Share News

అక్రమ మద్యం కట్టడికి ప్రత్యేక బృందాలు

ABN , Publish Date - Mar 27 , 2024 | 12:15 AM

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా పోలీస్‌ యంత్రాంగం అప్రమత్తమైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ మద్యం జిల్లాకు రానివ్వకూడదని ఎన్నికల సమయంలో ఓటర్లకు మద్యాన్ని ప్రలోభాలుగా చేయడానికి వీలులేకుండా జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి కట్టడి చర్యలు చేపట్టారు.

అక్రమ మద్యం కట్టడికి ప్రత్యేక బృందాలు
అల్లిపల్లి చెక్‌పోస్టు వద్ద ఆర్టీసీ బస్సు తనిఖీ చేస్తున్న అదనపు ఎస్పీ స్వరూపరాణి

జిల్లా వ్యాప్తంగా రంగంలోకి దిగిన బృందాలు

చేపలు, రొయ్యల మేత, కోళ్ల వ్యర్ధాల లోడుల్లో రవాణా

ఏలూరు క్రైం, మార్చి 26 : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా పోలీస్‌ యంత్రాంగం అప్రమత్తమైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ మద్యం జిల్లాకు రానివ్వకూడదని ఎన్నికల సమయంలో ఓటర్లకు మద్యాన్ని ప్రలోభాలుగా చేయడానికి వీలులేకుండా జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి కట్టడి చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి, ఎస్‌ఈబీ అదనపు ఎస్పీ సూర్యచంద్ర రావుల ఆదేశాలతో ప్రత్యేక బృందాలను జిల్లాలో ఏర్పాటు చేశారు. గత ఎన్నికల్లో ఎక్కడెక్కడ అక్రమ మద్యం నిల్వలపై కేసులు నమోదు చేశారో ఆ కేసుల వివరాలు అందులోని ముద్దాయిల వివరాలు, ప్రస్తుతం వారి స్ధితి గతులు ఏ పార్టీ నాయకునికి వారు ఉన్నారో వంటి వివరాలపై ఆరా తీస్తు న్నారు. అంతేకాకుండా ఇప్పటికే జిల్లాకు పశ్చిమ బెంగాల్‌, ఒడిశా, ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాల నుంచి కొన్ని చేపల లోడు, కొన్ని రొయ్యల మేత, రొయ్య పిల్లల రవాణా ముసుగులో లారీలు, కంటైనర్లలో అక్రమ మద్యం జిల్లాకు వస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. అదే విధంగా తెలంగాణా రాష్ట్రం నుంచి కోళ్ల వ్యర్ధాల లోడులలో ఈ అక్రమ మద్యం జిల్లాకు తీసుకువస్తున్నారని సమాచారం ఉండడంతో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు. గతంలో అక్రమ మద్యాన్ని తరలించే సమయంలో రవాణాను ఏ విధంగా వినియోగించారు. అందుకు ఎలాంటి వాహనాలు వినియోగించారు వంటి వాటిని అధికారులు పరిశీలన చేస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌ పోస్టులను ఏర్పాటు చేశారు. త్వరలోనే జిల్లా సరిహద్దుల్లో కూడా చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలకు చర్యలు చేపట్టనున్నారు.జిల్లా ఎన్నికల అధికారులు ఇప్పటికే ఆకస్మికంగా వివిధ చెక్‌పోస్టుల వద్ద ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి కూడా స్వయంగా ఏలూరు జిల్లా సరిహద్దులో ఉన్న తెలంగాణ రాష్ట్ర చెక్‌పోస్టులను తనిఖీ చేశారు. జిల్లా అదనపు ఎస్పీ స్వరూపరాణి మంగళవారం సాయంత్రం చింతలపూడి మండలంలోని అల్లిపల్లి, లింగాయి గూడెం చెక్‌పోస్టులను పరిశీలించారు. గంజాయి, నాటుసారా, మద్యం, నగదు అక్రమ రవాణా జరుగకుండా స్వయంగా పరీక్షించి అక్కడ ఉన్న సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అక్రమ మద్యం జిల్లాకు వివిధ మార్గాల్లో వస్తుందన్న సమాచారంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాల్లో నిఘా ఉంచారు.

నియంత్రణకు ఉమ్మడి దాడులు

నూజివీడు, మార్చి 26 : ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లో ఉమ్మడి దాడులకు చర్యలు తీసుకోవాలని ఖమ్మం, ఏలూరు జిల్లాల అధికారులు నిర్ణయించారు. నూజివీడు సారఽథి ఇంజినీరింగ్‌ కళాశాలలో మంగళవారం ఇరు రాష్ర్టాలకు సంబంధించి అనధికార మద్యం నియంత్రణపై ఇంటర్‌ స్టేట్‌ కో–ఆర్డినేషన్‌ సమావేశం నిర్వహించారు. ఏలూరు జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సూపరింటెండెంట్‌ కె.రామకృష్ణ, అదనపు ఎస్పీ సూర్య చంద్రరావు,ఖమ్మం జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ జి.నాగేంద్రరెడ్డి, అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఎన్‌.వేణుగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. ఏలూరు జిల్లా సరిహద్దులోని తెలంగాణ రాష్ట్ర ప్రాంతాల్లో అధికారిక బెల్టుషాపులు ఉండ టంతో ఏలూరు జిల్లాలో అనధికారికంగా మద్యం రవాణాను అరికట్టడంలో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. నేరుగా షాపుల నుంచి లిక్కర్‌ కొన కుండా బెల్టుషాపులో లిక్కర్‌ కొనుగోలు చేస్తున్న రవాణాదారులు, మద్యాన్ని సరిహద్దులు దాటిస్తున్నారని ఈ నేపథ్యంలో ఇరు రాష్ర్టాల అధికారులు ఉమ్మడిగా దాడులు చేయాల్సిన అవసరం ఉందని నిర్ణయించారు. అదేవిధంగా రాష్ట్రంలోకి తెలంగాణ, యానాం, గోవా నుంచి మద్యం రవాణా అవుతోందని, ప్రధానంగా గుడ్లు, చేపలు తదితర రవాణా లారీలలో రహస్యంగా ఉంచిన ర్యాక్‌లో మద్యం ఉంచి రవాణా చేస్తుండటంతో వాటిని పట్టుకోవడం కష్టంగా ఉందని, ఈ పరిస్థితిని నివారించేందుకు ప్రత్యేక నిఘాను కొన సాగిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సత్తుపల్లి ఎక్సైజ్‌ సీఐ సి.ప్రవీణ్‌ కుమార్‌రెడ్డి, నూజివీడు సెబ్‌ సీఐ రమణ, ఎస్సై కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 27 , 2024 | 12:15 AM