Share News

బడి గంట మోగింది

ABN , Publish Date - Jun 12 , 2024 | 11:56 PM

కొత్త ప్రభుత్వం.. కొత్త విద్యా సంవత్సరంతో గురువారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతున్నాయి.

బడి గంట మోగింది
ముస్తాబైన కైకలూరు మండలం రామవరం ఎంపీపీ స్కూల్‌

నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం

ఏలూరు ఎడ్యుకేషన్‌, జూన్‌ 12: కొత్త ప్రభుత్వం.. కొత్త విద్యా సంవత్సరంతో గురువారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతున్నాయి. జగన్‌ ప్రభుత్వ ఐదేళ్ళ విధ్వంసకర విద్యా విధానాలతో విసిగిపోయిన టీచర్లు నూతనంగా కొలువు తీరిన కూటమి ప్రభుత్వంలో ఉపశమనాన్ని కోరుకుంటున్నారు. ఎనిమిది రకాల పాఠశాలల విధానంతో బాల బాలికలకు ప్రభుత్వ విద్యా రంగాన్ని దూరం చేసిన వైసీపీ పాలన అస్తవ్యస్థ నిర్ణయాలకు కొత్త ప్రభుత్వం చెక్‌ పెడుతుందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆశిస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వ యాజమాన్యంలో మొత్తం 1818 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశా లుండగా, ఎల్‌కేజీ నుంచి పదో తరగతి వరకు మొత్తం 1,46,361 మంది బాల బాలికలు చదువుతున్నారు. ప్రైవేటు రంగంలో 495 ఉండగా, వీటిలో 1,45,497 మంది విద్యార్థులు వున్నారు. సంఖ్యాపరంగా ప్రభుత్వ పాఠశాలలు జిల్లాలో ఎక్కువగానే వున్నా వాటిలో చదువుతున్న విద్యార్థుల సంఖ్యను పరిశీలిస్తే ప్రైవేటు పాఠశాలల్లో స్వల్ప సంఖ్యలో ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 7,734 మంది ఉపాధ్యాయులు వుండగా, ఎయిడెడ్‌లో 122 మంది, ప్రైవేటు పాఠశాలల్లో 4,832 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. పాఠశాలలు తెరుచుకుం టున్న వేళ విద్యార్థులకు ఎనిమిది రకాల వస్తువులతో కూడిన స్టూడెంట్‌ కిట్లను పంపిణీ చేయడానికి విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు ఏ ఒక్క స్కూలులోను ఉపాధ్యాయుల కొరత లేకుండా తాత్కాలిక సర్దుబాట్లతో సమస్య పరిష్కారానికి అధికారులు ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. మరోవైపు కేవలం 228 పోస్టులతో అరకొర డీఎస్సీని గత ప్రభుత్వం ప్రకటించగా, ఇపుడు కొత్త ప్రభుత్వం మెగా డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌కు సమాయత్తమవుతోంది. మెగా డీఎస్సీలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు ఎన్ని పోస్టులు కేటాయించిందీ గురువారమే స్పష్టత రానుంది. అమ్మఒడిస్థానే కొత్త ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పేరిట కుటుంబంలో పిల్లల సంఖ్యతో పరిమితం చేయకుండా ఒక్కో విద్యార్థికి ఏడాదికి రూ.15 వేలు చొప్పున తల్లి బ్యాంకు ఖాతాకు జమ చేయడానికి ఉద్దేశించిన కొత్త పథకంలో ఆర్థిక సాయం కోసం ఎదురుచూసే తల్లులూ లేకపోలేదు.

ఎమ్మెల్యేలతో స్టూడెంట్‌ కిట్ల పంపిణీ

ప్రభుత్వ పాఠశాలల బాల బాలికలకు పంపిణీ చేసేందుకు ఉద్దేశించిన స్టూడెంట్‌ కిట్‌ల సరఫరాపై సమగ్ర శిక్ష ఉన్నతాధికారులు స్పష్టతనిచ్చారు. వాస్తవానికి పాఠశాలలు ప్రారంభమైన రోజునే మొత్తం ఎనిమిది రకాల వస్తువులతో కూడిన స్టూడెంట్‌ కిట్‌లను విద్యార్దులకు పంపిణీ చేయాల్సి ఉండగా, రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు కావడం, పూర్తిస్థాయిలో వస్తువులు పంపిణీ కాకపోవడం తదితర కారణాలతో ఒకటి, రెండు రోజు లు ఆలస్యమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ఆ ప్రకారం తాజాగా వెలువ డిన మౌఖిక ఆదేశాల ప్రకారం జిల్లాకు అందిన స్టూడెంట్‌ కిట్‌ల పంపిణీని కొత్తగా ఎన్నికైన స్థానిక ఎమ్మెల్యేలతో చేపట్టాలని ఉన్నతాధికారులు సూచిం చారని ఎస్‌ఎస్‌ఏ స్థానిక అధికారిక వర్గాలు తెలిపాయి. దీనికి అనుగు ణంగానే ఎమ్మెల్యేల సూచనల మేరకు స్టూడెంట్‌ కిట్‌లను బాల బాలికలకు అందజేయనున్నారు. ఏలూరు జిల్లాకు సంబంధించి బ్యాగులు, యూనిఫాం దుస్తులకు సరిపడా వస్త్రం మొత్తం 1,36,316 మంది విద్యార్థు లకు, బెల్టులు 94,017 మందికి, నోట్‌ పుస్తకాలు 8,39,948, పాఠ్య పుస్తకాలు 12.06 లక్షలు, బూట్లు 1,36,868 మందికి, ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలు 16,075 మందికి అందజేయనున్నారు. వీటిలో బుధవారం వరకు నోట్‌ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, బెల్టులు మాత్రం స్కూల్‌ పాయింట్‌లకు సరఫరా కాగా, మిగతా వస్తువులు జిల్లాకు కొద్ది రోజుల్లోనే వస్తాయని అధికారులు వివరించారు.

Updated Date - Jun 12 , 2024 | 11:56 PM