‘పది’ పరీక్షల్లో పారదర్శకతకు చర్యలు
ABN , Publish Date - Mar 17 , 2024 | 12:12 AM
పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణలో పారదర్శకత కోసం మరిన్ని కట్టుదిట్ట చర్యలను తీసుకున్నట్టు టెన్త్ పరీక్షల రాష్ట్ర పరిశీలకుడు ఆర్.నరసింహా రావు, డీఈవో ఎస్.అబ్రహం వెల్లడించారు.
టెన్త్ పరీక్షల రాష్ట్ర పరిశీలకుడు ఆర్.నరసింహారావు
ఏలూరు ఎడ్యుకేషన్, మార్చి 16 : పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణలో పారదర్శకత కోసం మరిన్ని కట్టుదిట్ట చర్యలను తీసుకున్నట్టు టెన్త్ పరీక్షల రాష్ట్ర పరిశీలకుడు ఆర్.నరసింహా రావు, డీఈవో ఎస్.అబ్రహం వెల్లడించారు. పరీక్షల నిర్వహణపై స్క్వాడ్ బృందాలతో స్థానిక ఎంఈవో కార్యాలయంలో నరసింహారావు సమావేశం నిర్వహించగా, జిల్లాలో పరీక్షలకు ఏర్పాట్లపై డీఈవో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. పరీక్షల సిబ్బంది విధిగా గుర్తింపు కార్డులను ధరించాలని ఆదేశించారు. పరీక్షలు రాసే విద్యార్థుల్లో తమ కుటుంబ సభ్యులు గాని, సంబంధీకులు గాని లేరని స్పష్టం చేస్తూ సిబ్బంది నుంచి పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెం డెంట్ విధిగా సర్టిఫికెట్‌ను తీసుకోవాలని కోరారు. ప్రశ్నాపత్రాన్ని తప్పుగా విద్యార్థికి ఇస్తే ఇన్విజిలేట ర్‌పై క్రమశిక్షణా చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. లాటరీ పద్ధతిలో ఇన్విజిలేటర్లకు పరీక్ష గదులను కేటాయించాలన్నారు. పరీక్ష ముగిసే వరకు మాల్‌ప్రాక్టీస్ జరగకుండా నిశితంగా పరిశీలించే బాధ్యత ఇన్విజిలేటర్లదేనని స్పష్టం చేశారు.
యూనిఫాం ధరించి రావొద్దు
విద్యార్థులెవ్వరూ స్కూలు యూనిఫాం ధరించి పరీక్షా కేంద్రానికి రాకూడదని డీఈవో సూచించా రు. సివిల్ డ్రెస్‌లోనే పరీక్షలకు హాజరుకావాల న్నారు. ఫ్లయింగ్ స్కాృడ్ బృందాలతో సహా ఉన్నతాధికారులెవరూ సెల్‌ఫోన్‌తో పరీక్షా కేంద్రం లోకి వెళ్లేందుకు అనుమతిలేదన్నారు. పరీక్ష కేంద్రానికి కేటాయించిన సిబ్బంది మినహా, మిగిలిన ఏ ఒక్కరూ ఉపాధ్యియులతో సహా పరీక్ష కేంద్రం వద్ద ఉండరాదని హెచ్చరించారు. ప్రతీరోజు ఉదయం 9.30 గంటలకు విద్యార్థులకు ప్రశ్నాపత్రాలు ఇవ్వాలని, అందజేసిన ప్రశ్నాపత్రా న్ని చదువుకునేందుకు 15 నిమిషాలు సమయం ఇస్తున్నట్టుగా విద్యార్థులకు తెలపాలన్నారు. అక్రమాలకు పాల్పడినట్టు రుజువైతే మూడు నుంచి ఏడేళ్ల పాటు జైలుశిక్ష, రూ.లక్ష వరకు జరిమానా విధిస్తారని వెల్లడించారు. పుకార్లు/ అనధికార వార్తలను/గెస్ పేపర్లను సోషల్ మీడియా ద్వారా ప్రచారంచేసే వ్యక్తులపై సైబర్ నేరంకింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించా రు. సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఎస్‌ఎస్‌సీ పరీక్షలకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశామని, మొత్తం 24,125 మంది బాల బాలికలు రెగ్యులర్ విభాగంలో, మరో 8,230 మంది ఒకసారి ఫెయిలైన విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారన్నారు. సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించిన కైకరం, రంగాపురం, లక్కవరం, చింతపాడు, కోరుకొల్లు, పిప్పర జడ్పీ హైస్కూళ్లల్లో సీసీ కెమెరాలను అమర్చారన్నారు. విద్యార్థులు హాల్ టిక్కెట్‌ను చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా చేయవచ్చన్నారు. అన్ని కేంద్రాల్లో ప్రథమ చికిత్సా శిబిరాలను ఏర్పాటు చేశామని, ఏ ఒక్క విద్యార్థి నేలపై కూర్చుని పరీక్ష రాయాల్సిన పరిస్థితి తలెత్తకుండా పూర్తిస్థాయిలో ఫర్నీచర్, మౌలిక వసతులువున్న కేంద్రాలనే ఎంపిక చేశామన్నారు.