Share News

ఎమ్మెల్యే బాలరాజు సతీమణికి ఛాన్స్‌

ABN , Publish Date - Jan 03 , 2024 | 12:25 AM

అందరూ ఊహించినట్లుగానే వైసీపీలో మార్పులు చేర్పులు ఆరంభం అయ్యాయి. దీనికితోడు ఒకవేళ తనకు వద్దనుకంటే భార్యకో లేదా కుమారుడికి ఎమ్మెల్యే టికెట్‌ చాన్స్‌ ఇవ్వాలని నాయకత్వానికి చేసిన అభ్యర్థనలకు సమ్మతి లభిస్తోంది.

ఎమ్మెల్యే బాలరాజు సతీమణికి ఛాన్స్‌

పోలవరం వైసీపీ సమన్వయకర్తగా రాజ్యలక్ష్మిని ప్రకటించిన అధిష్టానం

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

అందరూ ఊహించినట్లుగానే వైసీపీలో మార్పులు చేర్పులు ఆరంభం అయ్యాయి. దీనికితోడు ఒకవేళ తనకు వద్దనుకంటే భార్యకో లేదా కుమారుడికి ఎమ్మెల్యే టికెట్‌ చాన్స్‌ ఇవ్వాలని నాయకత్వానికి చేసిన అభ్యర్థనలకు సమ్మతి లభిస్తోంది. ఈ కోణంలోనే పోలవరం ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి సుదీర్ఘకాలం సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా కొనసాగిన తెల్లం బాలరాజును తప్పించి ఆయన సతీమణి తెల్లం రాజ్యలక్ష్మిని పోలవరం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా మంగళవారం రాత్రి నియమించింది. మొదటి నుంచి బాలరాజును తప్పిస్తారనే వార్త నిజమైంది. ప్రత్యేకించి సర్వేలు, నిఘా వర్గాల సమాచార ప్రకారం మార్పులు చేర్పులకు వైసీపీ సుదీర్ఘ కసరత్తు చేసింది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే బాలరాజుకు తాడేపల్లి ప్యాలెస్‌కు పిలిపించుకుని నీకు టికెట్‌ లేదని ఖరాఖండిగా చానాళ్ల క్రితం తేల్చేశారు. దీనికి బదులుగా ఎస్టీ రిజర్వుడు కోటాలో రాజ్యసభకు అవకాశం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. బాలరాజు మాత్రం తనకు ఇవ్వకపోయినా పర్వాలేదు. తన సతీమణి, ఉన్నత విద్యావంతురాలు రాజ్యలక్ష్మికి ఒక్క చాన్స్‌ ఇవ్వాలని సీఎం జగన్‌ను ఎదుట ప్రాధేయపడ్డారు. ఈ నేపథ్యంలో ఒకవైపు రాజ్యలక్ష్మి, మరోవైపు బుట్టాయగూడెం స్థానిక మహిళా నేత రామ తులసి మధ్య ప్రజాభిప్రాయం ఎలా ఉందనే దానిపై కొద్ది రోజులుగా నియోజకవర్గం అంతా అభిప్రాయసేకరణ చేశారు. కడకు రాజ్యలక్ష్మి అభ్యర్థిత్వం వైపు నాయకత్వం మొగ్గు చూపింది. ప్రత్యేకించి పోలవరం నియోజకవర్గంలో ఒక ఎస్సీ మహిళకు అవకాశం ఇచ్చినట్లు ఉంటుందని సిట్టింగ్‌ ఎమ్మెల్యే విన్నపాన్ని మన్నించినట్లవుతుందని ఈ నిర్ణయం తీసుకున్నారు. పోలవరంలో ఎట్టకేలకు సస్పెన్స్‌కు తెరదించారు. ప్రస్తుత సమన్వయకర్త వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి అవుతారు. తెల్లం రాజ్యలక్ష్మి బుట్టాయగూడెం మండలం దొరమామాడి జడ్పీ హైస్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నారు.

విజయరాజుకు లైన్‌ క్లియర్‌ !

ఏలూరు, జనవరి 2(ఆంధ్రజ్యోతి): చింతలపూడి వైసీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే ఎలీజాను తప్పించి, ఆయన స్థానంలో ఏలూరు మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ కంభం విజయరాజును బరిలో నిలపాలని దాదాపు ఖరారైనట్లు పార్టీ వర్గాల సమాచారం. మంగళవారం విడుదలైన సమన్వయకర్తల జాబితాలో ఆయన పేరును లేకపోయిన ప్పటికీ 2–3 రోజుల్లో రానున్న మూడో జాబితాలో స్పష్టత రానుంది. మండలి చైర్మన్‌ కొయ్యే మోషన్‌రాజు వియ్యంకుడైన ఆయన 20 రోజుల క్రితమే తన ఉద్యోగానికి రాజీనామా చేసి, పార్టీ పనుల్లో నిమగ్నమవుతున్నారు.

Updated Date - Jan 03 , 2024 | 12:25 AM