Share News

ఎంపీ అభ్యర్థి ఎవరు ?

ABN , Publish Date - Jan 28 , 2024 | 11:51 PM

సార్వత్రిక ఎన్నికల్లో నర్సాపురం ఎంపీ అభ్యర్థి కోసం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కుస్తీ పడుతోంది.గోకరాజు గంగరాజు కుటుంబం నుంచి ఒకరిని నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

ఎంపీ అభ్యర్థి ఎవరు ?

వైసీపీలో అన్వేషణ ..గంగరాజు కుటుంబంపై దృష్టి

నరసాపురంలో దీటైన అభ్యర్థి కోసం కసరత్తు

తాజాగా తెరపైకి న్యూస్‌ యాంకర్‌ శ్వేత వర్మ

టీడీపీ–జనసేన కూటమిలో నేనున్నానంటూ రఘురామరాజు

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

సార్వత్రిక ఎన్నికల్లో నర్సాపురం ఎంపీ అభ్యర్థి కోసం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కుస్తీ పడుతోంది. ఆ పార్టీ నాయకుడు గుబ్బల తమ్మయ్యతో ఇటీవల ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి నేరుగా సంప్రదించారు. ఎంపీ బరిలో ఉండాలంటూ సూచించారు. ఆర్థిక స్థోమతతో సంబంధం లేదంటూ భరోసా ఇచ్చారు. అందుకు తమ్మయ్య కూడా అంగీకారం తెలిపారు. తాజాగా మరో అభ్యర్థి కోసం పార్టీ దృష్టి సారించింది. గోకరాజు గంగరాజు కుటుంబం నుంచి ఒకరిని నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తోంది. వాస్తవానికి గోకరాజు గంగరాజు కుటుంబం నుంచి పెదబుజ్జి రంగంలో ఉండే అవకాశం ఉందని గతంలో అంతా భావించారు. అయితే అందుకు ఆ కుటుంబం సుముఖత చూపలేదు. ఎంపీ బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపకపోవడంతో ప్రత్యామ్నాయంగా తమ్మయ్య పేరును పరిశీలించింది. అయితే తెలుగుదేశం–జనసేన కూటమి అభ్యర్థిగా బరిలో ఉంటున్నానని ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు. సంక్రాంతికి భీమవరం విచ్చేసిన ఆయన అన్ని వర్గాలతోనూ భేటీ అయ్యారు. ఎంపీ బరిలో ఉంటున్నట్టు ప్రకటించారు. అందుకు ధీటైన అభ్యర్థికోసం ఇప్పుడు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ కసరత్తు చేస్తోంది. క్షత్రియ సామాజిక వర్గం నుంచే బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపడానికి అన్వేషిస్తోంది. గతంలో ఎలక్ర్టానిక్‌ మీడియా యాంకర్‌గా పనిచేసిన శ్వేత వర్మ అనే మహిళను ఇప్పుడు ఎంపీ బరిలోకి దింపితే ఎలా ఉంటుందనే విషయాన్ని ఆరాతీస్తోంది. సదరు మహిళ కూడా గోకరాజు గంగరాజుకు దూరపు బంధువు. మరోవైపు ఎమ్మెల్యే చెరుకువాడ రంగరాజుకు బంధువుగా చెపుతున్నారు. మొత్తంపైన రఘురామకృష్ణంరాజుకు ధీటుగా అదే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని రంగంలోకి దింపాలని వైసీపీ యోచిస్తోంది. వైసీపీ ప్రయత్నాలు చేసిన వారంతా వెనుకంజ వేస్తూ వచ్చారు. సొంత సర్వేలు కూడా నిర్వహించుకున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందన్న విషయాన్ని సర్వే ద్వారా గమనించారు. దాంతో వైసీపీ తరపున పోటీ చేయక పోవడమే మేలన్న భావనకు వచ్చేశారు. తాజాగా అటు గోకరాజు, ఇటు చెరుకువాడకు బంధువైన మహిళపై వైసీపీ దృష్టి పెట్టింది. ఆమె భర్త విదేశాల్లో సాఫ్ట్‌వేర్‌గా ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. పెనుమంట్ర మండలం ఓడూరు గ్రామానికి చెందిన ఆమెను హుటాహుటిన స్వదేశానికి రప్పించారు. తాడేపల్లి ప్యాలెస్‌లో మంతనాలు చేస్తున్నారు. పార్టీయే ఆర్థిక చేయూత నిచ్చి ఎంపీ బరిలో నిలిపేందుకు ముందుకొచ్చింది. దాంతో ఆ మహిళ ఆసక్తి చూపుతున్నారు. మొత్తంపైన నరసాపురం ఎంపీ అభ్యర్థి కోసం వైసీపీ మల్లగుల్లాలు పడుతోంది.

Updated Date - Jan 28 , 2024 | 11:51 PM