ఇసుక మంట
ABN , Publish Date - Jul 28 , 2024 | 12:01 AM
ఉచిత ఇసుక బ్లాక్ మార్కెట్ పరమైంది. సామాన్యులకు అందని ద్రాక్షగా మారుతోంది. పది రోజులుగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో రావులపాలెం స్టాక్ పాయింట్ మినహా మిగిలిన అన్నిచోట్ల ఇసుక ఎగుమతులు నిలిచిపోయాయి

స్టాక్ పాయింట్లలో బ్లాక్ మార్కెట్ దందా
బిల్లు రూ.4,900.. వసూలు చేసింది రూ.11 వేలు
కొంత సొమ్ము స్థానిక ప్రజా ప్రతినిధి కోసమట !
లారీ ఇసుక : ఏలూరులో రూ.26 వేలు, భీమవరంలో రూ.23 వేలు.. వినియోగదారుల బెంబేలు
పాలకొల్లు, జూలై 27: ఉచిత ఇసుక బ్లాక్ మార్కెట్ పరమైంది. సామాన్యులకు అందని ద్రాక్షగా మారుతోంది. పది రోజులుగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో రావులపాలెం స్టాక్ పాయింట్ మినహా మిగిలిన అన్నిచోట్ల ఇసుక ఎగుమతులు నిలిచిపోయాయి. ఇక్కడ మాత్రం రోజుకు 200 లారీల ఇసుక ఎగుమతి అవుతోంది. లోడింగ్, ట్రాన్స్‌పోర్టు చార్జీల నిమిత్తం రూ.4,900 వసూలు చేయాలి. అంతే మొత్తంలో బిల్లు ఇస్తూ రూ.11 వేలు వసూలు చేస్తున్నారు. దీనిపై ప్రశ్నిస్తే ఇలా వసూలు చేసిన మొత్తంలో అక్కడి ఓ ప్రజా ప్రతినిధికి రూ.6,100 ఇస్తున్నా మని స్టాక్ పాయింట్ సిబ్బంది చెబుతున్నట్టు లారీ ఓనర్లు చెబుతున్నారు. ఈ లెక్కన రోజుకు 200 లారీల ఇసుక ఎగుమతివుతుంటే రూ.12 లక్షలు ఆ నేత జేబులోకి వెళుతోందన్న మాట.
రూ.20 వేలు పైమాటే
తూర్పు, పశ్చిమ, కోనసీమ జిల్లాల్లోని స్టాక్ పాయింట్లు, పడవల ర్యాంపుల్లో ఇసుక ఎగుమతులు నిలిచిపోవడంతో రావులపాలెం స్టాక్ పాయింట్ సిబ్బంది ఇష్టానుసారం వసూలు చేస్తున్నారు. 20 టన్నుల ఇసుక లారీ (4.5 యూనిట్లు) ఏలూరులో రూ.26 వేలు, తాడేపల్లిగూడెం, భీమవరంలలో రూ.23 వేలు, పాలకొల్లు, నరసాపురం రూ.21 వేలకు అన్‌లోడ్ చేస్తున్నారు. జగన్ సర్కార్ హయాంలో వరదల సమయంలోనే ఐదు యూనిట్ల ఇసుక లారీ రూ.18 వేలకు మించి లేదు. ఇప్పుడు ఉచితం అంటూ నిలువుదోపిడీ చేస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే 20 రోజులుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్మాణ రంగం పడకేసింది. ఓ వైపు ఎడతెరిపి లేని వర్షాలు, మరోవైపు ఇసుక కొరత నిర్మాణ పనులకు ఆటకం ఏర్పడింది. ఈ విషయాలపై ఫిర్యాదులు రావడంతో సీఎం పేషీ దృష్టి సారించింది. బిల్లుకన్నా అదనంగా వసూలు చేస్తున్న వైనంపై సంబంధిత అధికారుల నుంచి వివరణ కోరినట్లు సమాచారం.
సీఎం దృష్టికి వ్యవహారం
వరదలు తగ్గుముఖం పట్టి, గోదావరి ర్యాంపులలో బాటల ఏర్పాటుకుమరో రెండు నెలలు సమయం పడుతుంది. అప్పటి వరకు ఇసుక అమ్మకాల తీరు ఇదే విధంగా కొనసాగితే అభాసుపాలవుతామని తమ కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, ఇప్పటికే సీఎం దృష్టికి పలువురు ప్రజా ప్రతినిధులు తీసుకుని వెళ్లారు. మరోవైపు పెండ్యాల, తీపర్రు, కుమారదేవం, స్టాక్ పాయింట్లలో శనివా రం నుంచి ఇసుక ఎగుమతులు ప్రారంభించారు. పెండ్యాలలో పది లారీల ఇసుక ఎగుమతి చేశారు. ఇసుక ఎగుమతులకు వెళ్లిన లారీలు రోజుల తరబడి స్టాక్ పాయింట్లలో వేచి ఉండటం, వెయిటింగ్ పిరియడ్‌కి కిరాయి అదనంగా వసూలు చేస్తే దానినే బూతద్దంలో చూపించి, లారీ యజమానులు ఎక్కువ సొమ్ములు వసూలు చేస్తున్నారనే చెడ్డ పేరును ట్రాన్స్‌పోర్టర్లకు అంట గడుతున్నారనే అంశా లను టిప్పర్ లారీ యజమానాలు ఆయా జిల్లాల కలెక్టర్ల దృష్టికి తీసుకువచ్చారు. అక్రమ వసూళ్ళపై దృష్టి పెట్టాలని లారీ యజమానులు కోరుతున్నారు.