Share News

పుట్టాకే పట్టాభిషేకం

ABN , Publish Date - Jun 05 , 2024 | 12:24 AM

ఏలూరు లోక్‌సభ స్థానంలో తెలుగుదేశం అభ్యర్థి పుట్ట మహేశ్‌ కుమార్‌ యాదవ్‌ ఘన విజయం సాధించారు.

పుట్టాకే పట్టాభిషేకం
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌ చేతుల మీదుగా ధ్రువీకరణ పత్రం తీసుకుంటున్న పుట్టా మహేశ్‌ యాదవ్‌

ఏలూరు లోక్‌సభలో ఘన విజయం.. వైసీపీ అభ్యర్థిపై లక్షా 78 వేల పైచిలుకు మెజార్టీ

అన్ని వర్గాలను కూడగట్టుకున్న కూటమి అభ్యర్థి మహేశ్‌ యాదవ్‌

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి) :

ఏలూరు లోక్‌సభ స్థానంలో తెలుగుదేశం అభ్యర్థి పుట్ట మహేశ్‌ కుమార్‌ యాదవ్‌ ఘన విజయం సాధించారు. రాజకీయాల్లో తండ్రి చాటుగా బిడ్డగా పిల్లనిచ్చిన మామ చాటు అల్లుడుగా పేరొందిన ఆయన తొలిసారి లోక్‌సభ ఎన్నికల్లో అడుగిడారు. ఇప్పుడున్న రాజ కీయ ఒత్తిడులు, ఎత్తులు పైఎత్తుల నడుమ ఆయన కొద్ది సమయం లోనే ఏలూరు లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో దూసుకుపోయారు. ఫలితంగా తొలిసారిగా ఆయన ఏలూరు లోక్‌ సభ స్థానం నుంచి ఢిల్లీకి వెళ్లబోతున్నారు. ఇక్కడ మరో 12 మంది ఎన్నికల బరిలో ఉండగా మహేశ్‌యాదవ్‌కు ఏడు లక్షల 37 వేల 644 ఓట్లు దక్కాయి. సమీప ప్రత్యర్థి కారుమూరి సునీల్‌కుమార్‌ ఐదు లక్షల 59 వేల 318 ఓట్లు మాత్రమే సాధించడంతో మహేష్‌ దాదాపు లక్షా 78 వేల 326 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. వాస్తవానికి ఈ నియోజకవర్గంలో రాజకీయ హేమాహేమీలు బరిలో వుండేవారు. వీరి మధ్య పోటీ ఆ స్థాయిలోనే ఉండేది. కానీ ఏలూరు లోక్‌సభ స్థానం నుంచి బీసీ అభ్యర్థులు మాత్రమే రంగంలోకి దింపా లని చంద్రబాబు లక్ష్యంగా ఎంచుకుని ఇప్పటికే ఇన్‌ఫ్రా రంగంలో వున్న మహేష్‌ యాదవ్‌ను అభ్యర్థిగా ఎంపిక చేశారు. పట్టుమని 45 రోజులు కూడా నోటిఫికేషన్‌ విడుదలకు సమయం లేకపోయినా ధైర్యంగా ముందుడుగు వేశారు. పోలవరం నిర్వాసితులకు అండగా నిలిచేందుకు వీలుగా ఏలూరులో అడుగిడిన తొలినాళ్ళలోనే పోల వరం, కుక్కునూరు, వేలేరుపాడు, ముంపు ప్రాంతాల్లో పర్యటించ డమే కాకుండా వారికి ధైర్యం చెప్పారు. కొయ్యలగూడెం ఎన్నికల సభలో జనసేనాని పవన్‌కల్యాణ్‌ కీలక ప్రకటన చేశారు. పోలవరం నిర్వాసితులను ఆదుకునేందుకు ఒక సహాయ నిధిని ఏర్పాటు చేస్తున్నట్లుగా దానికి రూ.కోటి విరాళంగా ఇస్తున్నట్లుగా ప్రకటిం చారు. దీనికి స్పందించిన మహేశ్‌కుమార్‌ యాదవ్‌ తాను కూడా వ్యక్తిగత ఖాతా నుంచి రూ.కోటి ఇస్తున్నట్టు ప్రకటించారు. ఇది కాస్త పోలవరంలో ఆయన ఇమేజ్‌ను పెంచింది. సమాంతరంగా అక్కడ ఓటమికి చేరువుగా పయనించిన జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజుకు జీవం పోయడమే కాకుండా తగినంత మెజార్టీ వచ్చేలా చేసిందనేది కూటమి విశ్లేషణ. దెందులూరులో చింతమనేని ప్రభాకర్‌కు టికెట్‌ కేటాయింపులో అధిష్ఠానంను ఒప్పించడంలోనూ మహేశ్‌ కృషి దాగి వుంది. ఫలితంగా ఏడు అసెంబ్లీ స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులకు భారీ మెజార్టీ దక్కడం మహేష్‌కు కలిసొచ్చినట్లయింది. ఏలూరు, ఉంగుటూరు నియోజకవర్గాల్లోనే లక్షకు పైగా ఎమ్మెల్యే అభ్యర్థులకు మెజార్టీ లభించింది. మొత్తంగా ఏడు అసెంబ్లీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందినా వారి అందరి మెజార్టీ రెండు లక్షల 23 వేలకు పైగానే ఉంది. అదే ఎంపీ స్థానానికి వచ్చేసరికి ఈ మెజార్టీ కాస్తా లక్షా 78 వేలకే పరిమితమైంది. అయితే ఆయా నియోజక వర్గాలోని కొన్ని సామాజిక వర్గాలు క్రాస్‌ ఓటింగ్‌ పాల్పడినట్లు ధ్రువపడుతోంది. అయినప్పటికి లోక్‌సభ స్థానానికి పోటీ చేసిన మహేశ్‌ యాదవ్‌ భారీ మెజార్టీతో గెలుపొందడంతో కూటమిలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు ఈ నియోజక వర్గంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న భరోసా కూడా మహేశ్‌ను జనం మెచ్చేలా చేసింది. పోలవరం ప్రాజెక్టు, చింతలపూడి ఎత్తిపోతల పథకం ప్రధాన అస్త్రాలుగా ఎన్నికల ప్రచారంలో ఆయనకు కలిసొచ్చిన మరో అంశం. ఇంకొవైపు వైసీపీ అభ్యర్థి విషయంలో అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులు పెద్దగా భుజానకెత్తుకొకపోవడం కొన్నిచోట్ల అంతర్గత విబేధాలు కూడా మహేష్‌ విజయానికి దారి తీశాయి.

మిగతా వారి సంగతేమిటంటే ..

ఏలూరు లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా కావూరి లావణ్య తొలిసారి పోటీకి దిగారు. ఆమెకు 19,820 ఓట్లు దక్కాయి. పోలింగ్‌ సమయంలో తనకు సొంత పార్టీలోని అసెంబ్లీ అభ్యర్థులు కలిసి రాలేదని పోలింగ్‌ ముగిసిన తర్వాత లావణ్య ఆరోపణలకు దిగారు. తొలిసారిగా రంగంలోకి దిగినా కాస్తంత సంతృప్తికర రీతి లోనే ఓట్లు దక్కినా ఓటమి తప్పలేదు. నవరంగ్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసిన అజయ్‌బాబుకు 12,197 ఓట్లు, ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి పేరిట అభ్యర్థిగా నిలిచిన రుద్రపాక రత్నారావుకు 1,523 ఓట్లు, డాక్టరు మెండెం సంతోష్‌కుమార్‌కు 777 ఓట్లు, భారత చైతన్య యువజన పార్టీ అభ్యర్థి మాల్యాద్రికి 705 ఓట్లు, బహుజన సమాజ్‌పార్టీ అభ్యర్థి అఖిల ధరణి పాల్‌కు 6,664 ఓట్లు, భారతీయ జవాన్‌ కిసాన్‌ పార్టీ అభ్యర్థి రాజేశ్వరరావుకు 729 ఓట్లు, ఇండిపెం డెంట్‌ అభ్యర్థులు దయాకర్‌కు 1172, ఆగస్టీన్‌కు 1001 ఓట్లు, కోటేశ్వ రరావుకు 2252 ఓట్లు, పిరమిడ్‌ పార్టీ అభ్యర్థి రాఘవులకు 710 ఓట్లు దక్కాయి.

మాటకే కట్టుబడతా : మహేశ్‌ యాదవ్‌

ఏలూరు లోక్‌సభ అభ్యర్థిగా తనను ఎన్నుకున్న ఓటర్లకు కూటమి అభ్యర్థి పుట్ట మహేష్‌కుమార్‌ యాదవ్‌ కృతజ్ఞతలు తెలిపారు. తాను ఏదైతే ఎన్నికల సమయంలో ఏలూరు లోక్‌సభ స్థానం పరిధిలో ప్రజలకు హామీనిచ్చానో వాటన్నింటిని నిలుపుకుంటానని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయ్యే వరకూ విశ్రమించబోనని, తగ్గట్టుగానే రైతులతో పాటు అన్ని వర్గాల సంక్షేమం కోసం నిక్కచిగా పనిచేస్తానన్నారు. లోక్‌సభ అభ్యర్థిగా తనకు ఇచ్చిన అవకాశాన్ని ప్రజల మేలు కోసం వినియోగిస్తానన్నారు.

Updated Date - Jun 05 , 2024 | 12:24 AM