భీమవరం దశ మారేలా
ABN , Publish Date - Jun 26 , 2024 | 12:27 AM
ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాకతో జాతీయ రహదారిని పరుగులు పెట్టించాల్సిన అవసరం వుంది. ఇది జరిగితే భీమవరం రూపురేఖలు మారిపోనున్నాయి.
జాతీయ రహదారి పనులు పూర్తికావాలి
యనమదుర్రుపై వంతెనలకు అప్రోచ్‌లు నిర్మించాలి
కాలువ కాలుష్య నివారణకు కోట్లు కేటాయించాలి
ఎన్నో ఏళ్లుగా ఉన్న కంపోస్టు యార్డు సమస్యను తీర్చాలి
ట్రాఫిక్ సమస్య నివారణకు రింగ్ రోడ్లు వేయాలి
కుదేలైన నిర్మాణ రంగానికి ఊపిరి పోయాలి
భీమవరం టౌన్, జూన్ 25 : వైసీపీ హయాంలో ఉండి నుంచి భీమవరం మీదుగా వెళ్ళే జాతీయ రహదారి నిర్మాణ పనులకు అవరోధాలు ఏర్పడ్డాయి. ఆ పార్టీ నేతలు అడ్డు తగలడంతో భూసేకరణ ప్రధాన సమస్యగా మారింది. ఫలితంగా జాతీయ రహదారికి ప్రతిపాదనలు రూపొందించలేకపోయారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాకతో జాతీయ రహదారిని పరుగులు పెట్టించాల్సిన అవసరం వుంది. ఇది జరిగితే భీమవరం రూపురేఖలు మారిపోనున్నాయి.
అప్రోచ్ రోడ్లకు ఏదీ మోక్షం ?
యనమదుర్రుపై నిర్మించిన వంతెనలకు అప్రోచ్‌ల ఏర్పాటుకు 2014లో టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే అంజిబాబు ప్రయత్నించారు. పనులు కొలిక్కి వచ్చే సమయంలో ప్రభుత్వం మారింది. జగన్ సర్కార్ రావడంతోనైనా ఇది ఒక కొలిక్కి వస్తుందని అంతా భావించారు. కాని, ఈ ఐదేళ్లు కూడా పనులు జరగలేదు. తిరిగి అంజిబాబు ఎమ్మెల్యే కావడంతో దీనికి మోక్షం లభిస్తుందని కూటమి నేతలు చెబుతున్నారు. అప్రోచ్ రహదారులు నిర్మిస్తే యనమదుర్రుకు అటు ఇటు వచ్చే గ్రామాల ప్రజల రాకపోకలకు మార్గం సుగమం అవుతుంది. భీమవరం నుంచి వంతెన మీదుగా వంద మీటర్లతోనే ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్ళిపోవచ్చు. ఇవి నిరుపయోగంగా మారడంతో 15 కిలోమీటర్లు పైనుంచి వంతెనకు అవలి వైపు ఉన్న గ్రామాలకు చేరుకోవలసి వస్తోంది. భీమవరం రూరల్ మండలంలో ఎన్నో ఏళ్ళుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల ముందు జగన్ భీమవరం వచ్చినపుడు అప్రోచ్‌లను పూర్తి చేస్తామని హామి ఇచ్చారు. అందుకోసం అవసరమైన రూ.30 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికల ముందు టెండర్లు పిలుస్తున్నట్లు హడావుడి చేశారు. అంతేతప్ప అప్రోచ్ నిర్మాణం పూర్తి చేయలేదు. కూటమి ప్రభుత్వం దీనిని పూర్తి చేస్తే భీమవరం మండల ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సమస్య పరిష్కారం లభిస్తుంది. ప్రజల సమస్య తీరుతుంది.
ట్రాఫిక్ సమస్య
పట్టణానికి మరో ప్రధాన సమస్య ట్రాఫిక్. బయట నుంచి వచ్చే వాహనాలు పట్టణం మీదుగా వెళ్లడంతో నిత్యం ట్రాఫిక్ సమస్య వెంటాడుతోంది. ప్రధాన రోడ్డుపై ఏదైనా ఇబ్బంది వచ్చిందా ? ఇకంతే ! చాంతాడంత ట్రాఫిక్ నిలిచిపోతుంది. నిత్యం బయట నుంచి పట్టణానికి వేలాది మంది వాహనాలతో వచ్చి కొనుగోలు చేస్తుంటారు. సరైన పార్కింగ్ లేకపోవడంతో ప్రధాన మార్కెట్ మీదుగా ట్రాఫిక్ వెళ్లడంతో ఈ సమస్యకు పరిష్కారం లభించటం లేదు. సమస్య పరిష్కారానికి రింగ్ రోడ్లను ప్రతిపాదించినా ఇప్పటి వరకు ఒకటి కూడా కార్యాచరణకు నోచుకోలేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదనలు పంపినా కేంద్ర స్థాయిలో వాటికి ఆమోదం లభించలేదు. కూటమి ప్రభుత్వం దీనిని పరిష్కరించాల్సి వుంది.
కుదేలైన నిర్మాణ రంగం
అపార్ట్‌మెంట్ నిర్మాణం రంగం పూర్తిగా నిలిచిపోయింది. గతంలో భారీస్థాయిలో నిర్మాణాలు జరిగేవి. ఐదేళ్లుగా నిర్మాణరంగం నిలిచిపోయింది. ఈ రంగంలో ఉన్నవారు చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేసి చేతులు దులుపుకున్నారు. మూడేళ్ల నుంచి నిర్మాణాలు లేవు. ఈ రంగానికి అవసరమైన ఇసుక, కంకర, ఐరన్, సిమెంట్ ధరలు విపరీతంగా పెరగడం కూడా ఆగిపోవటానికి ఒక కారణం. దీంతో దినసరి కూలీలకు పనులు దొరకని పరిస్థితి. ఇప్పుడు ప్రభుత్వం మారడం, నిబంధనలకు సడలింపు ఇవ్వడంతో సామగ్రి అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రంగంకు ఊపు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి.