సమగ్రశిక్ష పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్ల సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Jul 05 , 2024 | 11:49 PM
రాష్ట్రవ్యాప్తంగా 2012 నుంచి జడ్పీ, మున్సిపల్ పాఠశాలల్లో సమగ్రశిక్ష ప్రాజెక్టు కింద పనిచేస్తున్న ఐదువేల మంది పార్ట్‌టైం, కాంట్రాక్టు ఇన్‌స్ట్రక్టర్లకు ఉద్యోగభద్రత కల్పించాలని ఏపీ పార్ట్‌టైం, కాంట్రాక్టు ఉపాధ్యాయుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు వి.శ్రీనివాసరావు తెలిపారు.

మంత్రి లోకేశ్‌కు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు వినతి
ఏలూరు అర్బన్, జూలై 5 : రాష్ట్రవ్యాప్తంగా 2012 నుంచి జడ్పీ, మున్సిపల్ పాఠశాలల్లో సమగ్రశిక్ష ప్రాజెక్టు కింద పనిచేస్తున్న ఐదువేల మంది పార్ట్‌టైం, కాంట్రాక్టు ఇన్‌స్ట్రక్టర్లకు ఉద్యోగభద్రత కల్పించాలని ఏపీ పార్ట్‌టైం, కాంట్రాక్టు ఉపాధ్యాయుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు వి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖమంత్రి నారా లోకేశ్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఏలూరులో వివరాలను పత్రికలకు విడుదల చేశారు. ఇన్‌స్ట్రక్టర్లకు ఈపీఎఫ్, ఈఎస్‌ఐ వర్తింపజేయాలని మంత్రిని కోరామన్నారు. కనీస వేతనం కింద నెలకు రూ.33 వేలు ఇవ్వాలని కోరారు. ఉద్యోగ నియామక నిబంధనల్లో పార్ట్‌టైం అనేపదాన్ని తొలగించి ఒకేషనల్ ఇన్‌స్ట్రక్టర్‌గా మార్చాలని అభ్యర్థించారు. భర్తీ చేయకుండా ఖాళీగా ఉంచిన ఆర్ట్, క్రాఫ్ట్ పోస్టులన్నింటిని మెగా డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌లో చేర్చి నింపాలని కోరామన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్ట్, క్రాఫ్ట్ పోస్టులను రద్దుచేసి వాటిని ఎంఈవో–1, 2 పోస్టులుగా కన్వర్ట్ చేశారని, ఇప్పుడు వాటిని రద్దుచేసి యథాతథంగా పూర్వపు పోస్టులనే రెగ్యులర్ విధానంలో భర్తీచేయాలని డిమాండ్ చేశారు. మరణించిన కాంట్రాక్టు ఇన్‌స్ట్రక్టర్ల కుటుంబాలకు రూ.10లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరామన్నారు. మంత్రిని కలిసిన సంఘ నాయకుల్లో బాలాజీ తదితరులున్నారు.