Share News

ఇక మున్సిపల్‌ పాఠశాలలపై ‘మ్యాపింగ్‌’ కత్తి !

ABN , Publish Date - Mar 28 , 2024 | 12:31 AM

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లావ్యాప్తంగా వున్న మున్సిపల్‌ పాఠశాలల్లో హేతుబద్దీకరణ (రేషనలైజేషన్‌) ప్రక్రియను చేపట్టాలని ప్రభుత్వం హడావుడిగా ప్రొసీడింగ్స్‌ ఆదేశాలను జిల్లా విద్యాశాఖకు పంప డంతో ఉపాధ్యాయ వర్గాల్లో ఒకింత అలజడి నెలకొంది.

ఇక మున్సిపల్‌ పాఠశాలలపై ‘మ్యాపింగ్‌’ కత్తి !

ఉమ్మడి జిల్లాలో వందల సంఖ్యలోనే

టీచర్లకు ‘మిగులు’ భయం?

ఇప్పటికే హేతుబద్ధీకరణతో జడ్పీ పాఠశాలలు కుదేలు

ఏలూరు ఎడ్యుకేషన్‌, మార్చి 27 : జిల్లా పరిషత్‌/ప్రభుత్వ పాఠశాలలను, ఉపాద్యాయులను ఇప్పటికే తీవ్రంగా ప్రభావితం చేసిన జీవోలు 117, 121 ఉత్తర్వుల ప్రధానాంశాలు తాజాగా మున్సిపల్‌ పాఠశాలలను కుదిపి వేయనున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లావ్యాప్తంగా వున్న మున్సిపల్‌ పాఠశాలల్లో హేతుబద్దీకరణ (రేషనలైజేషన్‌) ప్రక్రియను చేపట్టాలని ప్రభుత్వం హడావుడిగా ప్రొసీడింగ్స్‌ ఆదేశాలను జిల్లా విద్యాశాఖకు పంప డంతో ఉపాధ్యాయ వర్గాల్లో ఒకింత అలజడి నెలకొంది. ఎన్నికల నియ మావళి అమల్లో ఉండగా మున్సిపల్‌ పాఠశాలల రేషనలైజేషన్‌ ఎలా చెల్లుబాటవుతుందని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ సూచనలకనుగుణంగా ఉమ్మడి జిల్లా డేటాను సేకరించే కసరత్తును విద్యాశాఖ ప్రారంభించింది. ఉమ్మడి జిల్లాలో ఏలూరు కార్పోరేషన్‌, తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం, నిడదవోలు, కొవ్వూరు, నర్సాపురం మున్సి పాల్టీలున్నాయి. ఇప్పటికే జడ్పీ/గవర్నమెంట్‌ యాజమాన్య పరిధిలోని ప్రాథమిక పాఠశాలల్లో 1, 2, 3 తరగతులను ఒక కిలోమీటరు దూరంలోని ప్రాథమికోన్నత పాఠశాలల్లో విలీనం చేసే ప్రక్రియను ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే అమలు చేస్తుండగా అన్ని ఉపాధ్యాయ సంఘాల నుంచి తీవ్ర ప్రతిఘటన ప్రభుత్వానికి ఎదురైన విషయం తెలిసిందే. ఈ మేరకు రేషనలైజేషన్‌ ప్రక్రియను అమలు చేయడం వల్ల పెద్దసంఖ్యలోనే ప్రభుత్వ పాఠశాలలు మూతపడటమో లేదా విలీన పాఠశాలలు దూరాభారం కావడం వల్ల బాలబాలికల సంఖ్య గణనీయంగా పడిపోవడమో జరిగాయి. హేతు బద్దీకరణ వల్ల పాఠశాలల కుదింపు జరగడంతో పాటు టీచర్లు రోజువారీ బోధించే పిరియడ్ల సంఖ్య దాదాపు 50 శాతం పెరిగిపోవడంతో తమపై మోయలేని పనిబారం పడిందంటూ ఉపాధ్యాయ వర్గాలు ప్రభుత్వ చర్యలను బాహాటంగానే వ్యతిరేకించాయి. వీటన్నింటినీ ఖాతరు చేయని ప్రభుత్వం ఇపుడు రేషనలైజేషన్‌ను మున్సిపల్‌ పాఠశాలలకు కూడా విస్తరిం చాలని నిర్ణయించడం ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళనకు కారణమవుతోంది.

పెద్దసంఖ్యలోనే ‘మిగులు’ ఉపాధ్యాయులు

ఏలూరు నగరపాలక సంస్థ యాజమాన్య పరిధిలో 44 ప్రాథమిక, 4 ప్రాథమికోన్నత, 7 ఉన్నత పాఠశాల లున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం ఒక్క ఏలూరు కార్పోరేషన్‌ పాఠశాలల్లోనే హేతుబద్దీకరణ అనంతరం సుమారు 125 మంది సెకండరీ గ్రేడ్‌ టీచర్లు, 20–25 మంది స్కూల్‌ అసిస్టెంట్లు సర్‌ప్లస్‌ (మిగులు) టీచర్లు ఉంటారని అంచనా. అధికారిక మదింపు అనంతరం ఈ సంఖ్యల్లో కొద్దిపాటి మార్పులు ఉండ వచ్చు. ఇదే పరిస్థితి ఉమ్మడి జిల్లాలోని మిగతా పురపాలక సంఘాల్లో కూడా తలెత్తవచ్చునని ప్రచారం జరుగుతోంది. ఇంతకుముందు మున్సిపల్‌ పాఠశాలల నిర్వహణ అధికారాలు మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ పరిధిలో ఉండేవి. ఇటీవల ఈ అధికారాలను పంచాయతీరాజ్‌ /ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ చూసే పాఠశాల విద్యాశాఖకు బదలాయించారు. తాజాగా హేతుబద్దీకరణ ప్రక్రియను చేపట్టిన కార్పోరేషన్‌/మున్సిపల్‌ పాఠశాలల్లో సర్‌ప్లస్‌ టీచర్లను జిల్లా యూనిట్‌గా ఇతర మున్సిపాల్టీల్లో కొరత వున్న పాఠశాలలకు సర్దుబాటు చేస్తారన్న ప్రచారం ఒకటి జరుగుతోంది. కాగా ఏలూరు నగరపాలక సంస్థ పాఠశాలల్లో సర్‌ప్లస్‌గా గుర్తించిన టీచర్లను ఇతర పాఠశాలలకు సర్దుబాటు చేయాలంటే ఉమ్మడి జిల్లాలో మరో మున్సిపల్‌ కార్పోరేషన్‌ లేకపోవడంతో సాంకేతికపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. తొలుత రేషనలైజేషన్‌ను పూర్తిచేసి పాఠశాలల మ్యాపింగ్‌, మిగులు ఉపాధ్యాయుల సర్దుబాటు జూన్‌ నుంచి ప్రారంభమయ్యే నూతన విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చేలా నిర్ణయం తీసుకునే అవకాశా లున్నాయి. దీనిపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.

Updated Date - Mar 28 , 2024 | 12:31 AM