పాలకొల్లులో సైకిల్ జోరు
ABN , Publish Date - May 12 , 2024 | 12:27 AM
పాలకొల్లు నియోజకవర్గంలో టీడీపీ, అధికార వైసీపీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది.

హ్యాట్రిక్ దిశగా నిమ్మల
కలిసివచ్చిన కూటమి శ్రేణులు
వైసీపీ అభ్యర్థిపై స్థానికేతరుడిగా ముద్ర
సొంత సామాజికవర్గం ఓట్లపై ఆశలు
పాలకొల్లు నియోజకవర్గంలో టీడీపీ, అధికార వైసీపీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రచారంతో సైకిల్ హోరెత్తిపోతోంది. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన నిమ్మల అధికార పక్షం, ప్రతిపక్షంలో సైతం ప్రజల మన్నన పొందారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజా వ్యతిరేక విధానాలపై అవిశ్రాంత పోరాటంతో ఆయన ప్రజలకు మరింత చేరువయ్యారు. మరోవైపు వైసీపీ అభ్యర్థి నియోజకవర్గానికి కొత్త. ఎన్నికల ఏడాదిలో ఆయనను పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించినప్పటికీ పార్టీ సీనియర్ నేతల నుంచి సహకారం కొరవడింది. ఎన్నికల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభ్యర్థి సామాజిక వర్గం ఓట్లు గెలిపిస్తాయని నమ్మకంతో ఉన్నారు. కూటమి నుంచి టీడీపీ శ్రేణులతో పాటు నిమ్మల కుటుంబం, జనసేన కార్యకర్తలు నియోజకవర్గం అంతా విస్తృతంగా కలియతిరుగుతున్నారు.
– పాలకొల్లు అర్బన్
పాలకొల్లు నియోజకవర్గంలో సైకిల్ హోరెత్తుతోంది. తెలుగుదేశం పార్టీ కూటమి తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, అధికార వైసీపీ అభ్యర్థిగా గుడాల శ్రీహరి గోపాలరావు (గోపి) మధ్య ప్రధాన పోటీ నెలకొంది. నిమ్మల రామానాయుడు 2014, 2019లో వరుస విజయాలు సాధించి హ్యాట్రిక్ దిశగా దూసుకుపోతున్నారు. మరోవైపు అధికారపార్టీ అభ్యర్థి గుడాల గోపి విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. రాజకీయంగా రాటుదేలిన రామానాయుడు వ్యూహాత్మకంగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రతిపక్షంలో ఉండి అనేక విధాలుగా పోరాటం చేస్తున్న రామానాయుడు ప్రజల్లో మమేకం అయ్యారు. 2014లో వచ్చిన మెజార్టీకి మూడొంతుల మెజార్టీని 2019లో సాధించారు. తిరిగా మూడోసారి మరింత మెజార్టీ సాధించే దిశగా నిమ్మల పావులు కదుపుతున్నారు. అధికార పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, టీడీపీతో జనసేన, బీజేపీ జతకట్టడం వంటి అంశాలు రామానాయుడుకు కలిసివస్తున్నాయి. మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ సాధిస్తానన్న ధీమా రామానాయుడులో కనిపిస్తోంది. పోస్టల్ బ్యాలెట్‌లో పోలైన ఓట్లలో 90శాతం టీడీపీ అభ్యర్థికే పడినట్టు ప్రచారం కావడం కూటమి శ్రేణులు మెజారిటీపై లెక్కలు వేస్తున్నారు.
వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా పది నెలల క్రితం గుడాల గోపిని ఆ పార్టీ ఎంపిక చేసింది. వీరవాసరం మండలానికి చెందిన గోపి స్థానికేతరుడు అంటూ ఆ పార్టీ వారే పెదవి విరిచారు. వీరవాసరం భీమవరం నియోజకవర్గం కావడంతో పాలకొల్లు ప్రజలు కూడా స్థానికేతరుడిగానే చూస్తున్నారు. అభ్యర్థిత్వ రేసులో ఉండడంతో పాలకొల్లు శివారు ప్రాంతానికి నివాసం మార్చి నిత్యం ప్రజల మధ్య ఉండే ప్రయత్నం చేస్తున్నారు. పాలకొల్లు, యలమంచిలి, పోడూరు. పాలకొల్లు మండలంలో గుడాల గోపి విస్తృతంగా పర్యటిస్తున్నారు. అయితే పెద్ద నాయకులు కొందరు దూరంగా ఉంటున్నారు. తన సామాజికవర్గమే విజయం సాధించి పెడుతుందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తాయని గోపి నమ్మకంతో ఉన్నారు. ఈనేపథ్యంలో పాలకొల్లు నియోజకవర్గంలో అధికార, ప్రతిపక్షాల మధ్య పోటీ రసవత్తరంగా మారింది. అసెంబ్లీ బరిలో 15 మంది ఉన్నప్పటికీ టీడీపీ, వైసీపీ అభ్యర్థులే ప్రధాన పోటీదారులు. టీడీపీ కూటమి వ్యూహాత్మకంగా దూసుకుపోతుంటే మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అర్జునరావు ప్రచారం నామమాత్రంగా సాగుతోంది. ఇతర పార్టీలు, స్వతంత్రులు నామమాత్రంగా మిగిలారు.