న్యూ ఇయర్ విషాదం
ABN , Publish Date - Jan 02 , 2024 | 12:17 AM
వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురి మృతి
వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురి మృతి
ఏలూరులో మోటారు సైకిల్ అదుపుతప్పి..ఇద్దరు యువకుల మృతి
ఏలూరు క్రైం, జనవరి 1 : హైస్పీడ్ మోటారు బైక్‌పై అర్ధరాత్రి వేళ అతి వేగంగా వెళుతూ రోడ్డు పక్కనే సిమెంటు దిమ్మను ఢీకొట్టిన ప్రమా దంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఏలూరు కుమ్మర రేవుకు చెందిన తేళ్ళ వెంకట సుబ్రమణ్యం (17) ఇంటర్మీడియట్ చదివి ఇంటి వద్దే ఉంటున్నాడు. అతని స్నేహితుడైన ఏలూరు కొత్తపేటకు చెందిన మీసాల వేణుసాయి మాధవ్ (17) బీటెక్ చదువుతున్నాడు. వీరిద్దరు డిసెంబరు 31 రాత్రి మోటారు సైకిల్‌పై ఏలూరు మినీ బైపాస్ రోడ్డులో నూతన సంవత్సర వేడుకలను జరుపుకుని అక్కడ నుంచి వట్లూరు హౌసింగ్ బోర్డు కాలనీకి వెళ్తూ మినీ బైపాస్ రోడ్డులో పక్కనే హెచ్చరికగా ఉన్న సిమెంటు దిమ్మను ఢీకొట్టారు. దీంతో ఆ దిమ్మ విరిగి పోయింది. ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలవగా విజయవాడ తీసుకు వెళ్ళారు. అక్కడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందు తున్న సుబ్రహ్మణ్యం మధ్యాహ్నం మృతి చెందగా, ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మాధవ్ మృతి చెందాడు. నూతన సంవత్సర వేడుకలు ఆ రెండు కుటుంబాలకు తీరని విషాదాన్ని నింపింది. ఏలూరు త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
డివైడర్‌ను ఢీకొట్టిన బైక్..ఒకరి మృతి..
దెందులూరు, జనవరి 1 : నూతన సంవత్సరం మొదటి రోజు విషాదం నెలకొంది. 16వ నంబరు జాతీయ రహ దారిపై జరిగిన రోడ్డు ప్రమా దంలో యువకుడు మృతి చెందాడు. ఇద్దరికి తీవ్రగా యాల య్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో భీమడోలు మండలం గుండుగొలను గ్రామా నికి చెందిన గంటా బాలు (18) మరో ఇద్దరు యువకులు మోటార్ సైకిల్‌పై జాతీయ రహదారి మీదుగా దెందులూరు వైపు వెళ్తున్నారు. మోటార్ సైకిల్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో బాలు అక్కడిక్కడే పడి మృతి చెందాడు. మరో ఇద్దరు నత్తా వంశీ, కొవ్వలి సురేష్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయ పడిన వారిని స్థానికులు అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. దెందు లూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
పెంటపాడులో పంటబోదెలో పడి ఒకరు..
పెంటపాడు, జనవరి 1 : నూతన సంవత్సర వేడుకలను స్నేహితులతో కలసి చేసుకునేందుకు వచ్చిన యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెం దాడు. భీమడోలు మండలం వడ్లపట్ల గ్రామానికి చెందిన భీమవరపు రామకృష్ణ (33) వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాడు. నూతన సంవత్సరం వేడుకల కోసం ఆదివారం సాయంత్రం పెంటపాడు మండలం కే.పెంటపాడులో ఉన్న తన స్నేహితులను కలిసేందుకు వచ్చాడు. రాత్రి మోటర్ సైకిల్‌పై తన స్వగ్రామం వెళ్తున్న సమయంలో పెంటపాడు మూలతూం వద్ద ఉన్న కల్వర్డ్‌ను ఢీకొట్టి పక్కనే ఉన్న పంటబోదెలో పడిపోయాడు. తలకు బలమైన గాయం అవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఎస్.ఐ హరికృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బావిలోకి దూసుకెళ్లిన బుల్లెట్..ఇద్దరు దుర్మరణం
ఆగిరిపల్లి, జనవరి 1: విజయవాడలోని నున్నకు చెందిన శెట్టి సాయి కుమార్, నున్న రాకేష్ స్నేహితులు. నూతన సంవత్సరం సందర్భంగా రాకేష్ సమీప బంధువు అయిన ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం కనసానపల్లిలో వేడుకలు జరుపు కునేందుకు తమతో పాటు విజయవాడ మొగల్రాజపురానికి చెందిన తలశిల కృష్ణచైతన్యను తీసుకువెళ్లారు.పార్టీ అనంతరం సోమవారం ఉదయం ఇళ్లకు బయల్దేరారు. బుల్లెట్‌పై వెళు తున్న వీరికి గేదెలు అడ్డు రావడంతో పక్కకు వెళ్ళేప్రయత్నంలో పక్కనే ఉన్న నేలబావిలోకి వీరి బైక్ దూసుకు పోయింది. వీరి వెనుకే వస్తున్న మరో ఇద్దరు ఇది చూసి పొలంలో పనిచేస్తున్న వారికి సమాచారం ఇవ్వడంతో వారు కర్ర సాయంతో రాకేష్‌ను బావి నుంచి బయటకు తీసి చికిత్స నిమిత్తం విజయవాడ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కృష్ణచైతన్య (24), శెట్టి సాయికుమార్ (24) బావిలోనే మృతి చెందారు. పోలీసులకు సమాచారం అందడంతో మృతదేహాలను బయటకు తీయించారు. ఎస్సై చంటిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాయికుమార్, కృష్ణచైతన్య ఇప్పుడిప్పుడే ఉద్యోగాల్లో స్థిరపడుతూ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారు.వీరిని నేలబావి పొట్టన పెట్టుకోవడంతో వారి తల్లిదండ్రుల ఆవేదనకు అంతులేదు.