిళ్లు చేసినా నిబంధనలకు లోబడి పనిచేస్తుంటారు. దీనికే కట్టుబడి ఉన్నారు. జిల్లాలోని ఓ మంత్రితో అభిప్రాయభేదాలున్నాయి. మున్సిపల్‌ కమిషనర్‌ బదిలీ చేయాలన్న విషయంలో సదరు ప్రజా ప్రతినిధి, కలెక్టర్‌కు మధ్య మరింత దూరం పెరిగినట్టు సమాచారం. కమిషనర్‌పై ఆరోపణలు వస్తుండడంతో బదిలీ చేసేందుకు కలెక్టర్‌ మొగ్గు చూపారు. దీనికి అధికార పార్టీ ప్రజా ప్రతినిధి విముఖత చూపారు. భీమవరంలోనూ అధికార పార్టీ నేతకు, కలెక్టర్‌కు మధ్య అంతగా సఖ్యత లేదు. భీమవరం ప్రత్యేక అధికారి గానూ కలెక్టర్‌ వ్యవహరించారు. ఈక్రమంలో అనేక పాలనా పరమైన విధానాల్లో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తినట్టు ఉద్యోగ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇటీవల ఓటర్ల జాబితాలో అవతవకలపై బీఎల్‌వోలను సస్పెండ్‌ చేశారు. మరికొందరు అదే జాబితాలో ఉన్నారు. ఇది కూడా అధికార పార్టీకి కాస్త ఇబ్బందికరంగా మారినట్టు తెలుస్తోంది. ప్రభుత్వానికి సానుకూలంగా ఉంటూనే నిర్ణయాల్లో నిబంధనలకు లోబడి పనిచేశారు. ప్రజా ప్రతినిధుల ఒత్తిళ్లకు లొంగలేదు. ఇదే బదిలీకి ఒక కారణంగా చెప్పుకుంటున్నారు.

సుమిత్‌ సుపరిచితులే..

నూతన కలెక్టర్‌గా నియమితులైన సుమిత్‌కుమార్‌ గాంధీ జిల్లావాసులకు సుపరిచితులే. 2014లో నరసాపురం సబ్‌ కలెక్టర్‌గా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురంలో టైన్రీ కలెక్టర్‌గా, నర్సాపురం సబ్‌ కలెక్టర్‌గా, శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాల జేసీగా, అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు

Updated Date - Feb 15 , 2024 | 12:46 AM