Share News

జరభద్రం

ABN , Publish Date - Jul 28 , 2024 | 12:23 AM

వర్షాకాలం వచ్చిందంటే పాము కాటు కేసులు ఎక్కువగా నమోదవుతాయి. వర్షాలకు పొదలు, అడవులు, పుట్టలు వర్షపు నీటితో నిండి ఉంటాయి.

జరభద్రం

వర్షాకాలంలో పెరుగుతున్న పాముకాటు కేసులు

బాధితుల్లో అత్యధికులు రైతులు, వ్యవసాయ కూలీలే

పోలవరం, జూలై 27 : వర్షాకాలం వచ్చిందంటే పాము కాటు కేసులు ఎక్కువగా నమోదవుతాయి. వర్షాలకు పొదలు, అడవులు, పుట్టలు వర్షపు నీటితో నిండి ఉంటాయి. ఈ సందర్భాల్లో పాముల ఆవాసాలు నీటితో నిండిపోవడంతో ప్రాణ రక్షణ కోసం, ఆహారం కోసం సమీప జనావాసాల్లోకి, పంటచేలల్లోకి చేరతాయి. ఎలుకలు, కప్పలు వంటి వాటి ఆహారాల కోసం ధాన్యపు గాదెలు, గడ్డి మేట్లు, పొలం గట్లపైకి, ఆకుమడుల్లోకి తరలి వస్తాయి. అది గమనిం చని రైతులు, వ్యవసాయ కూలీలు, నివాసాల్లో మహిళలు, పిల్లలు తరచూ పాము కాటుకి గురవుతూ ఉంటారు. నిజానికి రైతులకు పాములు మేలు కూడా చేస్తాయి. పంట పొలాల్లో ఎలుకలు చేసే పంట నష్టం అంతా ఇంతా కాదు. కలుగుల్లో దాగివున్న ఎలుకలను పాములు ఆహారంగా తీసుకోవడం ద్వారా పాములు రైతుకు ఎంతో ఉపయోగపడతాయి. అలా అని అప్రమత్తంగా లేకుంటే రైతులకు ప్రమాదం ఎదురవ్వొచ్చు. ప్రపంచంలో 3,789 పాము జాతులుండగా మన దేశంలో 740 జాతులు ఉన్నాయి. వీటిలో అత్యంత ప్రమాదకరమైన, విషపూరితమైనవి 72 మాత్రమే. అదే ఉమ్మడి పశ్చిమ జిల్లాలో ఎనిమిది విషపూరితమైన పాములున్నాయి.

ఈ జాగ్రత్తలు తీసుకోండి

ఈ వరదలు, వర్షాకాలం సీజనులో పాముకాటు, విషకీటకాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నివాసాల వద్ద గుబురుగా పొదలు పెరగనీయరాదు. ఎలుక లు, కప్పలు, తొండలు వంటి పాముల ఆహారాలు చేరకుండా నివాసాలు, ధాన్యపు గాదెల వద్ద బ్లీచింగ్‌, గమాక్సిన్‌ లాంటి ఘాటైన వాసన కలిగించే పౌడర్లు జల్లడం చేయడం వల్ల పాములు, విషకీటకాలు రాకుండా నివారించవచ్చు. పొలం పనులకు వెళ్లే రైతులు, వ్యవసాయ కూలీలు, చేలగట్ల మీద నడిచేటప్పుడు పొడవాటి కర్ర తీసుకుని శబ్ధం చేసుకుంటూ వెళ్లడం వల్ల పాములు విషకీటకాలు ఉంటే పక్కకు తప్పుకుంటాయి. కాళ్ళకు చెప్పులు, చీలమండల వరకు జీన్‌ ఫ్యాంటు లాంటి వస్ర్తాలు ధరించడం లేదా అరికాలి నుంచి మోకాలి దాకా శరీరాన్ని కప్పి ఉంచే గమ్‌ బూట్లు ధరించడం శ్రేయస్కరం.చీకటిలో వెళ్ళే సందర్భంలో తప్పనిసరిగా టార్చిలైట్లు వాడాలి.

పాము కాటు వేస్తే..

పాముల్లో తల త్రికోణాకారం ఉన్న పాములు మరింత విషపూరితం. వాటిలో నాగుపాము (కోబ్రా) , కట్ల పాము (క్రెయిట్‌) , పొడ లేదా పింజరి (వైపర్‌ ) ఈ జాతుల పాములు కాటు వేసిన వెంట నే కాటు వేసిన ప్రాంతంలో సబ్బుతో కడిగి ఏదైనా వాహనంలో సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించాలి. మంత్రాలు నాటు మందుల పేరిట జాప్యం చేస్తే ప్రాణాలకు హాని కలిగే అవకాశం ఉంటుంది. ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో పాముకాటు విరుగు డు ఇంజక్షన్లు (యాంటీవీనమ్‌) అందు బాటులో ఉన్నాయి. ముఖ్యంగా పాము కాటుకి గురైన వ్యక్తికి మానసిక ధైౖర్యం అందించి వైద్యానికి తీసుకువెళ్ళాలి. చాలా పాముకాటు మరణాలకు విషం ప్రభావం కంటే ఆందోళనతో గుండెపోటు రావడమే కారణాలుగా నిలిచాయి.

ఉమ్మడి జిల్లాలో 300 పాము కాట్లు

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏటా మూడు వందలకుపైగా పాము కాటు కేసులు నమోదవుతున్నాయి. వీటిలో సుమారు 80 మంది వరకు మృత్యువాత పడుతుండగా వీరిలో రైతులే ఎక్కువగా ఉంటున్నారు. వర్షాకాలంలో రైతులు పొలా ల్లోకి వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసు కోవాలి.

పాముకాటుతో ఇద్దరు రైతులకు అస్వస్థత

మండలంలో పాముకాటుతో శనివారం ఇద్దరు రైతులు అస్వస్థతకు గురయ్యారు. పోలవరం ప్రభుత్వ సా మాజిక వైద్య ఆరోగ్య కేంద్రం వైద్యాధి కారి కృష్ణంరాజు తెలిపిన వివరాల ప్రకారం పట్టిసీమకు చెందిన పోశీరావు, రామయ్యపేటకు చెందిన దుర్గాప్రసాద్‌ పాముకాటుకు గురయ్యారని వారికి చికిత్స అందించినట్టు తెలిపారు. మండ లంలో ఈ ఏడాది జూన్‌లో మూడు పాముకాటు కేసులు, జూలైలో 15 పాముకాటు కేసులు నమోదయ్యాయి. వాటిలో 15 కేసులు విషపూరిత పాము కాట్లు కాగా మిగతావి సాధారణ పాముకాటు కేసులని తెలిపారు.

Updated Date - Jul 28 , 2024 | 12:23 AM