కూటమి ముందు సవాళ్లు ఎన్నో..!
ABN , Publish Date - Jun 12 , 2024 | 12:01 AM
ప్రజా ఆకాంక్షకు అనుగుణంగా కూటమి నూతన ప్రభుత్వం నేడు కొలువుతీరనుంది. జిల్లాలకు జిల్లాలే వైసీపీని తుడిచిపెట్టి కూటమి పక్షాన ఏకపక్ష తీర్పును ఇచ్చిన ప్రజలను రాను న్న ఐదేళ్ళలోనూ నూతన ప్రభుత్వం సంతృప్తి పరచాల్సి ఉంది.

ఎన్నికల హామీలపై అప్పుడే జనంలో ఉత్కంఠ
పోలవరం దగ్గర్నుంచి ఎత్తిపోతల వరకు అన్ని పూర్తిచేయాల్సిందే
సూపర్‌సిక్స్ జీవం పోసేలా జనం ఆశలు
అక్రమ కేసుల నుంచి ప్రజలను బయటపడేయాల్సిందే
కేంద్ర సహకారంతో రాష్ర్టాన్ని ఒడ్డుకు చేర్చాల్సిందే
ప్రజాపాలన సాగాలి.. ఇది కొత్త ప్రభుత్వంపై ప్రజా ఆకాంక్ష
(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి) :
ప్రజా ఆకాంక్షకు అనుగుణంగా కూటమి నూతన ప్రభుత్వం నేడు కొలువుతీరనుంది. జిల్లాలకు జిల్లాలే వైసీపీని తుడిచిపెట్టి కూటమి పక్షాన ఏకపక్ష తీర్పును ఇచ్చిన ప్రజలను రాను న్న ఐదేళ్ళలోనూ నూతన ప్రభుత్వం సంతృప్తి పరచాల్సి ఉంది. ఇప్పటికే రాష్ట్రం యావత్తు అప్పులమయం అయింది. ఇలాంటి తరుణంలో కొత్త ప్రభుత్వానికి పెనుసవాళ్ళు ఎదురుకానున్నా యి. వీటన్నింటిని అధికమిస్తేనే ప్రజా ఆకాంక్ష నెరవేర్చిన వారు అవుతారు.
తాము అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే పోలవరం నిర్మాణం చేపట్టి శరవేగంగా పూర్తి చేస్తామని కూటమి పక్షాన ప్రధాని నరేంద్ర మోదీతో పాటు చంద్ర బాబు, పవన్‌లు ప్రజలకు భరోసా ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు ఇప్పటికే 78 శాతం పనులు పూర్తి అయ్యాయి. అత్యంత కీలకమైన ఎర్త్‌కమ్ రాక్‌ఫిల్‌డ్యామ్ నిర్మించాల్సి ఉంది. ఇప్పటికే కొట్టుకుపోయి ప్రధాన డ్యామ్ నిర్మాణానికి ఆటంకంగా ఉన్న డయా ఫ్రమ్ వాల్ నిర్మాణానికి చర్యలు తీసు కోవాల్సిందే. నిర్వాసిత కుటుంబాలు కోరుకు న్నట్టుగా పరిహారం చెల్సించాల్సి ఉంది. ఇలా ఒకటేంటి పోలవరం ప్రాజెక్టు పనులకే వేల కోట్లు అవసరం. ఈ దిశగానే ముళ్ళ కంచెలను దాటుకుని కేంద్రం సాయంతో చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి విజయాలను సాధిస్తుందో చూడాలి. దీనికి తోడు ఈ ఐదేళ్లు భ్రష్టు పట్టిన చింతలపూడి ఎత్తిపోత లను తక్షణం ఆరంభిం చాలంటే 2700 కోట్లకు పైబడి నిధులు అవసరం. మిగతా ఎత్తిపోతలను సమీక్షించి రైతువారీ ఆశలను నెరవేర్చాల్సి ఉంది.
కూటమి ప్రభుత్వానికి మరోసవాల్, జగనన్న కాలనీలు పూర్తి చేయడం, మూలన పడ్డ టిడ్కో ఇళ్లను లబ్ధిదారులు సొంతం చేయడం. తాము అధికారంలోకి వస్తే టిడ్కో ఇళ్లను సం పూర్తిగా లబ్ధిదారులకు అందించి తీరుతామని చంద్రబాబు ప్రకటించారు. దాదాపు 18 వేల కు పైగా గృహాలను నూజివీడు, ఏలూరు, జంగంగూడెం ప్రాంతాల్లో ప్రజలకు అందించా ల్సి ఉంది. ఇప్పటికే ఇంతకు ముందు వేల రూపాయలు డిపాజిట్లు చేసి పేదలను వం చించేలా జగన్‌ప్రభుత్వం అప్పట్లో టిడ్కో ఇళ్ళు ఇవ్వం. జగనన్న కాలనీలో స్థలం మాత్ర మే ఇస్తామని ఆశ చూపించి వందలాది మంది పేదలను దారి మళ్ళించారు. టిడ్కో ఇళ్ళు పంపిణీ వ్యవహారం పట్టణ ప్రాంతాల్లో తేలిగ్గా జరిగే వ్యవహారం కానేకాదు. ఆయా మునిసి పాలిటీల్లో టిడ్కో ఇళ్ళ నిమిత్తం దాదాపు ఏడేళ్ల క్రితం వేల రూపాయలు డిపాజిట్ చేసిన పేదల సొమ్ముకు గత ప్రభుత్వం బదులు ఇవ్వలేదు. జగనన్న కాలనీల్లో గాలికి వది లేసిన నిర్మాణాలు, ఇంకోవైపు పేదల నుంచి మహిళా గ్రూపుల ద్వారా ఒక్కో ఇంటికి రూ.30 వేలు డిపాజిట్‌గా స్వీకరించారు. కాని ఏ ఒక్కరికి ఇంటి నిర్మాణం చేయనే లేదు. ఇప్పుడు వారంతా కొత్త కూటమి ప్రభుత్వం పైనే ఆశలు పెంచుకున్నారు.
ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్నికల సందర్భంలో చంద్రబాబు సూపర్ సిక్స్‌ను ప్రకటించారు. మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం, ఏడాదికి మూడు సిలిం డర్లతో సహా అనేక పథకాలను అచ్చొచ్చేలా కూటమి ప్రభుత్వం అమలు చేసి తీరుతుం దని ప్రకటించారు. ప్రభుత్వ విధానం ప్రకటిం చగానే మంత్రివర్గం ఆమోదించిన వెనువెంట నే సూపర్‌సిక్స్ పథకాలకు జీవం రానుంది. ఇంకోవైపు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం రద్దు, ఆ తర్వాత చెత్తపన్ను తొలగింపు వంటి హామీలన్ని ఎప్పుడు అమలు కాబోతున్నా యంటూ అప్పుడే జనంలో ఉత్కంఠ. ఇంకో వైపు తమకు నిరుద్యోగ భృతి కల్పించే విషయంలోనూ ఉద్యోగ కల్పన చేసే విషయంలోనూ ప్రభుత్వం మాట నిలుపు కుంటుందా? లేదా? అన్నదే నిరుద్యోగుల్లో అదుర్దా . ఫీజు రీయింబర్స్‌మెంట్, విదేశీవిద్య, రోడ్ల మరమ్మతులు పాలనలో ప్రక్షాళన ఈ తరహా అన్నింటిపైనా సామాన్య ప్రజల్లోనూ కోటి ఆశలు. అందుకనే కొత్త ప్రభుత్వం ముందు పెనుసవాళ్ళే ఉన్నాయి. వీటన్నింటికి తోడు వైసీపీ హయాంలో ప్రజల మీద పెట్టిన అక్రమ కేసులు ఇంకో సవాల్.