Share News

పెన్షన్‌ పాట్లు!

ABN , Publish Date - May 03 , 2024 | 12:32 AM

పింఛన్ల సొమ్ము తీసుకోవడానికి లబ్ధిదారులు పడరాని పాట్లు పడ్డారు. పింఛన్‌ సొమ్ములను ఈనెల బ్యాంకులో వేయడంతో ఆ సొమ్ము తీసుకోవడానికి బ్యాంకుల దగ్గర పడిగాపులు కాశారు.

పెన్షన్‌ పాట్లు!
ముదినేపల్లిలో మండుటెండలో వృద్ధుల పడిగాపులు

మండుటెండలో వృద్ధుల పడిగాపులు

పెన్షన్‌దారులతో బ్యాంకులు కిటకిట

కొన్ని బ్యాంకుల్లో అదనపు చార్జీలు వసూలు..

మరికొన్నిచోట్ల లోన్‌ బకాయిలకు జమ

ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా నిరసన

ఖాతాలకు జమ చేయకుండా

నేరుగా చేతికి ఇవ్వాలంటూ డిమాండ్‌

ఓట్ల కోసం వైసీపీ రాజకీయ చర్యగా విమర్శలు

ఏలూరు సిటీ/ముదినేపల్లి/ పోలవరం/చాట్రాయి/ పెద వేగి/ ఉంగుటూరు/ ముసునూరు/ కైకలూరు/ లింగపాలెం/ చింతలపూడి, మే 2 : పింఛన్ల సొమ్ము తీసుకోవడానికి లబ్ధిదారులు పడరాని పాట్లు పడ్డారు. పింఛన్‌ సొమ్ములను ఈనెల బ్యాంకులో వేయడంతో ఆ సొమ్ము తీసుకోవడానికి బ్యాంకుల దగ్గర పడిగాపులు కాశారు. ఒకేసారి వందల మంది బ్యాంకులకు చేరడంతో బ్యాంకుల వద్ద క్యూ లైన్లు తప్ప లేదు. అందులో గురువారం జిల్లాలో 45 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వరకు ఉష్ణోగ్రతలు నమోదు కావడం తో బ్యాంకుల వద్ద తీవ్ర అసౌకర్యానికి గుర య్యారు. మండుటెండలో వృద్ధులు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది.

పెద్దవయస్సు వారికి, ఇంటి నుంచి బయటకు రాలేని వారికి ఇంటివద్దకే పింఛను ఇస్తామని చెప్పిన అధికారులు క్షేత్రస్థాయికి వచ్చేసరికి వృద్ధులను ఇబ్బందులకు గురిచేశారు. ప్రభుత్వం ఈనెల పెన్షన్‌ సొమ్ము లు బ్యాంకు ఖాతాలకు జమ చేయడంపై పెన్షన్‌దారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సచివాలయం, పంచాయతీ ఉద్యోగులతో ఇంటివద్దే పెన్షన్‌ ఇచ్చే అవకాశం ఉన్న వైసీపీ ప్రభుత్వం కావాలనే బ్యాంకుల్లో పెన్షన్‌ నగదు వేశారని లబ్ధి దారులు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం పెన్షన్ల పంపిణీని సైతం రాజకీయం చేస్తున్నారని పలువురు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు పింఛన్‌ సొమ్ములు డ్రా చేసుకునేటప్పుడు ఎటువంటి చార్జీలు వసూలు చేయరాదని అన్ని బ్యాంకులకు తెలిపామని లీడ్‌ బ్యాంకు అధికారులు చెబుతున్నా కొన్ని ప్రాంతాల్లో అద నపు చార్జీలు వసూ లు చేసినట్టు కొం తమంది లబ్ధిదారు లు ఆరోపించారు. లోన్‌ బ్యాంకు ఖాతాలైన ఎన్‌పీఏ అకౌంట్ల విషయం లో ఏ పరిశీలన చేయకుండా పింఛన్‌ సొమ్ములు తగ్గించి ఇచ్చారని చెబుతున్నారు. ముదినేపల్లిలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్రాంచికి చెందిన ఖాతాదారుల సేవా కేంద్రం వద్ద వృద్ధులు మండు టెండలో బారులు దీరారు. అల్లూరు లోని సప్తగిరి గ్రామీణ బ్యాంక్‌, శ్రీహరిపురం యూనియన్‌ బ్యాంక్‌, పెదగొన్నూరు ఇండియన్‌ బ్యాంకుల్లో పెద్ద సంఖ్యలో పెన్షనర్లు సొమ్ము తీసుకునేందుకు వచ్చారు. చాలా మంది పెన్షనర్ల అకౌంట్లను తిరిగి యాక్టివేట్‌ చేయాల్సి వచ్చింది. పోలవరం మండలం ఎల్‌.ఎన్‌.డీ.పేట సచివాలయం వద్ద వృద్ధులు, దివ్యాంగులు ఉదయం నుంచి పెన్షన్‌ సొమ్ముల కోసం ఎదురుచూసి స్థానికంగా ఉన్న ప్రైవేటు పేటీఎం బ్యాంకుల వద్ద బారులు దీరారు. పెన్షన్‌ సొమ్ములు బ్యాంకు ఖాతాలకు జమ చేయడం వల్ల ఐదు కిలోమీటర్ల దూరంలోని తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలం దొండపూడి ఆంధ్రా బ్యాంకుకి వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చాట్రాయిలో భారతీయ స్టేట్‌ బ్యాంకు, సప్తగిరి గ్రామీణ బ్యాంకు, కేడీసీసీ బ్యాంకు, చనుబండ, కోటపాడు ఇండియన్‌ బ్యాంకులకు పెన్షన్‌దారులు భారీగా తరలివచ్చారు. మండలంలో 8,550 మంది పెన్షన్‌దారులు ఉండగా సాయంత్రానికి 94 శాతం మందికి పెన్షన్లు పంపిణీ జరిగినట్టు ఎంపీడీవో మంగాకుమారి తెలిపారు. పెదవేగి, ఉంగుటూరు మండ లాల్లో బ్యాంకులు తెరిచే సమయానికి కంటే ముందే బ్యాంకుల దగ్గరకు చేరుకుని సొమ్ము తీసుకోవడానికి పింఛన్‌దారులు వేచి ఉన్నారు. ఎండ తీవ్రతతో ఇబ్బందులు పడ్డారు. ముసునూరు మండల వ్యాప్తంగా ఉన్న బ్యాంక్‌లు, బిసి పాయింట్లు పెన్షన్‌దారులతో కిటకిటలాడాయి. అయా చోట్ల సాయంత్రం వరకు రద్దీ కొనసాగింది. కైకలూరులోని బ్యాంకుల వద్దకు పింఛన్‌దారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనేకమంది లబ్ధిదారుల ఖాతాలకు ఆధార్‌, ఫోన్‌ నెంబరు అనుసంధానం కాకపోవడంతో బ్యాంకు అధికారులు వారిని అనుసంధానం చేసుకోవా లని ఆంక్షలు విధించారు. దీంతో వారు మరలా వారి గ్రామా లకు వెళ్లి సంబంధిత ధ్రువపత్రాలు తీసుకొచ్చి అందించారు. తీవ్ర అనారోగ్యంతో మంచంమీద ఉన్న లబ్ధిదారులకు అధికారులు ఇంటివద్దనే అందిస్తామని చెప్పినా ఆ విషయం వారికి సరిగ్గా సమాచారం అందించక పోవడంతో కుటుంబసభ్యులు వృద్థులను బ్యాంకుకు తీసుకొచ్చిన దృశ్యాలు సైతం కన్పించాయి. లింగపాలెం మండలంలోని పెన్షన్‌దారులు బ్యాంకుల వద్ద పడిగాపులు కాశారు. మండలంలో 22 గ్రామాలకు రంగాపురం, లింగపాలెం, ధర్మాజీగూడెం గ్రామాల్లో మూడు బ్యాంకులు మాత్రమే ఉండడంతో పెన్షన్‌దారులు పెన్షన్‌ సొమ్ము డ్రా చేసేందుకు ఇబ్బందులు పడ్డారు. వ్యవసాయ రుణాలు, తదితర బకాయిలకు పెన్షన్‌ నగదు జమ చేశామని బ్యాంకు ఉద్యోగులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చింతలపూడి మండలంలో బ్యాంకుల వద్ద పెన్షన్‌దారులు పడిగాపులు కాశారు. వృద్దులు, మహిళలు ఎండను తాళలేక బ్యాంకుల్లో రద్దీగా ఉండడంతో బ్యాంకుల్లోనే కూర్చున్నారు. యర్రగుంటపల్లి, సీతానగరం, రాఘవాపురం, ప్రగడవరం గ్రామాల్లో తప్ప ఎక్కడా బ్యాంకులు లేవు. దీంతో 19 పంచాయతీల్లోని పెన్షన్‌దారులు ఆయా బ్యాంకుల వద్దకు వెళ్లడానికి ఆటోలను ఆశ్రయించారు.

2.05 లక్షల బ్యాంకు ఖాతాలకు సొమ్ములు జమ

జిల్లాలో 2,68,886 మంది లబ్ధిదారులకు రూ. 80.63 కోట్లు రెండు విధాలుగా పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో ఒకటి పింఛన్‌ దారుని ఆధార్‌కార్డుకు అనుసంధానమైన బ్యాంకు ఖాతాకు డీబీటీ ద్వారా సొమ్ము జమ చేయాలని నిర్ణయించారు. ఈ విధంగా 2,05,548 మందికి రూ. 61.67 కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్టు లీడ్‌ బ్యాంకు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 35 బ్యాంకులకు సంబంధించి 300 బ్యాంకు బ్రాంచిలు ఉన్నాయి. అయితే డీబీటీ ద్వారా కవర్‌ చేయబడని మిగిలిన లబ్ధిదారులు 64,338 మందికి రూ.18.96 కోట్లు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికీ పంపిణీ చేస్తున్నారు. బుధవారం ఈ కార్యక్రమం ప్రారంభించగా 80 శాతం మందికి పైగానే అందజేశారు.

––––––––––––––––––––––––––

Updated Date - May 03 , 2024 | 12:32 AM