ఏదీ ఓఎన్‌జీసీ పరిహారం
ABN , Publish Date - Jul 28 , 2024 | 12:05 AM
రెండేళ్ళ క్రితం సీతారాంపురం గ్రామ భూగర్భంలో గ్యాస్ నిక్షేపాలు ఉన్నట్టు ఓఎన్‌జీసీ అధికారులు గుర్తించారు. అక్కడ స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ నుంచి పైప్‌లైన్ గుండా పట్టణంలోని రుస్తుంబాద టెంపుల్ ల్యాండ్‌కు తరలించేం దుకు ప్లాన్ చేశారు.

పనులు పూర్తయినా.. ఇవ్వని అధికారులు
రెండు రోజుల్లో చెల్లిస్తారంటున్న వీఆర్వో
నరసాపురం రూరల్, జూలై 27 : రెండేళ్ళ క్రితం సీతారాంపురం గ్రామ భూగర్భంలో గ్యాస్ నిక్షేపాలు ఉన్నట్టు ఓఎన్‌జీసీ అధికారులు గుర్తించారు. అక్కడ స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ నుంచి పైప్‌లైన్ గుండా పట్టణంలోని రుస్తుంబాద టెంపుల్ ల్యాండ్‌కు తరలించేం దుకు ప్లాన్ చేశారు. అయితే పైప్‌లైన్ మార్గం ఏర్పాటుపై రైతులు అభ్యంతరం తెలిపారు. పంట పొలాలు కింద పైప్‌లైన్ ఉంటే తమ భూములు ఎవరూ కొనుగోలు చేయ రని ఆందోళన చేశారు. నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీరి ఆందోళనలకు అప్పట్లో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, బొమ్మిడి నాయకర్ అండగా నిలిచారు. అప్పటిజిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ ఓఎన్‌జీసీ, రైతులతో సమావేశమై చర్చలు జరిపారు. 110 మంది రైతులకు రూ.35 లక్షల పరిహారం చెల్లించి, ఐదేళ్ళ తర్వాత పైప్‌లైన్లు తీసివేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. మూడు నెలల క్రితం ఓఎన్‌జీసీ పైప్‌లైన్ పనులను పూర్తిచేసింది. గ్యాస్ నిక్షేపాలు గుర్తిం చిన సీతారాంపురం నుంచి వైఎస్ పాలెం, రుస్తుంబాద మీదుగా ఓఎన్‌జీసీ పైప్‌లైన్ పనులు పూర్తిచేశారు. పనులు పూర్తయినా.. ఇంత వరకు హామీ ఇచ్చిన విధంగా పరిహారం చెల్లించలేదు. అదిగో అంటూ కాలయపాన చేస్తున్నారు. దీంతో రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొత్త కలెక్టర్ నాగరాణిని కలిసి పరిహారంపై వినతి పత్రం అందించారు. దీనిపై వీఆర్వో చిరంజీవి వివరణ ఇస్తూ పరిహారం చెల్లింపులో బ్యాంకు ఖాతాలు సక్రమంగా లేకపోవడం ఇబ్బందులు వచ్చాయని, రెండు, మూడు రోజుల్లో అందరికీ పరిహారం పడనున్నట్లు చెప్పారు.