Share News

విలీనం..వంచన

ABN , Publish Date - Jul 05 , 2024 | 12:22 AM

తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచిందన్నట్లుగా ఆర్టీసీ ఉద్యోగుల పరిస్థితి తయారైంది. వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసింది. విలీనమైతే కష్టాలు అన్ని తీరతాయని ఉద్యోగులంతా ప్రభుత్వ ఉద్యోగులుగా సమానంగా వేతనాలు అందుతాయని ఆశపడ్డారు.

విలీనం..వంచన
సమస్యల పరిష్కారం కోరుతూ నిరసన తెలుపుతున్న ఆర్టీసీ ఉద్యోగులు (ఫైల్‌)

జగన్‌ సర్కార్‌ నిర్వాకంతో హక్కులు కోల్పోయిన ఆర్టీసీ కార్మికులు

కార్పొరేషన్‌లో ఉన్న హక్కులు, స్కీమ్‌లు విలీనంతో రద్దు

ఇప్పుడు కార్మికుల ఆశలన్నీ కూటమి ప్రభుత్వంపైనే..

ఏలూరు రూరల్‌, జూలై 4 : తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచిందన్నట్లుగా ఆర్టీసీ ఉద్యోగుల పరిస్థితి తయారైంది. వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసింది. విలీనమైతే కష్టాలు అన్ని తీరతాయని ఉద్యోగులంతా ప్రభుత్వ ఉద్యోగులుగా సమానంగా వేతనాలు అందుతాయని ఆశపడ్డారు. వైసీపీ పాలకుల నిర్ణయంతో అప్పట్లో ఉద్యోగులంతా సంబరాలు చేసుకున్నారు. వారి సంబరాలు ఎంతో కాలం నిలువ లేదు. విలీనం కోరుకుని ఎంత తప్పుచేశారో తెలియడానికే అట్టే సమయం పట్టలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇప్పటికైనా తమ సమస్యలు తొలుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. విలీనం పేరుతో వైసీపీ ప్రభుత్వం ఆడిన నాటకంలో తాము బలి పశువులుగా మారామని, ఆర్టీసీ ఉద్యోగులు వాపోతున్నారు. ఆర్టీసీ కార్మికులు కోరినట్లుగా వైసీపీ ప్రభుత్వంలో విలీనం చేశారు. సీఎం జగన్‌ చిత్రపటాలకు అప్పట్లో విలీన అనంతరం ఆర్టీసీ కార్మికులు పాలాభిషేకాలు చేశారు. తమ కష్టాలు తీరుతాయని భావించారు. అయితే విలీనం పేరుతో జగన్‌మోహన్‌రెడ్డి తమ జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని తొలుత వారు భావించలేదు. విలీనం చేయడం వెనుక కంటికి కనిపించని వంచన ఉందని, ఉద్యోగులు ఆలస్యంగా తెలుసుకున్నారు. విలీనమైన తర్వాత ఒక్కొక్క ప్రయోజనం కోల్పోవాల్సి వచ్చింది. పీఆర్సీని కోల్పోవడమే కాకుండా పాత జీతం తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పీఆర్సీ 2017 సవరణ జరగ్గా, 2021లో పీఆర్సీ సవరణ జరగాలి. అయితే ఆర్టీసీ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులుగా మారారని, ఆర్టీసీలో జరగాల్సిన పీఆర్సీని వైసీపీ ప్రభుత్వం ఎగవేసింది. 2019 నాటి వేతనాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

పాత స్కీమ్‌లు రద్దు

టీడీపీ హయాంలో ఆర్టీసీ కార్పొరేషన్‌గా ఉన్న సమయంలో ఉద్యోగులకు హెల్త్‌స్కీమ్‌ అమలు జరిగేది. ఈ స్కీమ్‌ కింద ఎంత తీవ్రమైన అనారోగ్యం వచ్చినా ఉద్యోగులుగా ఉచితంగా వైద్యం లభించేది. రూ.30 లక్షల వరకు విలువైన వైద్యం కూడా పొందారు. నెలకు రూ.225 చెల్లించి వీహెచ్‌ఎస్‌ కార్డు తీసుకున్న ఫలితం లేకుండా పోయిందని ఉద్యోగులు వాపోతున్నారు. పెన్షన్‌ బెన్‌ఫిట్స్‌ను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. ఉద్యోగ విరమణ అనంతరం సైతం వారు ఒట్టి చేతులతోనే ఇళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆర్టీసీలో ప్రభుత్వం విలీనం చేయడం వల్ల తీవ్రంగా నష్టపోయామని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు రాకపోగా, కార్పొరేషన్‌ ద్వారా వచ్చే అనేక ప్రయోజనాలు కోల్పోయామని, వి.హెచ్‌.ఎస్‌ హెల్త్‌కార్డు ఎందుకు పనికి రాలేదని, విలీనం వల్ల ఘోరంగా నష్టపోయామని పలువురు ఉద్యోగులు పేర్కొంటున్నారు. పేస్కేల్‌ విషయంలోనూ, డీఏలను వైసీపీ ప్రభుత్వం ఎగవేసిందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇక తమ సమస్యలు తీరతాయని, పీఆర్సీ, బకాయిలు చంద్రబాబు చెల్లిస్తారని కార్మికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

పేరుకే ఉద్యోగులు.. సెలవులు లేవు

ఆర్టీసీ ఉద్యోగులను పేరుకే ఉద్యోగులుగా చెబుతున్నా వారి విధుల్లో మాత్రం కార్మికులు గానే వైసీపీ ప్రభుత్వం చూసింది. సెలవులు ఇవ్వకుండా కంపెనీల చట్టం కింద సెలవులే వర్తిస్తాయని, సెలవులు ఎగ్గొట్టారు. ప్రభుత్వ ఉద్యోగులు అయ్యారనే నెపంతో కార్మిక చట్టాలు సమ్మె హక్కులు వర్తించవంటూ వారి హక్కులను కాలరాశారు.

Updated Date - Jul 05 , 2024 | 12:22 AM