Share News

జోరుగా బెట్టింగ్‌

ABN , Publish Date - May 22 , 2024 | 12:02 AM

ఎన్నికల ఫలితాలు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. అభ్యర్థుల జాబితాలు జూన్‌ 4వ తేదీన తేలి పోనున్నాయి. ఫలితాల కోసం అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు పందెం రాయుళ్లు జోరుగా బెట్టింగ్‌ కడుతున్నారు.

జోరుగా బెట్టింగ్‌

జోరుగా రాజకీయ బెట్టింగ్‌లు

పందేలు పలు రకాలు

ఉండిలో భూములు కాస్తున్న నాయకులు

ఆ నియోజకవర్గంపైనే రూ.35 కోట్ల బెట్టింగ్‌

తాడేపల్లిగూడెంలో ముందుకురాని పందెం రాయుళ్లు

భీమవరం, మే 21 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల ఫలితాలు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. అభ్యర్థుల జాబితాలు జూన్‌ 4వ తేదీన తేలి పోనున్నాయి. ఫలితాల కోసం అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు పందెం రాయుళ్లు జోరుగా బెట్టింగ్‌ కడుతున్నారు. జిల్లాలో ఉండి నియోజకవర్గంపై పెద్ద మొత్తంలో పందేలు సాగుతున్నాయి. కడప నుంచి కూడా ఇక్కడకు వచ్చి పందేలు కాస్తున్నారు. కూటమి నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా ఉండి నియోజకవర్గంలో బరిలోకి దిగిన రఘురామ కృష్ణరాజుపై అంతా పందేలకు కాలు దువ్వుతున్నారు. ఆ ఒక్క నియోజకవర్గంలో దాదాపు రూ.35 కోట్ల మేర బెట్టింగ్‌ కాశారు. రఘు రామకృష్ణరాజుకు ఉండి నియోజకవర్గంలో 15 వేల ఓట్ల మెజారిటీ వస్తుందని ఒక వర్గం, రాదని మరో వర్గం కాలు దువ్వు తున్నాయి. తాజాగా కలవపూడిలో ఆసక్తి కర పందెం సాగింది. భూములనే బెట్టింగ్‌లకు కాస్తున్నారు. రఘురామ విజయం సాధిస్తే ఎకరం భూమి ఇస్తారు. అదే ఓడిపోతే ఎదుటివారి నుంచి ఎకరన్నర భూమి తీసుకుంటారు. ఇలా పందాలలో భూముల ట్రెండింగ్‌ కూడా నడుస్తుంది. కౌంటింగ్‌ దగ్గర పడుతున్న కొద్దీ కూటమి వైపు పందాలు వెళుతున్నాయి. కూటమి నెగ్గుతుందంటూ బెట్టింగ్‌ రాయుళ్ళు మొగ్గు చూపుతున్నారు. తాజాగా రాష్ట్రంలో వైసీపీకి 75 సీట్లు రావంటూ పందెం రాయుళ్లు రంగంలోకి దిగారు. ఒకవేళ 75 సీట్లు వచ్చినట్లైయితే అధికమొత్తంలో సొమ్ములు చెల్లించాల్సి ఉంటుంది. వైసీపీపై పందేలు కాసిన వారు ఓడిపోతే లక్ష రూపాయలు ఇస్తారు. లేదంటే వారికి లక్షన్నర ముట్ట చెప్పాల్సి ఉంటుంది. ఇలా రాష్ట్రంలో స్థానాలపైనా కూటమి వైపే మొగ్గు కనిపిస్తుంది. జిల్లాలోనూ వైసీపీకి ఒక్క సీటు కూడా రాదంటూ బెట్టింగ్‌లు జరగుతున్నాయి.

తాడేపల్లిగూడెంలో సైలెంట్‌

తాడేపల్లిగూడెంలో పందేలపై ఎవరూ ముందుకు రావడం లేదు.. అంతా సెలెంట్‌ అయిపోయారు.ఈ నియోజకవర్గంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి పందేల విషయంలో చేదు అనుభవం ఎదురవుతోంది. వైసీపీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణ ఓడిపోతా రంటూ పందేలకు కాలు దువ్వుతున్నారు. గెలిస్తే ఒకటికి మూడు రెట్లు ఇస్తామంటూ పందెం రాయుళ్లు మీసం మెలేస్తున్నారు. అయినా సరే ఒక్కరు కూడా కొట్టు సత్యనారాయణపై బెట్టింగ్‌కు రావడం లేదు.

ఆచంటలో అంతంతే..!

ఆచంట: ఎన్నికలు వచ్చాయంటే ఆచంట నియోజకవర్గంలో పందెం రాయుళ్లు బెట్టింగ్‌లకు పరుగులు తీసేవారు. ఎన్నికల మరుసటి రోజు నుంచి లక్షల నుంచి కోట్ల రూపాయలు వరకు బెట్టింగ్‌లు జోరుగా జరుగుతూ ఉండేవి. కొన్ని ప్రాంతాల్లో బెట్టింగ్‌ల నిమిత్తం కౌంటర్‌లు కూడా ఏర్పాటు చేసేవారు. అయితే ఈసారి మాత్రం అటువంటి పరిస్థితి కనిపించడం లేదు. కూటమి అభ్యర్థులు గెలుస్తారంటూ బెట్టింగ్‌లు దిగుతున్నప్పటికీ ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో ఎక్కడ చూసినా స్వలంగానే బెట్టింగ్‌లు జరిగినట్లు సమాచారం. ఉభయ గోదావరి జిల్లాలో ఎవరికెన్ని సీట్లు వస్తాయి ? ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారు ? రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ?అనే దానిపైనే పందాలు కాస్తున్నారు.

Updated Date - May 22 , 2024 | 12:02 AM