Share News

అహ.. మాకేంటి?

ABN , Publish Date - Jan 30 , 2024 | 12:11 AM

జిల్లాలో అక్రమ మద్యం, పేకాటలు, కోడిపందేలు కొంత మంది అవినీతి పోలీసులకు కాసులు కురిపిస్తున్నాయి. గతంలో పోలీసులు దాడి చేస్తే ఆ దాడిలో ఏమి లభిస్తే వాటిని కేసులో సీజ్‌ చేసి చూపించే వారు. ప్రస్తుతం జిల్లా పోలీస్‌ యంత్రాంగంలోని కొంతమంది తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నారు.

అహ.. మాకేంటి?

దాడుల సమయంలో పట్టుకునేది దోసెడు .. కేసుల్లో చూపించేది గుప్పెడు

ఇదీ ఏలూరు జిల్లాలో కొంత మంది పోలీసుల తీరు ..

కాసులు కురిపిస్తున్న పేకాట, అక్రమ మద్యం, కోడి పందేలు

ఏలూరు క్రైం, జనవరి 29 : జిల్లాలో అక్రమ మద్యం, పేకాటలు, కోడిపందేలు కొంత మంది అవినీతి పోలీసులకు కాసులు కురిపిస్తున్నాయి. గతంలో పోలీసులు దాడి చేస్తే ఆ దాడిలో ఏమి లభిస్తే వాటిని కేసులో సీజ్‌ చేసి చూపించే వారు. ప్రస్తుతం జిల్లా పోలీస్‌ యంత్రాంగంలోని కొంతమంది తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో కొంతమంది పోలీసు అధికారులు గుట్టుచప్పుడు కాకుండా పేకాటలకు అనుమతులు ఇచ్చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎస్‌ఈబీ దాడి చేసినప్పుడు తాము పోలీసులకు మామూళ్లు ఇచ్చామంటూ చెబుతుండడంతో గొంతులో వెలక్కాయపడ్డట్టు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇటీవల సంక్రాంతి సమయంలో వేలేరుపాడులో ఒక వీధిలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి అక్కడ లభించిన సొమ్మును మొత్తం చూపించకుండా తక్కువే చూపించడంతో ఆ కేసులో ఉన్న వారు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చి రాత పూర్వకంగా ఫిర్యాదు చేసి వెళ్లారు.

జిల్లాలో కొన్ని పోలీస్‌ స్టేషన్ల పరిధిలో యఽథేచ్ఛగా పేకాటలు జరుగుతూనే ఉన్నాయి. అక్రమ మద్యం విక్రయాలు సాగుతున్నాయి. కొన్ని పోలీస్‌ స్టేషన్లలో రైటర్లే ఈ వ్యవహారాలు చూస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కొన్నేళ్లుగా అక్కడే పాతుకుపోయిన రైటర్లు వేరే ప్రాంతాలకు బదిలీ అయినా మళ్లీ డిప్యుటేషన్‌పై అక్కడకే వచ్చి రైటర్లుగా అవతారం ఎత్తివేస్తున్నారు. వారే చక్రాలు తిప్పేస్తున్నారు. ముఖ్యంగా అక్రమ మద్యం, మద్యం విక్రయాలు, బెల్టు షాపుల నిర్వాహకులు పట్టుబడిన సమయంలో వేలాది రూపాయలు స్టేషన్‌లో ఈ రైటర్లు, ఎస్‌హెచ్‌వోలు గుంజేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

ఏడేళ్లలోపు జైలు శిక్ష పడే కేసుల్లో నిందితులకు స్టేషన్‌లో 41(ఏ) నోటీసుతో పాటు బెయిల్‌ ఇచ్చి పంపివేయాలని సుప్రీంకోర్టు నిబంధనలు ఉన్నాయి. అయితే ఈ నిబంధనను అడ్డు పెట్టుకుని కొంతమంది పోలీసు అధికారులు, రైటర్లు కాసులు దండుకుంటున్నారు. ఒక కేసులో పట్టుబడిన వ్యక్తికి 24 గంటలల్లోపు అతన్ని అరెస్టు చూపించి అతనికి స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వాలి. ఇటీవల ఎక్సైజ్‌ కేసులో నోటీసు ఇవ్వకుండా తాత్సారం చేస్తూ 12 రోజుల పాటు స్టేషన్‌కు తిప్పిస్తూ లంచంకోసం డిమాండ్‌ చేయడంతో చివరకు బాధితుడు విసిగిపోయి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈక్రమం లో ఏలూరు రూరల్‌ రైటర్‌ డీవీ రమణ రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు చిక్కాడు. అతనితో పాటు 1000 రూపా యలు ఫోన్‌పే చేయించుకున్న ఏఎస్‌ఐ కె.వెంకన్నబాబు ఏసీబీ అధికారులకు చిక్కారు. ఏలూరు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌పై ఇప్పటికే పలుమార్లు ఉన్నతాధికారులకు అవినీతి ఆరోపణలతో ఫిర్యాదులు వెళ్లాయి.

జిల్లాలో చాలా పోలీస్‌ స్టేషన్లలో పట్టుబడుతున్న పేకాట రాయుళ్ల నుంచి అధిక మొత్తంలో సొమ్ము పట్టుకుంటున్నప్పటికీ తక్కువ సొమ్ము చూపిస్తున్నారు. ఎక్కువ సొమ్మును కేసులో చూపిస్తే శిక్ష ఎక్కువ పడుతుందని పోలీసులు ఈ విధంగా బెదిరిస్తున్నారని కొంతమంది చెబుతున్నారు. మద్యం కలిగి ఉన్న వ్యక్తులను అరెస్టు చేసిన కేసుల్లో అరెస్టు అయిన సమయంలో సొమ్ములను కేసులో చూపించకుండా తమ చేతివాటాన్ని కొంతమంది ఎస్‌హెచ్‌వోలు, స్టేషన్‌ రైటర్లు ప్రదర్శిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణం ప్రక్షాళన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Jan 30 , 2024 | 12:11 AM