Share News

ఎదురుచూపులు !

ABN , Publish Date - Apr 06 , 2024 | 12:55 AM

పోలవరం ప్రాజెక్ట్‌ నిర్వాసితు లను సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. నిర్వాసితులు వ్యక్తిగత పునరావాస పరిహారం, ఇళ్ల పరిహారం కోసం ఎదు రుచూస్తున్నారు.

ఎదురుచూపులు !
గోదావరి వరదలకు ఇళ్లు ఖాళీ చేస్తున్న నిర్వాసితులు(ఫైల్‌)

నెరవేరని సీఎం జగన్‌ హామీలు

పరిహారం అందక.. నిలువ నీడ లేక పాట్లు

పోలవరం నిర్వాసితుల ఆవేదన

కుక్కునూరు, ఏప్రిల్‌ 5 : పోలవరం ప్రాజెక్ట్‌ నిర్వాసితు లను సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. నిర్వాసితులు వ్యక్తిగత పునరావాస పరిహారం, ఇళ్ల పరిహారం కోసం ఎదు రుచూస్తున్నారు. గత ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చాకా మీ సమస్యలు పరిష్కరిస్తానంటూ జగన్‌ ఇచ్చిన హా మీలు ఐదేళ్లుగా పరిష్కరానికి నోచుకోలేదు. 41.15 కాంటూర్‌ లెవల్‌లో కుక్కునూరు మండలంలో ఎనిమిది గ్రామాలు ముంపునకు గురవుతాయని ప్రభుత్వం గుర్తించింది. భువనగిరి, గంపెన పల్లి, గొమ్ముగూడెం నిర్వాసితులకు పునరావాస వ్యక్తిగత పరిహారం చెల్లించారు. చీరవల్లిలో 400కి పైగా నిర్వాసితులు ఉండగా 200 మందికి మాత్రమే చెల్లించారు. కుక్కునూరు ‘ఏ’ బ్లాక్‌, కివ్వాక, దామరచర్ల, రామచంద్రపురం నిర్వాసితులకు పరిహారం అందలేదు. ఏళ్లు గడుస్తున్నా పరిహారం నేటికీ అందడం లేదు. ప్రతి నిర్వాసిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం చెల్లిస్తామని సీఎం జగన్‌ హామీ ఇచ్చారే కానీ అమలు చేయలేదు. ఇప్పటి వరకు గిరిజనేతర నిర్వాసితులకు రూ.6.36 లక్షలు, గిరిజనులకి, ఎస్సీలకి రూ.6.86 లక్షలు చొప్పున మాత్రమే ఖాతాలో జమ చేశారు. ఏటా గోదావరి వర దలకు గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. కుక్కునూరులోని ‘ఏ’ బ్లాక్‌ తో పాటు 41.15 కాంటూర్‌లో లేని ఎల్లప్ప గూడెం, బెస్తగూడెం, కౌడిన్య ముక్తి, చెరువు కొమ్ము గూడెం, ఆంబోతులగూడెం తదితర గ్రామాల నిర్వాసితులు ముంపు నకు గురై సర్వం కోల్పోతున్నారు. కుక్కునూరు ‘ఏ’ బ్లాక్‌లో 750 కుటుంబాలు ఉండగా దాదాపు 100కి పైగా నిర్వాసితుల కుటుంబాల ఇళ్లు కూలిపోయాయి. వారంతా నిరుపేదలు కావ డంతో మళ్లీ తిరిగి ఇళ్ళు నిర్మించుకునే ఆర్థిక స్థోమత లేక కివ్వాకలో నిర్మిస్తున్న పునరావాస కాలనీలో తలదాచుకుని జీవనం సాగిస్తున్నారు. కొత్తూరు గిరిజన నిర్వాసితుల ఇళ్లు శిథిలావస్థకు చేరడంతో వారికోసం మర్రిపాడులో నిర్మించిన పునరావాస కాలనీలో ఇళ్లు కేటాయిం చాలని 60 కుటుంబాల గిరిజనులు కోరుతున్నారు. ఇటీవల సీపీఎం ఆధ్వర్యంలో ఐటీడీఏ పీవో సూర్యతేజని కలిసి తమ గోడు వినిపించారు. కుక్కునూరు–భద్రాచలం ఆర్‌అండ్‌బీ రహదారి కనీసం మరమ్మతులకు నోచుకోకపోవడంతో ఈ రోడ్డులో ప్రయాణం నరకప్రాయంగా మారింది.

హామీలకే పరిమితం

గత ఎన్నికల సమయంలో పోలవరం నియోజకవర్గంలో జగన్‌ ప్రతిపక్ష హోదాలో పర్యటించిన ప్పుడు పలు హామీలు ఇచ్చారు. గతంలో తన తండ్రి వైఎస్‌ హయాంలో ఎకరానికి రూ.1.15 లక్షలు పరిహారంగా ఇచ్చారని, నాడు భూములు ఇచ్చిన రైతాంగానికి అధికారంలోకి రాగానే అదనంగా ఎకరానికి రూ.3.50 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారు. రెండేళ్ల క్రితం ఎన్ని ఎకరాలకు అదనపు పరిహారం ఇవ్వాలో సర్వే జరిపినా ఇంతవరకు పరిహారం అందలేదు. కేంద్రంతో సంబంధం లేకుండా ప్రతి నిర్వాసితుడికి పునరావాస వ్యక్తిగత పరిహారం రూ.10 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారు. 41.15 కాంటూర్‌ లెవల్‌లో ఉన్న గ్రామాల్లో నిర్వాసితులకు వ్యక్తిగత పరిహారం, కోల్పోతున్న ఇంటికి పరిహారం ఇచ్చి, పునరావాస కాలనీకి తరలిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు కేంద్రం నిధులు ఇస్తేనే పరిహారం చెల్లిస్తామని అంతా దేవుని దయ అంటూ సీఎం జగన్‌ చెబుతున్నారు. దీంతో నిర్వాసితుల ఆశలు ఆడియాశలైయ్యాయి.

Updated Date - Apr 06 , 2024 | 12:55 AM