కొబ్బరికి ఆకు తేలు తెగులు
ABN , Publish Date - Sep 03 , 2024 | 12:55 AM
ఇటీవల శ్రావణ మాసం సందర్భంగా కొబ్బరి ధరలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ దిగుబడి తగ్గడం, మరో వైపు కొబ్బరి చెట్లకు తెగుళ్లతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
డెల్టాలో రొయ్యల చెరువుల ప్రాంతాల్లో అధికం
అధిక తేమ వల్లనే అంటున్న ఉద్యానవన శాఖాధికారులు
ఇటీవల శ్రావణ మాసం సందర్భంగా కొబ్బరి ధరలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ దిగుబడి తగ్గడం, మరో వైపు కొబ్బరి చెట్లకు తెగుళ్లతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని కాపవరం గ్రామ ప్రాంతంలో గల రొయ్యల చెరువుల గట్లపై సుమారు 400 కొబ్బరి చెట్లకు ఆకుతేలు తెగులు సోకింది. ఈతెగులు సోకిన కొబ్బరి చెట్లకు ఉన్న పచ్చటి ఆకులు అన్ని అగ్నిప్రమాదాల్లో దగ్ధమైనట్లు పూర్తిగా ఆకులను పురుగులు తినివేయగా, కొబ్బరి ఆకుల్లోని ఈనెలు కాండం మాత్రమే కనిపిస్తున్నాయి.
పాలకొల్లు, సెప్టెంబరు 2 : రొయ్యల సాగు చేస్తున్న ప్రాంతాలలో కొబ్బరి చెట్లకు ఈతెగులు అధికంగా కనిపిస్తోంది. ఆప్రాంతాలలో తేమ అధికంగా ఉండటం కారణంగా ఆకు తేలు తెగులును వ్యాప్తి చేసే కీటకాలు త్వరితంగా అభివృద్ధి చెంది కొబ్బరి చెట్ల ఆకులపైదాడి చేస్తున్నాయి. కొబ్బరి ఆకులలో కేవలం కొబ్బరి ఈనెలు మాత్రమే కనిపిస్తుండగా, పచ్చటి ఆకుల్లో ఉన్న రసాన్ని కీటకాలుపిల్చి వేయడంతో అగ్నికి ఆహుతి అయినట్టుగా ఆకులు కనిపిస్తున్నాయి. ఆకు తేలు తెగులు సోకిన చెట్లుకు దిగుబడి గణనీయంగా తగ్గిపోతున్నది. ఆయా చెట్లు పూర్వ స్థితికి రావాలంటే సుమారు ఏడాది కాలం పట్టడంతో పాటు కొబ్బరి దిగుబడి పెరగడానికి అధిక సమయం పడుతుందని ఉద్యానవన శాఖాధికారులు చెబుతున్నారు
పశ్చిమడెల్టాలో ఇప్పటికే కొబ్బరి దిగుబడి మూడింట ఒక వంతు తగ్గింది. ఇప్పుడు శ్రావణ మాసం, వినాయకచవితి ఉత్సవాలు నేపథ్యంలో కొబ్బరి వినియోగం పెరగనుంది. అయితే రైతులకు ఆశించిన స్థాయిలో కొబ్బరి దిగుబడి రావడంలేదు. దిగుబడి తగ్గినప్పటికీ కొబ్బరి దింపు ఖర్చులు, కూలీల ఖర్చులు, ట్రాన్స్‌పోర్టు ఖర్చులు కలిపి తడిసి మోపెడు కావడంతో వచ్చిన ఆదాయంలో 50శాతంపైగా ఖర్చులకే పోతున్నాయని, రైతులు చెబుతున్నారు
ఆకు తేలు నివారణ
కొబ్బరి చెట్లకు పట్టిన ఆకు తేలు తెగులు నివారణకు క్రిమి సంహారక మందు మోనోక్రోటోఫాస్ వినియోగించాలని ఉద్యాన వన శాఖాధికారులు సూచిస్తున్నారు. 10ఎంఎల్ మోనోక్రోటోఫాస్‌ను 10ఎంఎల్ నీటిలో కలిసి మిశ్రమాన్ని పాలధిన్ కవర్‌లో తీసుకుని కొబ్బరి చెట్టు వేరుకు కట్టాలని అధికారులు సూచిస్తున్నారు. ఈవిధంగా చేయడంద్వారా ఆకు తేలు తెగులు నివారణ అవుతుందని, చెట్లు త్వరితంగా కోలుకుంటాయని అధికారులు తెలిపారు. అయితే క్రిమిసంహారక మందు కొబ్బరి వేళ్ళకు కట్టిన చెట్టు నుంచి 45 రోజుల పాటు కొబ్బరి కాయలు దింపుతీయకూడదని సూచించారు. అనంతరం కొబ్బరిని వినియోగించుకోవచ్చు. సంబదిత అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి ఉద్యాన రైతులకు తగిన సూచనలు ఇవ్వాలని, ప్రభుత్వం నేరుగా క్రిమి సంహారక మందులు, ఎరువులు కొబ్బరి రైతులకు ఉచితంగా ఇవ్వాలని కోరుతున్నారు.