Share News

ఇంటింటా జల్లెడ

ABN , Publish Date - Jun 02 , 2024 | 12:33 AM

ఉమ్మడి పశ్చిమ జిల్లాలో గ్రామ గ్రామాన వాహనాల తనిఖీలను పోలీసులు ముమ్మరం చేశారు. మరో రెండు రోజుల్లో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ ఉండటం, ఇటీవల జిల్లాలో దొంగతనాలు పెరగడంతో పోలీసులు తనిఖీలను అధికం చేశారు.

ఇంటింటా జల్లెడ
కైకలూరులో వాహనాలు తనిఖీ చేస్తున్న రూరల్‌ సీఐ కృష్ణకుమార్‌, సిబ్బంది

ఉమ్మడి పశ్చిమ జిల్లాలో తనిఖీలు ముమ్మరం

కౌంటింగ్‌ సందర్భంగా కార్డన్‌ సెర్చ్‌లు

రికార్డులు లేని ద్విచక్రవాహనాలు స్వాధీనం

లబోదిబోమంటున్న వాహనదారులు

మామూళ్ల మత్తులో సిబ్బంది !

పొలాల్లో దాచుకుంటున్న వాహనాలు

పాలకొల్లు : ఉమ్మడి పశ్చిమ జిల్లాలో గ్రామ గ్రామాన వాహనాల తనిఖీలను పోలీసులు ముమ్మరం చేశారు. మరో రెండు రోజుల్లో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ ఉండటం, ఇటీవల జిల్లాలో దొంగతనాలు పెరగడంతో పోలీసులు తనిఖీలను అధికం చేశారు. ముఖ్యంగా గ్రామాల్లో రహదారులపై వాహనాలను ఆపి తనిఖీలు చేయడమే కాకుండా ఇంటింటా జల్లెడ పడుతున్నారు.

ఇటీవల కాలంలో ఉమ్మడి పశ్చిమ జిల్లాలోని పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా చిల్లర దొంగ తనాలు పెరిగిపోయాయి. గత రెండు నెలల వ్యవధిలోనే ఉమ్మడి పశ్చిమ జిల్లావ్యాప్తంగా పదుల సంఖ్యలో మోటారు సైకిళ్ళు, ఇళ్ల వద్ద నీటి మోటార్లను ఎత్తుకుపోయారు. రైతులు మకాంలో పెంచుకునే కోడి పెట్టలు, పుంజులను ఎత్తుకుపోతున్నారు. సాధారణంగా ప్రతీ ఏటా వేసవిలో చిల్లర దొంగతనాలు పెరుగుతాయి. ఈ ఏడాది చిల్లల దొంగలు మరింతగా రెచ్చిపోయారు. ఎన్నికలు కూడా రావడంతో ఆవారా జనం సంఖ్య మరింత పెరిగిపోయి. మద్యం వంటి వ్యసనాలకు సొమ్ములు లేక దొంగతనాలకు పాల్పడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పెద్దగా అల్లర్లు లేనప్పటికీ, పల్నాడు ఇంకా పలు ప్రాంతాల్లో రాజకీయపార్టీ శ్రేణులు అల్లర్లకు పాల్పడడంతో పోలీసులు ముందుస్తు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాలో అనుమానం ఉన్నప్రతీ ప్రాంతంలోనూ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఓ ఇంటిలో ద్విచక్రవాహనం ఉంటే సంబంధిత వాహనాల రికార్డులను పరిశీలిస్తున్నారు. సీ–బుక్‌, నంబర్‌ ప్లేట్లు లేకుంటే వాహనాలను పోలీస్‌ స్టేషన్లకు తరలిస్తున్నారు. పోలీసులు బృందాలుగా ఏర్పడి తమ కూడా ఒక ట్రాన్స్‌పోర్టు వాహనాన్ని ఉంచుకుంటున్నారు. స్వాధీనం చేసుకున్న ద్విచక్ర వాహనాలను పోలీసు స్టేషన్లకు తరలిస్తున్నారు. అనంతరం సంబంధిత వాహనానికి యజమాని రికార్డులు చూపిస్తే వాహనాన్ని తిరిగి ఇస్తున్నారు. పెట్రో బాంబుల్లాంటివి తయారు చేయకుండా ఇప్పటికే పెట్రోలు బంకుల్లో పెట్రోలు, డీజిల్‌ చిల్లర విక్రయాలు నిషేధించారు. గుర్తుతెలియని ద్విచక్రవాహనాలను ఉపయోగించుకుని అసాంఘిక కార్యక్రమాలు, అల్లర్లకు పాల్పడే అవకాశాలు ఉండడంతో ముందస్తుగా వాహనాల తనిఖీలు చేపట్టారు.

ఆందోళనలో వాహనదారులు

సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు వినియోగించే వారు వాహన రికార్డులపై పెద్దగా దృష్టి సారించరు. ఏళ్ళ తరబడి బైక్‌కు ఇన్సూరెన్సు లేకున్నా రెన్యువల్‌ చేయించరు. అధికశాతం వాహనదారులకు డ్రైవింగ్‌ లైసెన్సులు ఉండవు, ఈ పరిస్థితుల్లో పోలీసులు ఇంటింటికీ తిరిగి వాహనాలపై ఆరా తీస్తుండడంతో ద్విచక్రవాహనదారులు ఆందోళన చెందుతున్నారు. తాము ఫలానా వ్యక్తి వద్ద వాహనం కొనుగోలుచేశామని, సీ–బుక్‌ ఇంకా తీసుకోలేదని కొంత మంది చెప్పినప్పటికీ ఆ వాహనానికి రికార్డులు లేకపోవడంతో పోలీసులు వాహనాలను స్లేషన్లకు తరలిస్తున్నారు.

పొలాల్లో దాచుకుంటున్న బైక్‌లు..

ఉమ్మడి పశ్చిమ జిల్లాలో గత వారం రోజులుగా తనిఖీలను ముమ్మరం చేయడంతో వాహనదారులు కొంతమంది తమ బైక్‌లను కూడా పోలీసులు తీసుకు వెళతారనే భయంతో పొలాల్లో దాచుకుంటున్నారు. తగినంత అవగాహన లేకపోవడం పోలీసులు ఎంచేస్తారోనన్న భయాందోళనలతో పెద్దగా చదువుకోని వాహన దారులు ఆందోళన చెందుతున్నారు.

సందిట్లో సడేమియా

తనిఖీల పేరుతో జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో కిందిస్థాయి సిబ్బంది మామూళ్ళు వసూళ్ళు చేస్తున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. వాహనదారుడు అమాయకంగా కనిపిస్తే ఏదో ఒక కారణం చూపించి సొమ్ములు లాగుతున్నారని విమర్శలు వినిపిస్తున్నారు.

నాలుగో తేదీ వరకు తనిఖీలే

ఎన్నికల ఫలితాల కౌంటింగ్‌ ప్రక్రియ ఈనెల 4వ తేదీన ఉండటంతో మరో రెండు రోజులు తనిఖీలు ఇదేవిధంగా ఉంటాయని పోలీస్‌ అధికారులు చెబుతున్నారు. తనిఖీలతో పౌరులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. రికార్డులు సరిగా చూపించలేని సందర్భంలో ఆయా వాహనాలను పోలీసు స్టేసన్‌కు తరలించినప్పటికీ రికార్డులు చూపితే వెంటనే వాహనాన్ని ఇస్తున్నామని చెబుతున్నారు.

డ్రైవింగ్‌ లైసెన్సులపై శ్రద్ధపెట్టాలి

పోలీసులు ఇంటింటికి తిరిగి ద్విచక్రవాహనాలకు రికార్డులు ఉన్నది లేనిది తనిఖీలు చేస్తున్నట్టుగానే సంబంధిత వాహనదారుకు డ్రైవింగ్‌ లైసెన్సు ఉందో లేదోనని పరిశీలించాలని పలువురు పరిశీలకులు సూచిస్తున్నారు. వాహన దారులు అందరికీ డ్రైవింగ్‌పై (లైసెన్సు) అవగాహన కల్పించి లైసెన్సులు ఇస్తే రహదారులపై ప్రమాదాలు తగ్గుతాయని, పోలీసులు రోడ్డు ట్రాన్స్‌పోర్టు అధికారులు దృష్టి పెట్టాలని పలువరు పరిశీలకులు సూచిస్తున్నారు.

అల్లర్లకు పాల్పడితే జైలుకే : ఎస్పీ

ఏలూరు క్రైం, జూన్‌ 1 : ఎగ్జిట్‌ పోల్స్‌ పేరుతో ప్రజలు వివాదాలు, అల్లర్లకు పాల్పడితే జైలుకే అని ఏలూరు జిల్లా ఎస్పీ డి.మేరీ ప్రశాంతి హెచ్చరించారు. సార్వత్రిక ఎన్నికలు ఎగ్జిట్‌ పోల్స్‌, కౌంటింగ్‌ దృష్ట్యా గ్రామాల్లో వివాదాలు అల్లరి లేకుండా శాంతియుతంగా ఉండాలని సూచించారు. ప్రతి రోజు జిల్లాలో పలు గ్రామాల్లో కార్డన్‌ సెర్చ్‌ నిర్వహిస్తూ గ్రామాల్లో శాంతి భద్రతల దృష్ట్యా ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగింద న్నారు. ఎవరైనా సమావేశాలు అనుమతి లేకుండా పెడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కౌంటింగ్‌ 4న నిర్వహించనున్న దృష్ట్యా పోలీస్‌ యాక్ట్‌ 30, సీఆర్పీసీ 144 సెక్షన్‌ అమలులో ఉన్నాయని అన్నారు. కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ రూల్స్‌, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అనుసరించి నడుచు కోవాలని సూచించారు. ఇతరులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదని, గొడవలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అల్లర్లకు పాల్పడితే వారి సమాచారం 122కు గాని సంబంధిత పోలీస్‌ స్టేషన్‌కు గాని తెలియజేయాలన్నారు.]

Updated Date - Jun 02 , 2024 | 12:34 AM