సార్ వచ్చారని తొలగించారు..కానీ
ABN , Publish Date - Feb 06 , 2024 | 12:07 AM
ఏడాదిన్నర క్రితం ముఖ్యమంత్రి నరసాపురం పర్యటనకు విచ్చేసి నప్పుడు భద్రతా కారణాల దృష్యా అప్పట్లో పట్టణంలోని స్పీడ్ బ్రేకర్లను తొల గించారు. 14 నెలలు గడిచినా వీటిని పునర్ నిర్మించలేదు.
వేయడం మరిచారు
సీఎం పర్యటనలో స్పీడ్ బ్రేకర్లు తొలగింపు
14 నెలలు గడిచినా నోచుకోని పనులు
ఆ ప్రదేశంలో తరుచూ ప్రమాదాలు
నరసాపురం, ఫిబ్రవరి 5:మూడు నెలల క్రితం నరసాపురం పట్టణం లోని మిషన్ హైస్కూల్ రోడ్‌లో వేగంగా వెళుతున్న రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరూ చనిపోగా మరో ప్రభుత్వ ఉద్యోగి తీవ్రంగా గాయపడ్డారు. మెరుగైన వైద్యం అందుకుని ఆ ఉద్యోగి కోలు కున్నారు. ఇలాంటి సంఘటనలే గడిచిన ఏడాది కాలంలో అనేకం జరిగాయి. పట్టణంలో ఎంతో ప్రధానమైన రహదారి కావడంతో ఎప్పుడూ ట్రాఫిక్ రద్దీగా కనిపిస్తుంది. పంజా సెంటర్ నుంచి జగన్నాధస్వామి గుడి వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర ఉన్న ఈ డబల్ రోడ్డులో గతంలో స్పీడ్‌బ్రేకర్లు ఉండేవి. ఇవి వాహనాల స్పీడ్‌ను కంట్రోల్ చేసేవి. అయితే ఏడాదిన్నర క్రితం ముఖ్యమంత్రి నరసాపురం పర్యటనకు విచ్చేసి నప్పుడు బహిరంగ సభను వీవర్స్ కాలనీలో ఏర్పాటు చేశారు. సరిపల్లిలో హెలికాప్టర్ దిగిన సీఎం ఈ రహదారి నుంచే సభా వేదిక వద్దకు వెళ్లారు. భద్రతా కారణాల దృష్యా అప్పట్లో పట్టణంలోని స్పీడ్ బ్రేకర్లను తొల గించారు. 14 నెలలు గడిచినా వీటిని పునర్ నిర్మించలేదు. ఈ రోడ్‌లో మిషన్ హైస్కూల్‌తో పాటు మరో కార్పొరేట్ స్కూల్ కూడా ఉంది. ఈ స్కూల్ వెనుక మరో విద్యా సంస్థ కూడా ఉంది. నిత్యం వందలాది మంది విద్యార్ధులు ఈ మార్గం గుండా వెళ్లుతుంటారు. తరుచూ ప్రమాదాలు జరుగు తుండటంతో చాలామంది తల్లితండ్రలు పిల్లల్ని స్వయంగా తీసు కొచ్చి స్కూళ్ళ వద్ద విడిచిపెడుతున్నారు. ప్రమాదాల నివారణకు స్పీడ్ బ్రేకర్లు వేయాలని ఆనేక సార్లు కమిషనర్‌కు విన్నవించారు. స్పందనలో అనేక సార్లు ఫిర్యాదులు చేశారు.అయినా స్పందన లేదు. దీనిపై కమిషనర్ వెంకటేశ్వరావు వివరణ ఇస్తూ గతంలో ఉన్న స్పీడ్ బ్రేకర్ల స్ధానంలోనే పునర్ నిర్మించేందుకు టెండర్లు పిలిచాం. త్వరలో పనులు చేపడతాం, వీటితో పాటు మిగిలిన చోట్ల కూడా స్పీడ్ బ్రేకర్లు వేస్తున్నట్లు చెప్పారు.