ఆదివాసీలు ఓటు చైతన్యం
ABN , Publish Date - May 17 , 2024 | 12:48 AM
ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీల్లో ఓటుపై చైతన్యం పెరగడంతో ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాలకు ఆదివాసీలు పోటెత్తారు.
పోలింగ్ బూత్‌లకు పోటెత్తిన గిరిజనులు
ఉదయం నుంచే బారులు కొండరెడ్లు
కొండలు దిగొచ్చి ఓటేశారు..
బుట్టాయగూడెం, మే 16 : ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీల్లో ఓటుపై చైతన్యం పెరగడంతో ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాలకు ఆదివాసీలు పోటెత్తారు. అక్షరాస్యత అంతగాలేని మన్యం బిడ్డల్లో ఓటు చైతన్యం స్పష్టంగా కనిపించింది. అభివృద్ధికి ఆమడదూరంలో ఉండే గిరిజనులు ఈసారి ఓటుపై సంపూర్ణ అవగాహనను పెంచుకోవడమే కాకుండా కొండలు, గుట్టలు, వాగులు, వంకలు, దట్టమైన అటవీ ప్రాంతాలు దాటివచ్చి ఓటుహక్కును వినియోగించు కుని ఆదర్శంగా నిలిచారు. నియోజకవర్గంలో ఎస్టీల ఓట్లే అధికంగా ఉన్నాయి. ఎస్టీల్లో కోయ, కొండరెడ్డి, సుగాలి, ఇతర తెగలవారు ఉన్నారు. ఏజెన్సీలో గిరిజనేతరుల ఓట్లు గణనీయంగానే ఉన్నా పోలవరం నియోజకవర్గం ఎస్టీలకు కేటాయించారు. అధికారుల లెక్కల ప్రకారం పోలవరం ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గంలో 284 పోలింగ్ బూత్‌లు ఉండగా 2,53,981 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో ఈనెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 85.95 శాతంతో 2,18,297 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. వీరిలో పురుషులు 1,06,151 మంది, 1,12,142 మంది మహిళలు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. గిరిజన మహిళల్లో చైతన్యం పెరగడంతో మహిళా ఓటర్లు అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద అధికంగా కనిపించారు. పోలవరం నియోజకవర్గం ఏడు మండలాల్లో వ్యాపించి ఉండగా ఐదు మండలాలు పూర్తిగా ఏజెన్సీలోనే ఉన్నాయి. వీటిలో కొండరెడ్డి గ్రామాలు ఎక్కువగా అడవుల్లోనే ఉన్నా యి. వీరంతా ఓటు వేయాలంటే మైళ్ళ కొలది కాలినడకన అడవులు, కొండలు, గుట్టలు, వాగులు, వంకలు దాటి రావాలి. కొన్ని కొండరెడ్డి గ్రామాల ప్రజలు గోదావరి దాటి బోటుపైన వచ్చి ఓటు వేయాలి. అయినా పోలింగ్ కేంద్రాలకు వచ్చి కొండరెడ్లు తమకు నచ్చిన పార్టీకి ఓటు వేశారు. పశ్చిమ మన్యంలో అక్షరాస్యత అంతగా లేకపోయినా వారంతా ఓటుపై సంపూర్ణ అవగాహన పెంచుకోవడం ఆశ్చర్యం కలిగించకమానదు. ఇటీవల కాలంలో పిల్లలు విద్యావంతులు కావడంతో తల్లిదండ్రుల్లోను మార్పులు వచ్చాయి. ప్రతి విషయాన్ని తెలుసుకుంటున్నారు. గతంలో మధ్యవర్తులు, దళారులదే పెత్తనం. అటువంటివాటికి స్వస్తి పలికారు. ఎవరు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా లొంగ కుండా నిర్భయంగా ఓటుహక్కును వినియోగించుకు న్నారు. అధికారులు వివిధ రూపాల్లో ఓటుపై ఓటర్లలో అవగాహన కల్పించిన తీరు మంచి ఫలితాలను ఇచ్చింది. ఓటు కోసం చిన్నపిల్లలను సైతం చంకన వేసుకుని మహిళలు కేంద్రాలకు చేరుకుని ఓటేయడం గమనార్హం. అదే ఇతరులైతే కొండలు, వాగులు దాటి వేయడం అంత అవసరమా? అంటూ ఇంటివద్దనే కూర్చునేవారు. కొండరెడ్డి గిరిజనులు మాత్రం అలా చేయలేదు. ఓటే ముఖ్యమనుకున్నారు. కష్టాలను అధికమించి ఓటు వేశారు. కాకపోతే ఓటింగ్‌లో గిరిజన మహిళలు అధికంగా పాల్గొనడం ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్ అనేది తేలాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.