Share News

అడుగుకో గొయ్యి..

ABN , Publish Date - Jul 08 , 2024 | 12:08 AM

చింతలపూడి నగర పంచాయతీ పరిధిలోని ఏలూరు రోడ్డు ప్రధాన రహదారిపై పడిన గోతులు ప్రమాదకరంగా ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు రోడ్ల వైపు కన్నెత్తి కూడా చూడలేదు.

అడుగుకో గొయ్యి..
రత్నా సెంటర్లో అధ్వానంగా ఆర్‌అండ్‌బీ రోడ్డు

చింతలపూడి నగర పంచాయతీలో రోడ్లు అధ్వానం

ఇటీవల ఎమ్మెల్యే పరిశీలన.. మరమ్మతులు చేపట్టాలని ఆదేశాలు

అయినా చర్యలు తీసుకోని అధికారులు

చింతలపూడి, జూలై 7 : చింతలపూడి నగర పంచాయతీ పరిధిలోని ఏలూరు రోడ్డు ప్రధాన రహదారిపై పడిన గోతులు ప్రమాదకరంగా ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు రోడ్ల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. దీంతో పట్టణంలోని ప్రధాన అంతర్గత రోడ్లన్నీ గోతులతో దారుణంగా మారాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఈ గోతులను కనీసం రాళ్లతోనైనా గోతులు పూడ్చండి మహాప్రభో అంటూ పట్టణవాసులు కోరుతున్నారు. నగర పంచాయతీలోని ప్రధానంగా సాయిబాబా గుడి సెంటర్‌, మినీ బస్టాండ్‌, బోసుబొమ్మ సెంటర్‌, ఏరియా ఆస్పత్రి, ఫైర్‌స్టేషన్‌ సెంటర్‌, కొత్త బస్టాండు ఏరియా, గురుపట్లగూడెం, సమ్మెటవారిగూడెం ఏరియాలోని రోడ్లు భారీ గోతులు పడి ద్విచక్ర వాహనాలు వెళ్లడానికి ఇబ్బందిగా మారాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ గోతుల్లో అధికారులు కనీసం చారెడుమట్టి కూడా పోయలేదు. ఇటీవల వర్షాలకు ఈ గోతుల్లో నీరుచేరి అది ఎంత గొయ్యి ఉందో తెలియక వాహనదారులు అందులోపడి ప్రమాదాలకు గురి అవుతున్నారు. రత్నా సెంటర్లో పెద్దవాహనాల డ్రైవర్లు సైతం బిక్కుబిక్కుమంటూ నడుపుతున్నారు. ఈ మార్గంలో నిత్యం పామాయిల్‌ లోడులారీలు, గ్రీన్‌ఫీల్డ్‌ హైవే రోడ్డుకు తరలించే మట్టి వాహనాలు, ఆర్టీసీ బస్సులు అధికసంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ దారి పొడవునా వందలాది ద్విచక్ర వాహనాలు, కార్లు తిరుగుతుం టాయి. వాహనదారులంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నడపాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. గతంలో రత్నా సెంటర్లో సిమెంట్‌రోడ్డు వేసినా అదికూడా గోతులమయంగా మారింది. ఇక్కడ ఇంతనీరు నిల్వ ఉండ డానికి కారణాలు ఏమిటని కనీసం అధికారులు పరిశీలించడం లేదు. ఫైర్‌స్టేషన్‌ సెంటర్లో ఆక్రమణల జోరు, గోతులమయంతో ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళే దారి కూడా అధ్వానంగా ఉంది. ఇక ఏరియా ఆస్పత్రి వద్ద పెద్ద గొయ్యి పడింది.

ఎమ్మెల్యే ఆదేశాలు బేఖాతర్‌

ఇటీవల ఎమ్మెల్యే రోషన్‌కుమార్‌ ఆర్‌అండ్‌బీ, మునిసిపల్‌ అధికారులను పిలిచి సమీక్షించారు. కనీసం గోతుల్లో రాళ్ళువేసి పూడ్చమని ఆదేశించారు. చెప్పి వారం రోజులు గడుస్తున్నా ఒక్క గొయ్యిలో కూడా రాళ్లు పోసిన దాఖలాలు లేవు. అధికారులు సమన్వయంతో ప్రజలకు సేవలు అందించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. అయితే ఆయన ఆదేశాలను బేఖాతర్‌ చేస్తూ ఇప్పటి వరకు గోతుల్లో కనీసం రాళ్ళు పోయ లేదని స్థాని కులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jul 08 , 2024 | 12:08 AM