Share News

టెన్షన్‌..టెన్షన్‌

ABN , Publish Date - May 23 , 2024 | 12:31 AM

ఏలూరు ఫైర్‌స్టేషన్‌ వద్ద బుధవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కొత్త బస్టాండ్‌ వైపు నుంచి ఒక వంద మంది చేతిలో కర్రలు, రాళ్ళు, వాటర్‌ బాటిల్స్‌, టైర్లు, ఇతర వస్తువులతో కేకలు వేస్తూ పోలీసులకు వ్యతిరేకంగా అరుచుకుంటూ వస్తున్నారు.

టెన్షన్‌..టెన్షన్‌
పోలీసుల మాబ్‌ డ్రిల్‌ దృశ్యం

ఏలూరు ఫైర్‌స్టేషన్‌ వద్ద ఆందోళన కారుల ర్యాలీ

లాఠీఛార్జి, టియర్‌ గ్యాస్‌ ప్రయోగం ఆపై ఫైరింగ్‌

పలువురికి గాయాలు.. ఆస్పత్రికి తరలింపు

ఏలూరు రోడ్లపై పోలీసుల మాబ్‌ డ్రిల్‌

ఏలూరు క్రైం, మే 22 : ఏలూరు ఫైర్‌స్టేషన్‌ వద్ద బుధవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కొత్త బస్టాండ్‌ వైపు నుంచి ఒక వంద మంది చేతిలో కర్రలు, రాళ్ళు, వాటర్‌ బాటిల్స్‌, టైర్లు, ఇతర వస్తువులతో కేకలు వేస్తూ పోలీసులకు వ్యతిరేకంగా అరుచుకుంటూ వస్తున్నారు. మరోవైపు ఆస్పత్రి రోడ్డువైపు నుంచి అతి వేగంగా పోలీసు వాహనాలు చేరుకున్నాయి. ఫైర్‌స్టేషన్‌ ఇరువైపులా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. పోలీసు భద్రతా దళాలు రంగంలోకి దిగారు. ఇంకోవైపు క్షణంలోనే జిల్లా ఉన్నతాధికారుల వాహనాలు అక్కడకు చేరాయి. ఆందోళన కారులను మైక్‌ల ద్వారా పోలీసులు హెచ్చరించినా లెక్కచేయకుండా రాళ్ళు విసర డంతో లాఠీఛార్జీ మొదలు పెట్టారు. అల్లరి మూకలు తిరగబడి టైర్లను కాల్చి వారిపైకి విసిరేశారు. వాటర్‌ బాటిళ్లు, రాళ్ళు, ఇతర వస్తువులతో అల్లకల్లోలం చేశారు. అక్కడే ఉన్న ఆర్ముడు రిజర్వు అధికారులు, సిబ్బంది ఉన్నతాధికారుల ఆదేశాల కోసం ఎదురు చూశారు. ఉన్నతాధికారులు, మేజిస్ట్రేట్‌ ఫైరింగ్‌కు అనుమతి ఇచ్చారు. తొలుత టియర్‌ గ్యాస్‌ను పేల్చారు. టియర్‌ గ్యాస్‌ బాతిరిగి వాటినే అల్లరి మూకలు పట్టుకుని తిరిగి పోలీసుల పైకి విసిరారు. ఇక లాభం లేదనుకుని ఒక్కసారి రబ్బర్‌ బులెట్ల వర్షం కురిపించారు. దీంతో అవి తగిలిన వారంతా కుప్పకూలి పడిపోయారు. క్షణాల్లోనే వారిని అంబులెన్సుల్లో ఆస్పత్రికి తరలిం చారు. సుమారు గంటసేపు అక్కడ ఏం జరుగుతుందో సాధారణ జనానికి అర్థం కాలేదు. రోడ్లపై వెళ్తున్న వాళ్లు, దుకాణాల్లో ఉన్నవారు అంతా టెన్షన్‌తో చూస్తుండిపోయారు. చివరకు ఇదంతా అల్లరి మూకలకు హెచ్చరికగా పోలీసులు చేపట్టిన మాబ్‌ డ్రిల్‌ అని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు : ఎస్పీ

‘జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు ఎంతో ప్రశాంతంగా ముగిశాయి. కౌంటింగ్‌ ఈనెల 4వ తేదీన జరుగనుంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శాంతి భద్రతల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాం. కౌంటింగ్‌ రోజు ఓడిపోయిన వారు ఉద్రిక్తతకులోనై అల్లర్లకు పాల్పడితే సహించేది లేదు. ఎవరైనా అల్లర్లకు పాల్పడితే లాఠీ ఛార్జీచేయడం, టియర్‌ గ్యాస్‌ ప్రయోగించడం, ఆతర్వాత ఫైరింగ్‌ చేయడం వంటి వాటికి పోలీస్‌శాఖ సిద్దంగా ఉంది. అవసరమైన వాటికి ముందే అనుమతులు పొందాం. క్రిమినల్‌ కేసు నమోదైతే వారు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలకు పనికిరాదు. విదేశాలకు వెళ్ళడానికి పాస్‌పోర్టు లభించదు. ముఖ్యంగా తల్లి దండ్రులు ఈనెల 4వ తేదీన తమ పిల్లలను ఎక్కడికి వెళ్తున్నారు. ఏమి చేస్తున్నారనే ఆరా తీయాలి. జిల్లాలో సీఆర్పీసీ సెక్షన్‌ అమలులో ఉంది. ఇద్దరు ముగ్గురు కలిసి తిరగకూడదు. ఎవరైనా అల్లర్లకు పాల్పడినా అల్లర్లకు ప్రేరేపించినా వారిపై క్రిమినల్‌ కేసులతో పాటు కఠిన చర్యలు తీసుకుంటాం’.. అంటూ జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి మాబ్‌ ఆపరేషన్‌ అనంతరం మీడియాకు వెల్లడించారు. ఎస్పీతో పాటు అదనపు ఎస్సీ జి స్వరూపరాణి, డీఎస్పీ ఈ శ్రీనివాసులు, ఏఆర్‌ఆర్‌ఐ పవన్‌కుమార్‌, సీఐలు ఎన్‌.రాజశేఖర్‌, ఎం. ప్రభాకర్‌, కె.శ్రీనివాసరావు, ఆర్‌ఎస్‌ఐ నరేంద్ర పలువురు పాల్గొన్నారు.

Updated Date - May 23 , 2024 | 12:31 AM