Share News

గాలి..వాన..బీభత్సం

ABN , Publish Date - May 08 , 2024 | 12:39 AM

కొన్ని రోజులుగా సూర్య ప్రతాపానికి అల్లాడిన ప్రజలకు ఊరటనిస్తూ మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో సేదతీరారు.

గాలి..వాన..బీభత్సం
భీమవరంలో ధాన్యం సంరక్షణకు రైతుల పాట్లు

అకాల వర్షంతో చల్లబడిన వాతావరణం.. సేద తీరిన జనం

ధాన్యం రాశులు కాపాడుకునేందుకు రైతుల పరుగులు

భీమవరం రూరల్‌/టౌన్‌/యలమంచిలి/ నరసాపురం/ ఉండి/ఆచంట/తాడేపల్లిగూడెం రూరల్‌/పాలకోడేరు, మే 7 : కొన్ని రోజులుగా సూర్య ప్రతాపానికి అల్లాడిన ప్రజలకు ఊరటనిస్తూ మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో సేదతీరారు. మధ్యాహ్నం వరకు ఎండ తీక్షణంగా ఉండడంతో జనం ఇబ్బందులు పడ్డారు. తర్వాత నుంచి వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. పలుచోట్ల ఒక మాదిరి వర్షం కురవగా మరి కొన్నిచోట్ల జల్లులతో సరిపెట్టింది. గాలుల కారణంగా విద్యుత్‌ వైర్లు తెగిపడ్డాయి. విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. మరోవైపు అకాల వర్షానికి రైతుల్లో అలజడి నెలకొంది. జిల్లా అంతటా జల్లులు పడటంతో రైతులు పరుగులు పెట్టారు. ఆరబెట్టిన ధాన్యాన్ని రాశులుగాను, బస్తాలుగా మార్చేందుకు ఆపసోపాలు పడ్డారు. జిల్లాలో రెండు లక్షల 20 వేల ఎకరాలలో దాళ్వా సాగు చేయగా ఇప్పటి వరకు లక్షా 70 వేల ఎకరాలలో పంట మాసూళ్లయ్యింది. నాలుగు లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం విక్రయించగా, 50 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం రాశులుగా, బస్తాలుగా ఉందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి వర్షాలతో నష్టం ఉండదని చెబుతున్నారు. యలమంచిలి మండల గ్రామాల్లో కళ్లాల్లో ఆరబోసిన ధాన్యాన్ని వర్షం బారిన పడకుండా రక్షించుకునేందుకు రైతులు ఉరుకులు పరుగులు తీశారు. ఽధాన్యం రాశులపై బరకాలు, టార్ఫాలిన్లు కప్పారు. నరసాపురం తీర ప్రాంత ప్రజలు వాతావరణ మార్పుతో ఉక్కబోత నుంచి ఉపశమనం పొందారు. చల్లటి గాలులు వీచాయి. తేలికపాటి జల్లులు కురిశాయి. గాలి వానకు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఉండి కురిసిన కుండ పోత వర్షానికి రోడ్లు, డ్రైన్లు అధ్వానంగా మారాయి. నీరంతా రోడ్లపై చేరడంతో ప్రజలు అవస్థలకు గురయ్యారు. రైతులు ఆందోళన చెందారు. ఆచంట మండలంలో దాళ్వా మాసూళ్ళు చివరి దశకు చేరుకున్నాయి. గాలి వానకు రోడ్లమీద ఉన్న ధాన్యం తడిచిపోకుండా రైతులు బరకాలతో కప్పుకున్నారు. ఆకివీడు మండలంలో 4,800 ఎకరాలకు 3,800 ఎకరాల ధాన్యాన్ని రైతులు ఒబ్బిడి చేసినట్లు వ్యవసాయాధికారి ప్రియాంక తెలిపారు. కోత కోయని వరి, కోసి పనలపై ఉన్నా ఈ వర్షానికి ఎటువంటి నష్టం ఉండదని ఆమె తెలిపారు. ఎండ తీవ్రతకు అల్లాడిన తాడేపల్లిగూడెం ప్రజలు కురిసిన వర్షంతో ఉపశమనం పొందారు.

కొబ్బరి చెట్టు విరిగి రైతు మృతి

పాలకోడేరు మండలం శృంగవృక్షానికి చెందిన రైతు నిమ్మన శ్రీనివాస్‌(45) చెట్టు విరిగిపడి రైతు మృతి చెందాడు. మంగళవారం సాయంత్రం ఈదులు గాలులు వీస్తుండటంతో ఆర బెట్టిన ధాన్యం తడుస్తుందన్న కంగారులో ఇంటి వద్ద నుంచి పొలం బయలుదేరాడు. దారిలో తన బాబాయ్‌ సుబ్బారావును తీసుకుని వెళ్లేందుకు ఆయన ఇంటికి బైక్‌పై వెళ్లాడు. అక్కడ కొబ్బరిచెట్టు విరిగిపడి శ్రీనివాస్‌ మృతి చెందాడు. ఆయనకు భార్య సత్యనాగతులసి, ఇంజనీరింగ్‌ చదువుతున్న కుమారుడు, ఇంటర్‌ చదువుతున్న కుమార్తె ఉన్నారు. ఎస్‌ఐ నాళం శ్రీనివాసరావు కేసు నమోదు చేశారు.

Updated Date - May 08 , 2024 | 12:39 AM