Share News

నారు మునిగింది

ABN , Publish Date - Jul 08 , 2024 | 12:19 AM

భారీ వర్షాలతో సార్వా నారుమడులు మరోసారి నీట మునిగాయి. డెల్టా ప్రాంతంలో నారుమడులు ఆలస్య మైన చోట్ల వర్షానికి ముంపు బారిన పడ్డాయి.

నారు మునిగింది
భీమవరం మండలంలో నారుమడిలో నీరు తోడుతున్న రైతు

జిల్లాలో 4,500 ఎకరాలలో నారుమడులు పూర్తి

2వేల ఎకరాలపైగా ముంపులోనే

భారీ వర్షాలతో రహదారులు జలమయం

భీమవరం రూరల్‌, జూలై 7: భారీ వర్షాలతో సార్వా నారుమడులు మరోసారి నీట మునిగాయి. డెల్టా ప్రాంతంలో నారుమడులు ఆలస్య మైన చోట్ల వర్షానికి ముంపు బారిన పడ్డాయి. రెండు రోజులు నుంచి అధిక వర్షపాతం నమోదు కావడంతో నారుమడులను రక్షించే ప్రయత్నాలలో రైతులు విఫలమయ్యారు. వాతావరణం అనుకూలిస్తే గాని నారుమడులు దక్కించుకునే పరిస్థితులు లేవు. జిల్లాలో 2.11 లక్షల ఎకరాల్లో వరి సాగుకు 5వేల ఎకరాలలో నారుమడులు వేయాల్సి ఉంది. ఇప్పటి వరకు 4500 ఎకరాల్లో నారుమడులు వేశారు. మెట్ట ప్రాంతం, తాడేపల్లిగూడెం, పెంటపాడు, తణుకు ప్రాంతాలలో నారుమడులు వేసి 15 రోజులు కావస్తుండంతో ముంపు బెడద లేదు. ఆలస్యంగా వేసిన 2వేల ఎకరాల నారుమడులు భీమవరం, నర్సాపురం, వీరవాసరం, కాళ్ళ పలు మండలాలలో పూర్తిగా మునిగాయి. ఇంకా 500 ఎకరాల్లో నారుమడులు వేయాల్సి ఉండగా అనుకూల పరిస్ధితులు లేవు. సార్వా ఆదిలోనే రైతులు అవస్థలు పడుతున్నారు.

రెండు సార్లు మునిగింది

నారుమడి వేసి 9 రోజులవుతోంది. ఇప్పటికి రెండోసారి వర్షపునీటికి మునిగింది. నీటిని బయటకు తోడితే మళ్లీ వర్షం కురవడంతో నిండా మునిగింది. వారం రోజుల క్రితం నారుమడి వేసినప్పుడు రెండు రోజులు వర్షాలతో ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు మూడు రోజుల నుంచి నారుమడి రక్షించుకునే ప్రయత్నం చేస్తునే ఉన్నాను.

మాధవ ప్రసాద్‌, రైతు, శృంగవృక్షం

రెండు రోజుల్లో 67 మి.మీ. వర్షపాతం

పెంటపాడు, భీమవరం రూరల్‌: మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రహదారులు జలమయం అయ్యాయి. గడిచిన రెండు రోజుల్లో జిల్లాలో 67 మి.మీ. వర్షపాతం నమోదైంది. నారుమడులు ముంపుతో పాటు పంట భూములలో మూడడుగుల నీరు నిలిచి చెరువులను తలపిస్తున్నాయి. ఆదివారం తాడేపల్లిగూడెంలో 78 మి.మీ., పెంటపాడులో 57.2 మి.మీ. అత్యధిక వర్షపాతం నమోదైంది.

పెంటపాడు మండలంలో ఆదివారం సుమారు తెల్లవారుజామున 4 గంటలకు ప్రారంభమైన ఏకధాటిగా రెండు గంటల సేపు కురిసింది. గ్రామాలలో రహదారులు కాలువలా మారిపోయాయి. తాడేపల్లిగూ డెం మార్కెట్‌ బురదమయమైంది. ఆదివారం మార్కెట్‌ కొనుగోలు దారుల రద్దీతో అవస్థలు పడ్డారు. డ్రెయినేజీల నుంచి నీరు సరిగ్గా వెళ్లకపోవడంతో రహదారులు కాలువలా మారాయి. రావిపాడులో నారుమడులు నీట మునిగాయి.

Updated Date - Jul 08 , 2024 | 12:19 AM