Share News

ఇంకెప్పుడిస్తారు ?

ABN , Publish Date - Mar 22 , 2024 | 11:52 PM

దాళ్వా పంట మాసూళ్లు దశకు వచ్చినా గడిచిన సార్వా పంట ధాన్యం సొమ్ము ఇంకా రైతులకు రాలేదు. రైతుల ఖాతాలలో సొమ్ము జమవ్వలేదు. ఎప్పుడు పడ తాయా అయని రైతులు ఎదురు చూస్తున్నారు.

ఇంకెప్పుడిస్తారు ?

దాళ్వా కోతలు వస్తున్నా..సార్వా సొమ్ములు అందలేదు ?

1400 మంది రైతులు ఎదురుచూపులు

ప్రభుత్వ విధానాలతో ఇబ్బందులు

రైతన్నకు కష్టపడి పంట పండించడం తెలుసు.. కానీ పండించిన ధాన్యం అమ్మి సొమ్ములు చేతిలో పడాలంటే ఎన్ని అవస్థలు పడాలో తెలిసేలా చేసింది మాత్రం వైసీపీ ప్రభుత్వమే. గడిచిన మూడేళ్లలో రైతులను ముప్పుతిప్పలు పెట్టి వరిసాగుకు దూరం చేసేలా ప్రభుత్వ విధానాలున్నాయి. దాళ్వా సాగు ధాన్యం అమ్మే దశలో ఉన్నా ఇంకా సార్వాకు సంబంధించి సొమ్ములు అందని రైతులు ఉన్నారు.

భీమవరం రూరల్‌, మార్చి 22 : దాళ్వా పంట మాసూళ్లు దశకు వచ్చినా గడిచిన సార్వా పంట ధాన్యం సొమ్ము ఇంకా రైతులకు రాలేదు. రైతుల ఖాతాలలో సొమ్ము జమవ్వలేదు. ఎప్పుడు పడ తాయా అయని రైతులు ఎదురు చూస్తున్నారు. జిల్లాలో గత సార్వా పంటలో 4 లక్షల 22 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వరకు కొనుగోలు చేశారు. పంట ముగిసి నాలుగు నెలలు అవుతుంది. దాళ్వా సాగు మొదలై మూడు నెలలు అవుతుంది. జిల్లాలో 1400 మంది రైతులకు రూ.15 కోట్లు పైగా ధాన్యం సొమ్ములు అందించాల్సి ఉంది. జనవరి 29 నుంచి సొమ్ములు ఆగిపోయాయి. అధికారుల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నా ఫలితం లేకుండా పోయింది.

అమ్మాలంటే నానా అవస్థలు

సార్వా పంట ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విధానాలు చాలా ఇబ్బందిగా మారాయి. దీంతో పంట మాసూళ్లయినా ధాన్యం రాసులుగా పోసి నెలలు తరబడి చూడాల్సి వచ్చింది. గడిచిన మూడేళ్లు ఆరు పంటలలో ప్రభుత్వం విధానంలో మద్దతు ధర అనే ప్రచారం తప్ప ఎక్కడా రైతుకు సరైన ధర దక్కలేదు. పైగా మిల్లర్లు బస్తాకు పది కేజీల వరకు కోత కోశారు. ఒక పంటలో అయితే నాలుగు నెలలకు కానీ సొమ్ములు రాలేదు. ధాన్యం సంచులు పొందడంలో అవస్ధలు.. ఇలా ఎన్నెన్నో కష్టాల మధ్య ధాన్యం అమ్మకాలు సాగుతున్నాయి. ఆరుగాలం కష్టపండి పండించిన ధాన్యం అమ్మాలంటే నానా ఇబ్బందులు పడాల్సి వస్తుందని రైతులు అంటున్నారు.

Updated Date - Mar 22 , 2024 | 11:52 PM