Share News

బియ్యం ధరలు భగ్గు..

ABN , Publish Date - Jan 03 , 2024 | 12:03 AM

బియ్యం ధరలు భగ్గుమంటున్నాయి. వ్యాపారులు సిండికేట్‌గా మారారు. ఽధరలు అమాంతం పెంచేస్తున్నారు. జిల్లా వాసులు సన్నరకాలనే కొనుగోలు చేస్తుంటారు. దీంతో మార్కెట్‌లో వాటికి డిమాండ్‌ ఎక్కువగా ఉంటోంది. పెరిగిన ధరలతో కొనాలంటేనే సామాన్య, మధ్య తరగతి జనం జంకే పరిస్థితులు నెలకొన్నాయి

బియ్యం ధరలు భగ్గు..

వ్యాపారులు సిండికేట్‌

26 కిలోల ప్యాకెట్‌ రూ.1500 పైనే

సన్న రకంపైనే జిల్లాలో మోజు

తినాలంటేనే జంకుతున్న జనం

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

బియ్యం ధరలు భగ్గుమంటున్నాయి. వ్యాపారులు సిండికేట్‌గా మారారు. ఽధరలు అమాంతం పెంచేస్తున్నారు. జిల్లా వాసులు సన్నరకాలనే కొనుగోలు చేస్తుంటారు. దీంతో మార్కెట్‌లో వాటికి డిమాండ్‌ ఎక్కువగా ఉంటోంది. పెరిగిన ధరలతో కొనాలంటేనే సామాన్య, మధ్య తరగతి జనం జంకే పరిస్థితులు నెలకొన్నాయి.తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి పశ్చిమకు సన్నరకాలు దిగుమతి అవుతున్నాయి. ప్రధానంగా సోనామసూరి వంటి రకాలను జిల్లాలో ఎక్కు వగా వినియోగిస్తుంటారు. జిల్లాలో సాగయ్యే రకాలపై పెద్దగా ఆసక్తి చూపరు. కేవలం రేషన్‌ పంపిణీకి మాత్రమే జిల్లాలో ఉత్పత్తి అయ్యే బియ్యం ఉపయోగ పడుతున్నాయి. మళ్లీ అవి మార్కెట్‌కు తరలిపోతున్నాయి. ఏడాదిన్నర క్రితం వరకు రిటైల్‌ మార్కెట్‌లో 26 కేజీల బస్తా రూ.1150 పలికిన బియ్యం ఇప్పుడు రూ.1550కి చేరింది. అదే మాల్స్‌ అయితే మరో రూ. 100 అదనంగా చెల్లించాల్సి వస్తోంది. మార్కెట్లో బ్రాండెడ్‌ సన్నబియ్యం నాలుగునెలల క్రితం కిలో రూ.45 ఉండగా ప్రస్తుతం రూ.60 నుంచి రూ.62 వరకు విక్రయిస్తున్నారు. బియ్యం మార్కెట్‌పై ప్రభుత్వానికి ఆజమాయిషీ లేకుండా పోయింది. ధరలకు కళ్లెం వేయాలని భావిస్తే అధికారులు రిటైల్‌ మార్కెట్‌పై పడుతున్నారు. తనిఖీల పేరుతో హడావుడి చేస్తున్నారు. సన్నరకాలు ఉత్పత్తి చేసే పెద్ద వ్యాపారులు జోలికి పోవడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా 25 మంది వ్యాపారుల చేతులోనే సన్న బియ్యం మార్కెట్‌ ఆధారపడి పోయింది. వారు ఎంతంటే అంతే ధర.ధాన్యం కొరత ఉందంటూ ఇప్పుడు ధరలు పెంచేశారు. వాస్తవానికి రైతువద్ద ధాన్యం ఉన్నప్పుడు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. రైతుల నుంచి సన్న రకాలు పూర్తిగా కొనుగోలు చేసిన తర్వాత ధాన్యం ధరలు పెంచుతున్నారు. ఇప్పటికే మిల్లర్ల వద్ద సన్న రకాలైన ధాన్యం గొడౌన్‌లో నిల్వ చేసుకుంటున్నారు.

గతంలో ప్రభుత్వాలు కట్టడి చేసేవి

బియ్యం ధరలు పెరిగితే గతంలో ప్రభుత్వాలు రంగంలోకి దిగేవి. వ్యాపారులే తక్కువ ధరలకు సన్న బియ్యం విక్రయించేలా చర్యలు చేపట్టేవి. అందుకోసం ప్రత్యే కంగా కౌంటర్లు ఏర్పాటు చేసేవారు. చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో అమ్మకాలు సాగించేవారు. ఇలా కొంతమందికి అయినా సరే తక్కువ ధరకు సన్నరకాలు లభ్య మయ్యేవి. ఆ తర్వాత ధరలు అదుపులోకి వచ్చేవి. అప్పుడు కౌంటర్‌లను తొల గించే వారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ధరలను బొత్తిగా పట్టించుకోవడం లేదు. వ్యాపారులను కట్టడి చేయలేకపోతున్నారు. ప్రభుత్వ పెద్దలను శాసించే స్థితిలో బడా వ్యాపారులున్నారు.

తెలివి మీరిన వ్యాపారులు

కేంద్ర ప్రభుత్వం బియ్యంపై జీఎస్టీని తొలగించింది. కేవలం బ్రాండెడ్‌ రకాలకు మాత్రమే 5 శాతం జీఎస్టీని అమలు చేసింది. దాంతో బ్రాండెడ్‌ అమ్మకాలు సాగించే వ్యాపారులంతా కుమ్మక్కయ్యారు. రిజిస్ర్టేషన్‌ చేసిన బ్రాండెడ్‌ పేర్లతో బియ్యం విక్రయాలను నిలిపివేశారు. వాటి ముందు శ్రీ తగిలించి బియ్యం అక్రమాలకు తెరలేపారు. ఇలా జీఎస్టీని నుంచి తప్పించుకున్నారు. చివరకు ప్రభుత్వం 25 కిలోల ప్యాకెట్‌పై జీఎస్టీని అమలు చేసింది. దానికీ వ్యాపారులు ప్రత్యామ్నాయం కనిపెట్టారు. మార్కెట్‌లో 25 కిలోల ప్యాకెట్‌ల సరఫరాను నిలిపివేశారు. ఇప్పుడు 26 కిలోల ప్యాకెట్‌లు దిగుమతి చేస్తున్నారు. ఇలా జీఎస్టీకి ఎగనామం పెట్టారు.

పన్ను పేరుతో దగా

ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా 26 కిలోల ఎత్తుగడను వేసిన వ్యాపారులు ధరలను మాత్రం పెంచేశారు. మార్కెట్‌లో 25 కిలోలు ప్యాకెట్‌లకు జీఎస్టీ అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన తక్షణమే రూ. 100 పెంచారు. అప్పటినుంచి మార్కెట్‌లో ధరలు పెంచుతూ వస్తున్నారు. కానీ ప్రభుత్వానికి పన్ను చెల్లించడం లేదు. బియ్యంపై పన్ను లేనప్పుడు మాత్రం తక్కువ ధరకే బియ్యం లభ్యమయ్యేవి. ధరలు పెంచేందుకు వ్యాపారులు సాహసించేవారు కాదు. ఇప్పుడా పరిస్థితి లేదు. పన్ను పేరుతో ధరలు పెంచేస్తున్నారు. పన్ను చెల్లించ కుండా ప్రభుత్వాన్ని, ధాన్యానికి ధర ఇవ్వకుండా రైతులను, ధరలు పెంచుతూ వినియోగదారులను బడా వ్యాపా రులు దగా చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దీనిపై ఏమీ ఆలోచించడం లేదు. బియ్యం దొంగ వ్యాపారం చేసిన వారికే తాళాలు అప్పగిం చింది. వారికే రాష్ట్రంలో కీలక బాధ్యతలు అప్పగించింది. అధికార పార్టీ అండ దండలు ఉండడంతో సదరు వ్యాపారి బియ్యం ఎగుమతుల్లో ఆరితేరిపోయారు. ఇతర బడా వ్యాపారులకు అండగా ఉంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - Jan 03 , 2024 | 12:03 AM