Share News

దివ్యాంగులకు తొలి నెల రూ.15 వేలు

ABN , Publish Date - Jun 07 , 2024 | 12:29 AM

కూటమి అధికారంలోకి రావడంతో దివ్యాంగుల్లో జోష్‌ నెలకొంది. ఇప్పటివరకు నెలకు రూ.3వేలు మాత్రమే పెన్షన్‌ అందుకుంటున్నారు. వచ్చే నెల నుంచి రూ.6 వేలు అందనున్నాయి.

దివ్యాంగులకు తొలి నెల రూ.15 వేలు

నెలకు రూ.6 వేలు పింఛన్‌ అమలు

వచ్చే నెలలో లబ్ధిదారుడికి రూ.15 వేలు

జిల్లాలో 28,399 లబ్థిదారుల ఎదురుచూపు

నరసాపురం, జూన్‌ 6: కూటమి అధికారంలోకి రావడంతో దివ్యాంగుల్లో జోష్‌ నెలకొంది. ఇప్పటివరకు నెలకు రూ.3వేలు మాత్రమే పెన్షన్‌ అందుకుంటున్నారు. వచ్చే నెల నుంచి రూ.6 వేలు అందనున్నాయి. ఎన్నికల హామీలో భాగంగా జూలైలో ఒక్కొక్క లబ్ధిదారుడికి పెండింగ్‌ బకాయితో కలిపి రూ.15వేలు పెన్షన్‌ రానుంది. దీనికోసం జిల్లాలోని 28,399 మంది దివ్యాంగులు ఎదురుచూస్తున్నారు. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో లబ్థి చేకూరలేదని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఈ స్థాయిలో పింఛన్‌ అందిస్తారని ఊహించలేదన్నారు. పెరిగిన ధరలు, ఇతర ఖర్చులు, తమ పరిస్థితిని అర్ధం చేసుకుని కూటమి రెట్టింపు పింఛన్‌ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. దివ్యాంగులకు ఇతర లబ్ధిదారుల కంటే ఎక్కువ మొత్తంలో పెన్షన్‌ ఇచ్చిన ఘనత టీడీపీకే దక్కింది. ఉమ్మడి రాష్ట్రంలో రూ.1000 ఉండేది. దాన్ని రాష్ట్ర విభజన తరువాత రూ.2 వేలకు పెంచారు. గత ఎన్నికల్లో భాగంగా టీడీపీతో పాటు వైసీపీ అధికారంలోకి వస్తే రూ.3వేలు పింఛన్‌ ఇస్తామన్నారు. దానికి అనుగుణంగా వైసీపీ పెంచి ఐదేళ్లపాటు ఇచ్చింది. ఎన్నికల హామీలో భాగంగా దివ్యాంగులకు వైసీపీ ప్రస్తుత పింఛన్‌ కొనసాగిస్తామన్నది. కూటమి మాత్రం రూ.6వేలు ఇస్తామని, ఆ మొత్తాన్ని ఏప్రిల్‌ నుంచే కలిపి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు ప్రభుత్వం రూ.మూడు వేలు చొప్పున అందించింది. హామీలో భాగంగా ఏప్రిల్‌, మే, జూన్‌ మూడు నెలల బకాయి రూ.9 వేలతో పాటు జూలై పింఛన్‌ రూ.6వేలు మొత్తం రూ.15 వేలు అందించనున్నారు.

టీడీపీ హయాంలోనే మేలు జరిగింది

–అప్పారావు, దివ్యాంగుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు

ప్రభుత్వ శాఖల్లో బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీతో పాటు సైకిళ్లు, మోటార్‌సైకిళ్లు, రుణాలు దివ్యాంగులకు అందించిన ఘనత టీడీపీకే దక్కింది. గతంలో దివ్యాంగులకు టీడీపీ మోటారుసైకిళ్లు ఇచ్చింది. అనేక శాఖల్లోని బ్యాక్‌లాగ్‌ పోస్టులను భర్తీ చేసింది. ఇప్పటివరకు నెల వారీ ఇస్తున్న పింఛన్‌ మొత్తాన్ని పెంచాలని ఆనేకసార్లు ప్రభుత్వా నికి విజ్ఞప్తి చేశాం, మా విన్నపా న్ని కూటమి ఆలకించి రూ.6వేలు చేయడం చాలా సంతోషంగా ఉంది.

Updated Date - Jun 07 , 2024 | 12:29 AM