Share News

ఇదేం ఖర్మ !

ABN , Publish Date - Mar 11 , 2024 | 12:40 AM

పకాశం జిల్లా మేదరమెట్టలో వైసీపీ నిర్వహించిన సిద్ధం సభకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు వెళ్ళటంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పలేదు.

ఇదేం ఖర్మ !
తాడేపల్లిగూడెంలో ఎండలో బస్సుల కోసం పడిగాపులు

సిద్ధం సభకు ఆర్టీసీ బస్సులు

ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసిన ప్రయాణికులు

మండుటెండలో బస్టాండ్లు,రోడ్లపై అవస్థలు

భీమవరం టౌన్‌, మార్చి 10 : మేదరమెట్టలో వైసీపీ నిర్వహించిన సిద్ధం సభకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు వెళ్ళటంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పలేదు. భీమవరం, తణుకు డిపోల నుంచి 28 బస్సుల చొప్పున, తాడేపల్లిగూడెం, నరసాపురం డిపోల నుంచి 22 బస్సుల చొప్పున పంపించారు. ఏలూరు జిల్లాలోని ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు డిపోల నుంచి 80 బస్సులను తరలించారు. భీమవరం డిపోకు సబంధించి 28 బస్సులు పంపించడంతో ఆదివారం జయవాడ, రాజమండ్రి, జంగారెడ్డిగూడెం వెళ్లే పలు సర్వీసులను రద్దు చేశారు. ముందస్తు సమాచారం లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. బస్‌ కాంప్లెక్స్‌కు చేరుకుని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

నరసాపురం డిపో నుంచి 22 బస్సులు

నరసాపురం : నరసాపురం డిపో నుంచి వెళ్లిన 22 బస్సుల్ని చీరాల డిపోకు కేటాయించారు.శనివారం సాయంత్రమే బస్సులు బయలుదేరి వెళ్లాయి. డిపోలో మొత్తం 60 సర్వీసులు ఉన్నాయి. వాటిలో 22 బస్సులు వెళ్లిపోవడంతో మిగిలిన 38 సర్వీసుల్ని ఆదివారం నడిపారు. ఎక్కువుగా పల్లే వెలుగు బస్సులే వెళ్లాయి. దీంతో రాజమండ్రి, తణుకు, భీమవరం, మచిలీ పట్నం, నిడదవోలు సర్వీసులు అరకొరగా నడిచాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బస్సుల కోసం డిపోలో పడిగాపులు కాశారు

తాడేపల్లిగూడెం నుంచి 22..

తాడేపల్లిగూడెం రూరల్‌ : వైసీపీ సిద్ధం సభ కోసం తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో నుంచి బస్సులు భారీగా తరలించారు. తాడేపల్లిగూడెం డిపోలో 54 ఆర్టీసీ బస్సులు ఉండగా వాటిలో సిద్దం సభ కోసం 22 బస్సులు తరలించి నట్టు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. దీంతో ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సులు లేక అంతా ఖాళీగా దర్శనమిచ్చింది. దీంతో ప్రయాణికులు మండుటెండలో సైతం బస్సుల కోసం పడిగాపులు కాశారు. దగ్గర ప్రయాణం ఉన్నవారు ఆటోలతో సరిపెట్టుకోగా దూర ప్రయాణికులు మాత్రం బస్సుల కోసం పడిగాపులు కాస్తూనే ఉన్నారు.

తణుకు నుంచి 28 బస్సులు

తణుకు : తణుకు డిపో నుంచి అధిక మొత్తంలో కేటాయించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డిపోలో 85 బస్సులు ఉండగా సభ కోసం 28 బస్సులు కేటాయించారు. దీంతో వివిధ ప్రాంతాలకు వెళ్ళే రూట్లలో బస్సులు రాకపోవడంతో ప్రయాణికులకు అవస్థలు తప్పలేదు. ఒక పక్క ఎండలు మండుతుండడంతో ఉక్కపోతతో బస్టాండ్డు, రోడ్లమీద వాహనాలు కోసం నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

బస్సులు లేక జనం పాట్లు

ఏలూరు రూరల్‌ : ఆదివారం ఏలూరు ఆర్టీసీ బస్టాండులో బస్సులకోసం ప్రయాణికులు పడిగాపులు కాశారు. ఆదివారం ఉదయం నుంచే సిద్ధం సభకు బస్సులను పంపించారు. డ్రైవర్లు సిద్ధం సభకు వెళ్ళేందుకు అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. మూడు రోజుల పాటు శైవక్షేత్రాలకు తిరిగి కొద్దిపాటి విశ్రాంతితో బస్సులు నడుపుతుంటే ఇప్పుడు సిద్ధం సభకు ఒకరోజు విధులు పొడిగించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ నేపఽథ్యంలో ఉదయం నుంచి బస్సుల కొరతతో జనం ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Updated Date - Mar 11 , 2024 | 12:40 AM