Share News

సర్వర్‌ డౌన్‌

ABN , Publish Date - Feb 06 , 2024 | 12:09 AM

సోమవారం రోజంతా సర్వర్‌ సమస్య తలెత్తడంతో ఉదయం 10 గంటల వరకు వచ్చిన కక్షిదారులు సాయంత్రం 5 గంటల వరకు వేచి చూసి చివరకు తమ ఇళ్లకు వెళ్లిపోయారు.

సర్వర్‌ డౌన్‌
ఆచంట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద వేచి ఉన్న కక్షిదారులు

నిలిచిపోయిన రిజిస్ట్రేషన్‌లు

రోజంతా పనిచేయని సర్వర్‌..కక్షిదారుల పాట్లు

ఆచంట, ఫిబ్రవరి 5: రిజిస్ట్రేషన్‌ శాఖలో తరచూ తీసుకువస్తున్న కొత్త మార్పులతో రిజిస్టేష్రన్‌ కోసం వస్తున్న కక్షిదారులకు అవస్థలు తప్పడం లేదు. ఇటీవలే రిజిస్ట్రేషన్‌ శాఖ 2.0 విధానాన్ని తీసుకువచ్చింది. ఆ విధానం ద్వారానే రిజిస్ట్రేషన్‌ చేయాలని ఆదేశాలు జారీ కావడంతో అప్పటి నుంచి డాక్యుమెంటుకు సంబంధించి ఎవరి డేటా వారే చేసుకుని కార్యాలయానికి వచ్చి రిజిస్ట్రేషన్‌ చేయించుకునే పరిస్థితి ఇప్పటికే ఏర్పడింది. అయితే తరచూ సర్వర్‌ సమస్య తలెత్తడంతో రిజిస్ట్రేషన్‌లు సజావుగా జరగడం లేదు. సోమవారం రోజంతా సర్వర్‌ సమస్య తలెత్తడంతో ఉదయం 10 గంటల వరకు వచ్చిన కక్షిదారులు సాయంత్రం 5 గంటల వరకు వేచి చూసి చివరకు తమ ఇళ్లకు వెళ్లిపోయారు. ప్రతీ రోజూ రిజిస్ట్రేషన్‌ల ద్వారా ప్రభుత్వానికి స్టాంపు డ్యూటీ రూపంలో కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. అయితే ప్రభుత్వం సంబంధిత శాఖపైౖ దృష్టి సరిగ్గా పెట్టకపోవడంతో తరచూ సర్వర్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం ఇటీవల పలు గ్రామాల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో ఆ పట్టాలకు సంబంధించి సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌లు ఉచితంగా చేసి ఇవ్వడానికి ఆదేశాలు జారీచేసింది. కొన్ని రోజులుగా జిల్లాలో ఈ రిజిస్ట్రేషన్‌లు జరుగుతున్నాయి. దీని కారణంగానే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో సర్వర్‌ సమస్య తలెత్తుతోందని అంటున్నారు. సంబంధిత శాఖ అధికారులు దృష్టి పెట్టి రిజిస్ట్రేషన్‌లు సజావుగా అయ్యేలా చూడాలని కక్షిదారులు కోరుతున్నారు.

ఆకివీడు : సర్వర్ల సమస్యలతో రిజిస్ట్రేషన్లకు అంతరాయం ఏర్పడింది. భూములపై పెంచిన మార్కెట్‌ రేట్లను ప్రభుత్వం జూన్‌ నెల నుంచి అమలు చేయనున్నదని రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకోవాలనే ఆలోచనతో జనం కార్యాలయాలకు వస్తున్నారు. పనులు మానుకొని కార్యాలయాలకు వస్తే ఇక్కడకు వచ్చిన తరువాత సర్వర్లు పనిచేయడం లేదని అధికారులు చెప్పతుండడంతో నిరీక్షించి నిరాశతో వెనుతిరుగుతున్నారు. ఉండి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యలయంలో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. సోమవారం సర్వర్‌ సమస్య రావడంతో రిజి స్ట్రేషన్ల కోసం వచ్చిన కక్షిదారులు నిరాశతో వెనుతిరిగారు.

ఈపోస్‌ మొరాయింపు..నిలిచిన సరుకుల పంపిణీ

ఉండి: ఈపోస్‌ సర్వర్‌ మొరాయిం చడంతో రేషన్‌ సరుకుల పంపిణీకి ఆటంకం ఏర్పడింది. సోమవారం ఉదయం ఈపోస్‌ బాగానే పని చేసింది. 11 గంటల నుంచి 4 గంటల వరకు సర్వర్‌ సమస్య తలెత్తడంతో పనిచేయలేదు. దాంతో సరు కులు పంపిణీ నిలిచిపోయింది. పంపిణీ చేసే వ్యాన్‌ వద్ద కార్డు దారులు క్యూకట్టారు. నాలుగు గంటల తరువాత ఈపోస్‌ పని చేయడంతో సరుకులు పంపిణీ చేశారు. బియ్యం ఉచితంగా, పంచదార, కందిపప్పు నగదుకు అందించారు.

Updated Date - Feb 06 , 2024 | 12:09 AM