Share News

వాన కురిసింది

ABN , Publish Date - May 17 , 2024 | 12:10 AM

వాతావరణంలో మార్పుల కారణంగా ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. రానున్న మూడు రోజులపాటు తేలికపాటి వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతులు ముందుజాగ్రత్తగా చేతికందించి ధాన్యాన్ని ఒబ్బిడి చేసుకునే పనిలోపడ్డారు.

వాన కురిసింది
ఆచంటలో ధాన్యం రాశులపై బరకాలు కప్పుతున్న రైతులు

చల్లబడిన వాతావరణం.. సేద తీరిన జనం

పూర్తికాని మాసూళ్లు.. పంట రక్షించుకునే పనిలో రైతులు

ఆచంట/ఉండి/పాలకొల్లు అర్బన్‌/మొగల్తూరు, మే 16 : వాతావరణంలో మార్పుల కారణంగా ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. రానున్న మూడు రోజులపాటు తేలికపాటి వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతులు ముందుజాగ్రత్తగా చేతికందించి ధాన్యాన్ని ఒబ్బిడి చేసుకునే పనిలోపడ్డారు. గురువారం వేకువజాము నుంచి జిల్లాలో చిరుజల్లులు పడటంతో రైతులు కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యాన్ని రాశులుగా పోసి, గడ్డి కప్పి గాలికి ఎగరకుండా బరకాలతో కట్టారు. మొగల్తూరు మండలం 1,192 ఎకరాల్లో దాళ్వా సాగు చేపట్టగా 250 ఎకరాల్లో మాత్రమే నాట్లు వేశారు. మిగిలిన రైతులు వాతావరణంలో మార్పుల కారణంగా ఆలస్యంగా నాట్లు వేసుకోవడంతో దిగుబడి రావడం ఆలస్యమైంది. దీంతో ముందుగా ఊడ్చిన రైతులు తమ ధాన్యాన్ని ఒబ్బిడి చేసుకోగా ఆలస్యంగా ఊడ్చిన రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మొగల్తూరు, రామన్నపాలెం, శేరేపాలెం, కేపీ పాలెం, పేరుపాలెం గ్రామాల్లోని రైతులు కోసిన ధాన్యాన్ని తేమ శాతం లేకుండా రహదారులపైన, చేలల్లోని కల్లాల్లోను ఆరబెడున్నారు. అయితే వాతావరణ మార్పులతో వీటిని కుప్పలుగా పోసి బరకాలు, గడ్డి కప్పి గాలి, వానలకు తడవకుండా రైతులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆచంట మండలంలో 90 శాతానికి పైగా దాళ్వా మాసూళ్ళు పూర్తయ్యాయి. కొన్ని రోజులుగా ఎండలు ఎక్కువగా ఉండటంతో మాసూళ్ళు వేగంగా జరుగుతున్నాయి. ఈ తరుణంలో గురువారం వాతావరణం ఒక్కసారిగా మబ్బులు, మేఘాలు పట్టి వర్షం పడటంతో రైతులు ఆందోళన చెందారు. అనేకచోట్ల ధాన్యం రాశులు, బస్తాలు రోడ్ల మీదే ఉండటంతో తడిచిపోకుండా రైతులు బరకాలతో కప్పుకున్నారు. మధ్యాహ్నం నుంచి వాతావరణం పొడిగా ఉండటంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. వేమవరం, వల్లూరు, పెనుమంచిలి, పెదమల్లం వంటి గ్రామాల్లో మాసూళ్ళు కావాల్సి ఉంది. అయితే వాతావరణం వారిని భయపెడుతోంది.

పాలకొల్లులో ఉదయం నుంచి చిరుజల్లులు కురవడంతో వాతావరణం కొంత చల్లగా మారింది. రోజంతా ఆకాశంలో మబ్బులు కమ్మి ఉండటంతో ఆహ్లాదకరంగా ఉంది. ఎండ వేడిమిని చూసి భయపడుతున్న ప్రజలు చల్లని వాతావరణంతో సేద తీరుతున్నారు. ఉండి మండలం యండగండి, ఉణుదుర్రు, ఉప్పులూరు, వెలివర్రులో కుండపోత వర్షం కురిసింది. అప్పుడు వరకు మండుటెండతో ఉక్కపోతతో ఇబ్బంది పడిపోయిన ప్రజలు రైతులు ఒక్కసారిగా మేఘం కమ్మడంతో ఊపిరి పీల్చుకున్నారు. కుండపోత వర్షంతో రోడ్లపై వర్షం నీరు చేరి అధ్వాన్నంగా మారింది. రోడ్లకు ఇరు వైపులా డ్రైయినేజీలు లేకపోవడంతో వర్షం నీరు రహదారులపై నిలిచిపోయింది. ఆర్‌అండ్‌బీ రోడ్లపైనవున్న గోతుల్లో నీరు చేరి ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది.

దిగుబడి లేని మామిడి

ఈ ఏడాది మామిడి రైతులు దిగుబడి లేక ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. గత ఏడాది వర్షాలు తక్కువగా ఉండటంతో దాని ప్రభావం ఈ ఏడాది మామిడి ఫలసాయంపైన పడింది.

Updated Date - May 17 , 2024 | 12:10 AM