రైస్ ధరలకు రెక్కలు
ABN , Publish Date - May 26 , 2024 | 11:44 PM
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో బియ్యం ధరలకు రెక్కలు వచ్చాయి. స్థానికంగా ముతక రకాలు ధాన్యం పండించడంతో ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసు కుంటున్న సన్నరకం బియ్యానికి ఇక్కడ డిమాండ్ పెరిగింది. మొన్నటి వరకూ సోనా రకం సన్న బియ్యం క్వింటా రూ. 4,800 ఉండగా ఇప్పుడు రూ.5,300కు పెరిగింది.
సన్న రకాలు క్వింటాకు రూ.500 పెరుగుదల
ఉత్తరాది డిమాండ్‌తో ఇక్కడ ప్రభావం
ఉమ్మడి పశ్చిమ జిల్లాలో తగ్గిన వినియోగం
పాలకొల్లు, మే 26 :ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో బియ్యం ధరలకు రెక్కలు వచ్చాయి. స్థానికంగా ముతక రకాలు ధాన్యం పండించడంతో ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసు కుంటున్న సన్నరకం బియ్యానికి ఇక్కడ డిమాండ్ పెరిగింది. మొన్నటి వరకూ సోనా రకం సన్న బియ్యం క్వింటా రూ. 4,800 ఉండగా ఇప్పుడు రూ.5,300కు పెరిగింది. హెచ్‌ఎంటి రకం బియ్యం రూ.5,600 నుంచి రూ.6 వేలకు చేరింది, స్వర్ణరకం బియ్యం రూ.4 వేల నుంచి 4200, పీఎల్ బియ్యం రూ.4200 నుంచి రూ. 4400లకు పెరిగింది. జగన్ ప్రభుత్వం కోటా బియ్యంలోనూ సన్నరకాలు అందిస్తామని చెప్పినప్పటికీ ఆచరణలో సాధ్యం కాలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మాల్స్‌లో స్వర్ణ వంటి మీడియం రకాలు కిలో రూ.29లకే లభిస్తున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 90 శాతం ముతక రకం దాన్యాన్నే పండిస్తారు. ముతక బియ్యం ఉత్తరాది రాష్ట్రాలకు ఎగు మతి అవుతాయి. తెలుగు రాష్ట్రాలలోని ఇతర ప్రాంతాల నుంచి కర్ణాటక నుంచి సన్న బియ్యం ఇక్కడికి దిగుమతి చేసుకుంటారు. ఇప్పుడు దాళ్వా పంట చేతికి వచ్చినప్పటికీ ధరలు పెరగడానికి కారణం దిగుబడి తగ్గడమేనని వక్తకులు చెబు తున్నారు. అంతే కాకుండా సన్నరకం బియ్యం ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి చేస్తే నగదు వెంటనే చెల్లిస్తారని, పశ్చిమ ప్రాంతంలోని టోకు వర్తకులు అరువు పద్ధతిని కొనుగోలు చేయడం వల్ల కొంతమేర ధరలు అధికంగా ఉంటాయని చెబుతున్నారు.
కోటా బియ్యానికి పెరిగిన డిమాండ్
2, 3 నెలలుగా పేద, మధ్య తరగతి వర్గాల్లో కొనుగోలు శక్తి క్షీణించడంతో కోటా బియ్యాన్ని అధికంగా వినియోగిస్తున్నారు. గడిచిన రెండు నెలల్లో కోటా బియ్యం అక్రమ ఎగుమతులు తగ్గుముఖం పట్టడం ఒక ఉదాహరణగా భావించవచ్చు. కొన్ని కుటుంబాలలో బియ్యం సన్న బియ్యం కలుపుకుని వినియోగిస్తున్నట్టు గ్రామీణ ప్రాంత ప్రజలు చెబుతున్నారు. జిల్లా వాసులకు సన్నబియ్యంపై మక్కువ ఉన్నప్పటికీ పలు వర్గాల్లో కొనుగోలు శక్తి తగ్గడంతో అమ్మకాలు తగ్గాయి.
జిల్లాలో తగ్గిన వినియోగం
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 37.96 లక్షల జనాభా ఉన్నారు. ఇందులో 30.48 లక్షలు గ్రామీణ ప్రాంతాల్లోనూ 7.45 లక్షలు పట్టణ ప్రాంతాల్లోనూ ఉన్నారు. దశాబ్ద కాలానికి ముందు ఉమ్మడి జిల్లాలో నెలకు 30 వేల టన్నుల బియ్యాన్ని కేవలం అన్నం వండుకోవడానికి వినియోగించే వారు. ఇప్పుడు అమ్మకాలు సుమారు 8 వేల టన్నులు తగ్గినట్టు పరిశీలకులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కొంచెం బియ్యం వినియోగం మెరుగ్గా ఉండగా, పట్టణ ప్రాంతాల్లో బియ్యం వినియోగం కనిష్టస్థాయికి తగ్గింది. ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో సుమారు 40 శాతం మంది సాయంత్రం పూట అన్నం తినడం మానివేసి అల్పాహారం తీసుకుంటు న్నారు. అల్పాహార వినియోగం పట్టణాలలో అధికశాతం ఉంటే ఇప్పుడిప్పుడే గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తోంది. గ్రామాలలో 20 శాతం మంది సాయంత్రం పూట అల్పాహారం వైపు దృష్టి సారిస్తున్నారు. దీంతో గ్రామీణం లోనూ కొంత మేరకు బియ్యం వినియోగం తగ్గింది.