Share News

గట్టు ఓకేనా..?

ABN , Publish Date - Jun 11 , 2024 | 12:09 AM

వైసీపీ ప్రభుత్వ హయాంలో రూ.27 కోట్లతో చేపట్టిన నరసాపురం ఏటిగట్టు పనుల్లో డొల్లతనం నాలుగుసార్లు బయట పడింది. 230 మీటర్ల గట్టు పటిష్ఠ పనులు పూర్త వగా, ఇంకా 170 మీటర్లు పెండింగ్‌లో ఉన్నాయి. వరద వచ్చినా గట్టుకు డోకా లేదని అధికారులు చెబుతున్నా, ప్రజల్లో మాత్రం భయం వీడడం లేదు.

గట్టు ఓకేనా..?
కోతకు గురైన గట్టు వెంబడి వేసిన రాళ్లు..

నరసాపురం ప్రజల్లో వీడని భయం

230 మీటర్ల మేర పూర్తయిన పనులు

ఇంకా 170 మీటర్లు పెండింగ్‌

వరదొచ్చినా డోకా లేదంటున్న అధికారులు

నరసాపురం, జూన్‌ 10 : వైసీపీ ప్రభుత్వ హయాంలో రూ.27 కోట్లతో చేపట్టిన నరసాపురం ఏటిగట్టు పనుల్లో డొల్లతనం నాలుగుసార్లు బయట పడింది. 230 మీటర్ల గట్టు పటిష్ఠ పనులు పూర్త వగా, ఇంకా 170 మీటర్లు పెండింగ్‌లో ఉన్నాయి. వరద వచ్చినా గట్టుకు డోకా లేదని అధికారులు చెబుతున్నా, ప్రజల్లో మాత్రం భయం వీడడం లేదు. వేసిన రాళ్లు నాసి రకంగా ఉన్నాయని, వరద వస్తే ఏమవుతుందోనని ఆందోళన నెలకొంది. 2021 జూలైలో గోదావరికి భారీ వరదలు రావడంతో అమరేశ్వరస్వామి ఆలయం వద్ద ఏటిగట్టు కోతకు గురైంది. 400 మీటర్ల గట్టు కుంగిపోయింది. వరద తగ్గే వరకు ప్రజలు బిక్కు బిక్కుమంటూ గడిపారు. రూ.50 లక్షలతో తాత్కాలికంగా అడ్డుకట్ట వేశారు. ఆ తర్వాత 2022 నవంబర్‌లో సీఎం జగన్‌ నరసాపురం పర్యటనలో రూ.27 కోట్లతో గట్టు పటిష్ఠ పనులకు శంకుస్థాపన చేశారు. గత ఏడాది ఏప్రిల్‌లో ఈ పనులను ప్రారంభించారు. కోతకు గురైన ప్రాంతంలో రాళ్లను వేసి సుమారు వంద మీటర్ల మేర పటిష్ట పనులు చేపట్టారు. ఈ పనుల్లో నాసి రకం రాళ్లు వినియోగిస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు అప్పట్లో ఆరోపణలు చేశారు. దీనిని అధికార పార్టీ నేతలు కొట్టిపారేశారు. కానీ, నెల రోజుల్లోనే చేసిన పనులన్నీ గోదావరి పాలయ్యాయి. చిన్నపాటి నీటి ప్రవా హానికే గట్టు కుంగిపోయింది. ఇలా నాలుగుసార్లు, చేస్తున్న పనులన్నీ నీటి పాలవడంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది.ఈ నేపథ్యంలో జిల్లా పర్యటనకు విచ్చేసిన చంద్రబాబు ఈ పనుల్లో జరుగుతున్న డొల్లతనంపై గళం విప్పారు. ఇటు మాజీ ఎమ్మెల్యే బండారు రాష్ట్ర గవర్నర్‌తో పాటు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులకు, విజిలెన్స్‌కు ఫిర్యాదు చేశారు. రూ.27 కోట్లతో చేస్తున్న ఈ పనుల్లో అధికార పార్టీకి చెందిన నేతలు బినామీ కాంట్రాక్టర్లుగా వ్యవహ రిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. హైకోర్టు సిటింగ్‌ జడ్జితో విచారణ చేయిం చాలని డిమాండ్‌ చేశారు. నీటి పారుదల శాఖ ఉన్నతాధికారుల బృందం ఈ పనులను పరిశీలించి అంతా ఓకేనంటూ సర్టిఫికేట్‌ ఇచ్చారు. వాడిన రాళ్లల్లో నాసి రకం లేవని తేల్చేశారు. పనులన్ని నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయంటూ ధ్రువీక రించారు. ఆ నిపుణుల బృందం ఇచ్చిన సూచ నల ప్రకారం అధికారులు పనులు చేపట్టారు. ఇప్పటి వరకు కోతకు గురైన 400 మీటర్లలో 230 మీటర్ల మేర పనులను పూర్తిచేశారు. ఐదు నెలల నుంచి ఎక్కడా కోతకు గురవ్వలేదు. దీంతో ఇక గట్టుకు ఢోకా లేదని ఆధికారులు చెబుతున్నారు. పెండింగ్‌లో వున్న 170 మీటర్లు ఇదే రీతిలో పూర్తి చేస్తామంటున్నారు.

ప్రజల్లో వీడని భయం

నాలుగుసార్లు కళ్ల ముందు చేసిన పనులు నీటిపాలవడాన్ని చూసిన ప్రజల్లో ఇంకా భయం వీడటం లేదు. గోదావరికి వరదొస్తే కానీ గట్టు బలం ఎంతో బయట పడుతుందని అంటున్నారు. గతంలో ఇదే తరహాలో పనులు చేశారు. అయితే అవి నిలబడలేదు. కొద్దిపాటి ప్రవాహానికే నీటిపాలయ్యాయి. మరో రెండు మూడు నెలల్లో గోదావరికి వరదలు వస్తాయి. ఆ వరదకు గోదారమ్మ దయవల్ల ఏమి కాకపోతే భయపడనవసరం లేదు.

ఆందోళన అవసరం లేదు

– సుబ్బారావు, ఏటిగట్ల అభివృద్ధి శాఖ ఏఈ

సాధారణంగా ఏటిగట్టు పనులు చేసేటప్పుడు గట్టు జారడం పరిపాటి. ఆ విధంగా నాలుగుసార్లు జారింది.ఆ ప్రాంతంలో లోతు ఎక్కువ. ఉన్నతాఽధికారుల సూచనల మేరకు ఇక్కడ 60 మీటర్ల మేర రాళ్లు వేసి పటిష్ఠ పరిచాం. దీనిపై గట్టు నిర్మాణం చేపట్టాం. వరదొచ్చినా ఎలాంటి ప్రమాదం ఉండదు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

Updated Date - Jun 11 , 2024 | 12:09 AM