Share News

వైభవంగా రాములోరి కల్యాణం

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:44 AM

జిల్లావ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు భక్తిశ్రద్ధలతో బుధవారం నిర్వహించారు. ఆలయాల్లో జైశ్రీరామ్‌ నినాదాలు మార్మోగాయి. శ్రీరామనవమి పురస్కరించుకుని రామాలయాలను సుందరంగా అలంకరించారు.

వైభవంగా రాములోరి కల్యాణం
అమీనాపేట కల్యాణ మహోత్సవంలో ఏఆర్‌ ఏఎస్పీ దంపతులు.

మార్మోగిన శ్రీరామ నామస్మరణ

జిల్లావ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు భక్తిశ్రద్ధలతో బుధవారం నిర్వహించారు. ఆలయాల్లో జైశ్రీరామ్‌ నినాదాలు మార్మోగాయి. శ్రీరామనవమి పురస్కరించుకుని రామాలయాలను సుందరంగా అలంకరించారు. భక్తుల కోసం చలువ పందిళ్లను ఏర్పాటుచేసి వైభవంగా రాములోరి కల్యాణం నిర్వహించారు.

ఏలూరు కల్చరల్‌/ఏలూరు కార్పొరేషన్‌/ఏలూరు టూటౌన్‌/ఏలూరు క్రైం/ఏలూరు, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి) : ఏలూరు నగరం, మండలంలోని పాలగూడెం, చాటపర్రు, జాలిపూడి, శ్రీపర్రు, శనివారపుపేట లోని అభయాంజనేయస్వామి, రావిచెట్టు ఆంజనేయస్వామి, రాజయ్య ఆల యంలో శ్రీరామనవమి వేడుకలు నిర్వహించారు. నగరంలోని అంబికాదేవి ఆలయం వద్ద భక్తులు పూజలు చేశారు. అగ్రహారంలోని శ్రీరామ మందిరం, గాంధీనగర్‌లోని చినభద్రాద్రి అని పిలువబడే రామమందిరం తోపాటు ఆంజనేయస్వామి ఆలయాల వద్ద కల్యాణాలు జరిగాయి. ఏలూరు నగరంలో జరిగిన శ్రీరామ నవమి ఉత్సవాల్లో ఉమ్మడి కూటమి ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్‌ కుమార్‌ యాదవ్‌ పాల్గొన్నారు. స్వామిని సందర్శించి పూజలు చేశారు. భక్తులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపి ప్రసాదం అందించారు. శనివారపుపేటలో సీతారామస్వామి దేవస్థానంలో జరిగిన నవమి వేడుకల్లోనూ పూజా కార్యక్రమంలోనూ ఆయన పాల్గొన్నారు. ఏలూరు అమీనాపేటలో ఉన్న ఆంజనేయస్వామి దేవాలయంలో 89వ సీతారాముల కల్యాణ మహోత్సవం ఏఆర్‌ అదనపు ఎస్సీ ఎన్‌ఎస్‌ఎస్‌ శేఖర్‌ దంపతులు పోలీసు బృందాలతో కలిసి నిర్వహించారు. ఆలయ కమిటీ గౌరవాధ్యక్షులు ఏఆర్‌ఆర్‌ఐ పవన్‌కుమార్‌, కమిటీ అధ్యక్షులు ఎఆర్‌ఆర్‌ఎస్‌ఐ భాస్కరరావు, ఏఆర్‌ఎస్‌ఐ పి.రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

దెందులూరు/పెదవేగి/పెదపాడు : దెందులూరు మండలం సోమవరప్పాడులో దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌ సీతారాముల కల్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోతునూరులోని పాతూరు రామాలయంలో వ్యాపారవేత్త దోనేపూడి రాంబాబు, నున్న నరేష్‌ దంపతులు పీటలపై కుర్చుని సీతారామల కల్యాణం నిర్వహించారు, చింతమనేని ప్రభాకర్‌ సతీమణి రాధమ్మ, కుమర్తె నవ్య, టీడీపీ మండల అధ్యక్షుడు మిల్లుబాబు, బీసీ మండల సెల్‌ అధ్యక్షుడు నున్న లక్ష్మాణ్‌ బాబు, భక్తులు పాల్గొన్నారు. పెదవేగి మండలం దుగ్గిరాలలో జరిగిన కల్యాణ వేడుకలో దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ పూజలు నిర్వహించారు. పెదపాడు మండలం అప్పనవీడులోని అభయాంజనేయస్వామి దేవాలయ ఆవరణలో, పెదపాడులోని వీరాంజనేయస్వామి దేవాలయం వద్ద, వట్లూరులోని రామాలయం వద్ద స్వామి వారి కల్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. వట్లూరులో జరిగిన నవమి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ పాల్గొని పూజలు నిర్వహించారు.

బుట్టాయగూడెం/లింగపాలెం/కామవరపుకోట : జంగారెడ్డిగూడెం పట్టణంలోని సీతారామస్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించారు. జంగారెడ్డిగూడెం భగవాన్‌ గొలగమూడి వెంకయ్య స్వామి క్షేత్రంలో శ్రీరామనవమి మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణం నిర్వహించారు. పాలకోడేరుకు చెందిన కునాధరాజు అర్జునరాజు, పార్వతి దంపతులు స్వామి వారి దేవస్థానంలో నిత్య అన్నదానంకు రూ.లక్ష అందజేసినట్టు ఈవో కొండలరావు తెలిపారు. మతసామరస్యానికి ప్రతీకగా జంగారెడ్డిగూడెంలోని జేపీ సెంటర్లో జేపీయూత్‌ అసోసియేషన్‌ నిర్వహించిన శ్రీరామనవమి ఉత్సవాలలో ముస్లింలు పాల్గొని హిందూ సోదరులకి సంఘీభావం తెలిపారు. భక్తులకు పానకం, పులిహార, వడపప్పు ప్రసాదంగా అందించారు. లింగపాలెం మండలంలోని లింగపాలెంలోని సీతారామాం జనేయ స్వామి దేవాలయంలో కూటమి అభ్యర్థి సొంగా రోషన్‌కుమార్‌ పూజలు నిర్వహించారు. రెండో అన్నవరంగా భావించే రంగాపురంలోని సత్యనారాయణస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. కామవరపుకోట మండలం జీలకర్రగూడెం లోని రామాలయం వద్ద జమిందారు రాజారాఘవరాజు సుబ్బరాజు కుటుంబసభ్యులు కల్యాణం నిర్వహించారు.

పోలవరం/బుట్టాయగూడెం/టి.నరసాపురం/జీలుగుమిల్లి : పోలవరం మండలంలో గూటాల లక్ష్మీనరసింహస్వామి ఆలయం కోదండ రామాలయం, కొత్తపట్టిసీమ రామాలయం, పట్టిసీమ రామాలయం తదితర గ్రామాల్లోని రామాలయాల్లో సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించారు. బుట్టాయగూడెం మండలం దుద్దుకూరు రామాలయంలో జరిగిన నవమి వేడుకల్లో ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, రాజ్యలక్ష్మి దంపతులు పూజలు నిర్వహించారు. వీరభద్రపురం గిరిజన గ్రామంలో పానకానికి అవసరమైన బెల్లం, మిరియాలు తదితరాలను తపన ఫౌండేషన్‌ అధినేత గారపాటి సీతారామాంజనేయ చౌదరి వితరణ చేశారు. టి.నరసాపురం మండలంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జీలుగుమిల్లి మండలం జీలుగుమిల్లి కోదండ రామాలయంలో సీతారాముల కల్యాణం అర్చకులు తనికెళ్ల రామకృష్ణశర్మ, రవిశర్మ శాస్త్రోక్తంగా జరిపించారు.

ఉంగుటూరు/భీమడోలు/ఉంగుటూరు మండలంలోని పలు గ్రామాల్లో వున్న రామాలయాలు, భీమడోలు మండలంలోని పలు గ్రామాల్లో శ్రీరామ నవమి వేడుకలు జరిగాయి. భీమడోలు, సూరప్పగూడెం, ద్వారకానగర్‌ తదితర ప్రాంతాల్లోని రామాలయాలను గన్ని వీరాంజనేయులు సందర్శించి పూజలు నిర్వహించారు.

కుక్కునూరు : కుక్కునూరు మండలంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాడవాడలా చలవు పందెళ్లు ఏర్పాటు చేసి సీతారాముల కల్యాణం జరిపించారు.

గణపవరం : గణపవరం మండలం సరిపల్లెలోని టీటీడీ కల్యాణ మండపంలో శ్రీగాయిత్రీ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సీతారామ కల్యాణం వైభవంగా నిర్వహించారు. అనంతరం అన్నసమారాధన జరిగింది.

చింతలపూడి, ఏప్రిల్‌ 17: చింతలపూడి మారుతినగర్‌లోని ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో సీతారాముల కల్యాణం నిర్వహించారు. ఆలయంలో కూటమి ఉమ్మడి అభ్యర్థి సొంగా రోషన్‌కుమార్‌ పూజలు చేసి కొద్దిసేపు అన్నసమారాధనలో పాల్గొన్నారు. యర్రగుంటపల్లి సమీపంలోని రామునిగట్టు వద్ద రామరామలింగేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించిన సీతారామకల్యాణోత్సవానికి బీజేపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి దంపతులు పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి, పూజలు నిర్వహించారు. సినీపాటల రచయిత అనంతశ్రీరామ్‌, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - Apr 18 , 2024 | 12:44 AM