Share News

ఎవరు ? ఎప్పుడు ?

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:50 AM

నామినేషన్ల స్వీకరణ మొదలై ఈ నెల 25వ తేదీ గురువారం వరకు కొనసాగనుంది. ఈ మేరకు జిల్లాలోని నరసాపురం పార్లమెంట్‌తోపాటు ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలకు చెందిన వివిధ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు తగిన ముహుర్తాలను పెట్టుకుం టున్నారు.

ఎవరు ? ఎప్పుడు ?

ఎమ్మెల్యే అభ్యర్థుల నామినేషన్‌లకు మూహూర్తాలు ఖరారు

తణుకు/తాడేపల్లిగూడెం రూరల్‌/ నరసాపురం/ఆచంట/ పాలకొల్లు/ఆకివీడు, ఏప్రిల్‌ 17 : పార్లమెంట్‌, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ గురువారం విడుదల కానుంది. ఈ రోజు నుంచే నామినేషన్ల స్వీకరణ మొదలై ఈ నెల 25వ తేదీ గురువారం వరకు కొనసాగనుంది. ఈ మేరకు జిల్లాలోని నరసాపురం పార్లమెంట్‌తోపాటు ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలకు చెందిన వివిధ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు తగిన ముహుర్తాలను పెట్టుకుం టున్నారు.

తణుకు కూటమి తరపున టీడీపీ అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ ఈ నెల 19వ తేదీ శుక్రవారం ఉదయం తన నివాసం నుంచి భారీ ర్యాలీగా రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి వెళ్లి నామినేషన్‌ దాఖలు చేస్తారు. నామినేషన్‌ వేసే ముందు ఆయన బుధవారం తన ఇష్టదైవమైన తిరుమల వెళ్లి శ్రీ వేంకటేశ్వరస్వామిని సతీమణి కృష్ణతులసి, కుమారుడు నిఖిల్‌ రత్నలతో కలిసి దర్శించుకున్నారు.

తాడేపల్లిగూడెం కూటమి తరపున జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్‌ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు పెంటపాడు మండలం కె.పెంటపాడులోని వేణుగోపాలస్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడి నుంచి ర్యాలీగా తాడేపల్లిగూడెం ఆర్డీవో కార్యాలయానికి ఉదయం 11 గంటలకు వెళ్లి నామినేషన్‌ వేస్తారు. కాంగ్రెస్‌ అభ్యర్థి మార్నీడి శేఖర్‌బాబ్జి ఈ నెల 24వ తేదీ ఉదయం పదిన్నరకు నామినేషన్‌ వేసేందుకు ముహూర్తం పెట్టుకున్నారు.

నరసాపురం వైసీపీ అభ్యర్థి ముదునూరి ప్రసాదరాజు ఈ నెల 19న, కూటమి తరపున జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్‌ 22న నామినేషన్‌ దాఖలు చేస్తున్నారు.

పాలకొల్లులో కూటమి తరపున టీడీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్‌ నిమ్మల రామానాయుడు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు పట్టణంలోని 21వ వార్డు లాకుల వద్ద చర్చి నుంచి ర్యాలీగా మున్సిపల్‌ కార్యాలయానికి వెళ్లి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలను అందజేస్తారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కొలుకులూరి అర్జునరావు శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు నామినేషన్‌ వేయనున్నారు.

ఉండిలో కూటమి తరపున టీడీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే మంతెన రామరాజు ఈ నెల 22న నామినేషన్‌ వేయనున్నారు. సమయం నిర్ధారణ కావాల్సి వుంది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పీవీఎల్‌ నర్శింహరాజు 19వ తేదీ ఉదయం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.

ఆచంటలో కూటమి తరపున టీడీపీ అభ్యర్థి పితాని సత్యనారాయణ, వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాధరాజు ఈ నెల 19వ తేదీ ఉదయం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. పితాని ఉదయం 7.30లకు తన స్వగ్రామం కొమ్ముచిక్కాల నుంచి ర్యాలీగా బయలుదేరతారు. రంగనాధరాజు ఉదయం 9.30 గంటలకు తూర్పుపాలెంలోని తన క్యాంప్‌ కార్యాలయం నుంచి పాదయాత్రగా ఆచంట ఆర్‌వో కార్యాలయానికి చేరతారు. ఇద్దరి నామినేషన్‌లు ఒకే రోజు రావడంతో ఆచంటలో రాజకీయ వేడి మరింత పెరిగింది. ఈ నెల 19న ఆచంటలో ఇరు పార్టీల కార్యకర్తలతో మార్టేరు నుంచి ఆచంట వరకు వేల సంఖ్యలో జనంతో కిక్కిరిసిపోయే అవకాశం ఉంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.

Updated Date - Apr 18 , 2024 | 12:50 AM