పారిశుధ్య కార్మికులపై... శీతకన్ను!
ABN , Publish Date - Jul 05 , 2024 | 11:50 PM
జంగారెడ్డిగూడెం మునిసిపాలిటీలో పారిశుధ్య కార్మికులను అధికార వైసీపీ పాలక వర్గం, అఽధికారులు మూడేళ్లుగా పట్టించుకోలేదు. వారికి కల్పించాల్సిన కనీస సదుపాయాలపై కనీసం కన్నెత్తి చూడలేదు.

జంగారెడ్డిగూడెం మునిసిపాలిటీలో ఇదీ వరుస..
పారిశుధ్య, ఇంజినీరింగ్ విభాగ కార్మికులకు సదుపాయాల ఊసే లేదు
చేతులకు గ్లౌజులు, కాళ్లకు బూట్లూ కరువే..
మూడేళ్లుగా పట్టించుకోని అధికారులు, పాలకవర్గం
జంగారెడ్డిగూడెం, జూలై 5 :
జంగారెడ్డిగూడెం మునిసిపాలిటీలో పారిశుధ్య కార్మికులను అధికార వైసీపీ పాలక వర్గం, అఽధికారులు మూడేళ్లుగా పట్టించుకోలేదు. వారికి కల్పించాల్సిన కనీస సదుపాయాలపై కనీసం కన్నెత్తి చూడలేదు. కోట్ల రూపాయల ఆదాయం వచ్చే జంగారెడ్డిగూడెం పట్టణాభివృద్ధిలో భాగమైన పారిశుధ్య కార్మికులపై పూర్తిగా నిర్లక్ష్యం వహిం చారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో తమ సమస్యలు తీరుతాయన్న ఆశాభా వంతో కార్మికులు ఉన్నారు.
కరోనా కష్ట కాలంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయ కుండా పారిశుధ్య కార్మికులు పట్టణాన్ని పరి శుభ్రంగా ఉంచారు. నిత్యం పట్టణంలో ఎండా, వానా, చలి లెక్క చేయకుండా పట్టణ పరిశుభ్రత కోసం అహర్నిశలు కృషి చేసే పారిశుధ్య కార్మి కులు తమ చేతులకు గ్లౌజులు లేకుండా కాళ్ళకు బూట్లు, తలకు టోపీ, శరీరానికి రెయిన్ కోట్లు ఏమీ లేకుండా తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చెత్త చెదారాలను ఎత్తి చెత్త రిక్షాలోనో, ట్రాక్ట్టర్‌లోనో వేస్తున్నారు. ఇది వారి ఆరోగ్యా నికి తీవ్ర హాని చేస్తుందని తెలిసినా విధులు నిర్వహిస్తున్నారు. గత ఐదేళ్లుగా పారిశుధ్య కార్మికులకు వైద్య శిబిరాలు నిర్వహించలేదు. కొందరు కార్మికులు తమ సొంత ఖర్చులతో గ్లౌజులు కొనుక్కుని వాడుతున్నారు. తమకు మౌలిక సదుపాయలు కల్పించాలని ఎన్నిసార్లు అడిగినా అప్పటి మునిసిపల్ కమిషనర్లు ప్రభుత్వం హెల్త్ అలవెన్సు రూ.6 వేలు ఇస్తోందని కాబట్టి పారిశుధ్య కార్మికులకు తామేమీ ఇవ్వన వసరం లేదని తేల్చి చెప్పడం గమనార్హం. మరోవైపు కార్మికులకు పాలక వర్గం నుంచి కూడా సహకారం లేకపోవడంతో చేసేది లేక మిన్నకుండి పోయారు. గతనెలలో జరిగిన మునిసిపల్ సాధారణ సమావేశంలో ఎన్నికల ముందు కమిషనర్‌గా బాధ్య తలు చేపట్టిన జె.నరేంద్ర కుమార్ మునిసిపాలిటీ తరపున పారిశుధ్య కార్మికులకు, ఇంజనీరింగ్ విభాగ కార్మికులకు సబ్బులు, గ్లౌజులు, బూట్లు, రెయిన్‌కోట్లు, కొబ్బరినూనె, యూనిఫాం, మాస్కులు, చెప్పులు వంటివి కొనుగోలు చేయడానికి పురపాలక సంఘ సాధారణ నిధుల నుంచి రూ.5 లక్షల నిధులు కేటాయించగా మునిసిపల్ కౌన్సిల్ ఆమోదించింది. ప్రస్తుతం వర్షాకాలం కాబట్టి తక్షణం నిధులు విడుదల చేసి తమకు వస్తు సామగ్రి అందించి సదుపాయాలు కల్పించాలని కార్మికులు కోరుతున్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం పారిశుధ్య కార్మికుల సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
మూడేళ్లుగా పట్టించుకోలేదు..
మున్సిపల్ పారిశుధ్య కార్మికులు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ఎంతో కష్టపడతారు. గత మూడేళ్లుగా కార్మికులకు పనిలో అవసరమైన సామగ్రి అందించడంలో విఫలమయ్యారు. కమిషనర్ నరేంద్రకుమార్ ఈ ఏడాది కార్మికుల మౌలిక సదుపాయాల కోసం రూ.5 లక్షలు బడ్జెట్ కేటాయించడం హర్షణీయం. నూతన ప్రభుత్వం అపరిష్కృతంగా ఉన్న మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి.
– జె.వి.రమణ రాజు, గౌరవ అధ్యక్షుడు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్
అపరాధ రుసుం విధించేది..
గత మూడేళ్లుగా పారి శుధ్య కార్మికులకు ఎందుకు మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని అప్పటి కమిషనర్‌ను ప్రశ్నించగా ప్రభుత్వం వీరికి రూ.6వేలు హెల్త్ అలవెన్సు అందిస్తోందని, ఇక వీరికి ఏమీ ఇవ్వనవపరం లేదన్నారు. 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వం హయాంలో 279 జీవో అమలులో ఉండేది. ఆ సమయంలో కొవ్వూరు, జంగా రెడ్డి గూడెం మునిసిపాలిటీల్లో పారిశుధ్య కార్మికుల కాంట్రాక్టర్‌గా ఉన్నాను. పారి శుధ్య కార్మికులకు అవరసమైన వస్తువులు, సదుపాయాలు క్రమం తప్పకుండా ఇచ్చాం. పారిశుధ్య కార్మి కులకు డ్రెస్ కోడ్ అమలు చేశాం. కార్మికులు పని చేయడానికి, వారు అనారోగ్యం బారిన పడకుండా అవసర మైన వస్తు సామగ్రి అందించకపోతే ప్రభుత్వం మాకు అపరాధ రుసుము విధించేది.
– ఏవీ.రమణమూర్తి, కౌన్సిలర్, మాజీ పారిశుధ్య కార్మికుల కాంట్రాక్టర్