Share News

నూజివీడు పట్టణంలో టీడీపీ హవా

ABN , Publish Date - Jun 06 , 2024 | 12:06 AM

సార్వత్రిక ఎన్నికల్లో నూజివీడు నియోజకవర్గ పరిధిలో తెలుగుదేశం పార్టీ 12,300 ఓట్లు మెజారిటీ సాధించగా, మెజారిటీ అగ్రభాగం నూజివీడు మున్సిపాలిటీ నుంచే రావడం విశేషం.

నూజివీడు పట్టణంలో టీడీపీ హవా

నూజివీడు టౌన్‌, జూన్‌ 5: సార్వత్రిక ఎన్నికల్లో నూజివీడు నియోజకవర్గ పరిధిలో తెలుగుదేశం పార్టీ 12,300 ఓట్లు మెజారిటీ సాధించగా, మెజారిటీ అగ్రభాగం నూజివీడు మున్సిపాలిటీ నుంచే రావడం విశేషం. నూజివీడు పట్టణం సాధారణంగా కాంగ్రెస్‌ సాంప్రదాయ ఓటు ఉండగా, వైసీపీ ఏర్పడిన అనంతరం కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు వైసీపీకి మళ్లింది. నూజివీడు పట్టణం దాదాపుగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకా వెంకటప్రతాప్‌ అప్పారావు ఆధిపత్యంలోనే ఉందని చెప్ప వచ్చు. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం అందుకు విరుద్ధంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ పసుపు జెండా ఎగురవేసింది. నూజివీడు మున్సిపల్‌ పరిధిలో మొత్తం 32 వార్డులు ఉండగా, కేవలం ఆరు వార్డులు మినహా, మిగిలిన వార్డుల్లో టీడీపీదే మెజార్టీగా కనిపించింది. గత మున్సిపల్‌ ఎన్నికల్లో ఇక్కడ 25 కౌన్సిలర్‌ స్థానాలు వైసీపీ గెలుచుకోగా, తెలుగుదేశంపార్టీ కేవలం ఏడుస్థానాలతోనే సరిపెట్టుకుంది. 2019 ఎన్నికల్లో నూజివీడు మున్సిపాలిటీ పరిధిలో వైసీపీకి 5,500 వరకు ఓట్ల మెజార్టీ వచ్చింది. అయితే ఈ ఎన్నికల్లో 5,500 ఓట్లను సమం చేసి 4,731 ఓట్లు మెజార్టీని టీడీపీ సాధించడం విశేషం.ప్రస్తుత ఓట్ల లెక్కింపులో నూజివీ డులోని 1 నుంచి 13 వార్డులు, 15 నుంచి 18 వార్డులు, 22, 24, 26 నుంచి 32 వార్డుల్లో టీడీపీ స్పష్టమైన ఆధిక్యత కనబర్చగా వైసీపీ కేవలం 14,19,20,21,23,25 వార్డులలో మాత్రమే ఆధిక్యత కనబరిచింది.

ముసునూరు : మండలంలో 2,307 ఓట్లు టీడీపీ మెజార్టీ సాధించింది. మండలంలో 10 గ్రామాల్లో టీడీపీ ఆధిపత్యం కొనసాగగా, ఆరు గ్రామాల్లో వైసీపీ స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది. వైసీపీ కంచుకోటగా ఉన్న రమణక్కపేటలో 433 ఓట్ల మెజార్టీని టీడీపీ సాధించింది. అలాగే కాట్రేనిపాడులో 397 ఓట్లు, గుళ్ళపూడిలో 381, చెక్కపల్లిలో 338, గోపవరంలో 299, వలసపల్లిలో 151, సూరేపల్లిలో 148, యల్లాపురంలో 63, బలివేలో 62, అక్కిరెడ్డిగూడెంలో 35 ఓట్ల మెజారిటీని టీడీపీ సాధించింది. వైసీపీ మాత్రం లోపూడిలో 107, ముసునూరులో 87, చింతలవల్లిలో 63, కొర్లకుంటలో 196, వేల్పుచర్లలో 420, చిల్లబోయినపల్లిలో 22తో మొత్తం 895 ఓట్ల మెజారిటీ సాధించింది. గత ఎన్నికలతో పోలిస్తే ఈ గ్రామాల్లో వైసీపీ మెజారిటీ తగ్గిందని చెప్పవచ్చు. 2019 ఎన్నికల్లో ముసునూరు మండలంలో 2,700 మెజారిటీని వైసీపీ సాధించగా, ఈ ఎన్నికల్లో ఆ మెజారిటీతో సమం చేసి 2307 ఓట్ల మెజారిటీని టీడీపీ సాధించటం విశేషం.

నూజివీడు పట్టణంలో

టీడీపీ జెండా ఎగురవేస్తాం

నూజివీడు : నూజివీడు పట్టణంలో టీడీపీ జెండాను ఎగురవేస్తామని, నూజివీడు మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ చెరుకూరి దుర్గాప్రసాద్‌, నూజివీడు పట్టణ టీడీపీ అధ్యక్షుడు మల్లిశెట్టి జగదీష్‌ అన్నారు. నియోజకవర్గం లో టీడీపీ విజయం సాధించిన నేపథ్యంలో నూజివీడులో వారు విలేకర్లతో మాట్లాడారు. నూజివీడు టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించిన కొలుసు పార్థసారధికి నూజివీడు మున్సిపాలిటీలోనూ 4,731 ఓట్ల మెజారిటీ రావడం ఆనం దంగా ఉందన్నారు. మున్ముం దు నూజివీడు మున్సిపాలి టీని కూడా టీడీపీ దక్కించు కుంటుందన్నారు. ఈ కార్యక్ర మంలో నూజివీడు పట్టణ టీడీపీ కార్యదర్శి పల్లి నాగరాజు, క్లస్టర్‌ ఇన్‌చార్జ్‌ ఎం.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

కామినేనికి రికార్డు స్థాయి మెజారిటీ

ముదినేపల్లి, జూన్‌ 5 : సార్వత్రిక ఎన్నికల్లో కైకలూరు నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించిన కూటమి అభ్యర్థి మాజీ మంత్రి డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌కు ముదినేపల్లి మండలంలో రికార్డు స్థాయి ఓట్ల మెజారిటీ లభించింది. ఈ మండలంలో కామినేని 10,375 ఓట్ల మెజారిటీ సాధించారు. ఇంతకు ముందు మండలంలో ఏ ఎన్నికల్లోనూ ఏ పార్టీకి లభించని అనూహ్యమైన మెజారిటీ మండలంలోని 32 గ్రామపంచాయతీల్లో 31 గ్రామాల్లో కూటమికి మెజారిటీ రాగా, ఒక్క వి.రావిగుంట గ్రామంలోనే దూలం నాగేశ్వరరావుకు 73 ఓట్ల మెజారిటీ వచ్చింది. మండలంలో అత్యధికంగా వడాలి గ్రామంలో 1,136 ఓట్ల మెజార్టీ రాగా, అత్యల్పంగా సంకర్షణపురంలో నాలుగు ఓట్ల మెజారిటీ వచ్చింది. ములకలపల్లిలో కూడా 13 ఓట్ల మెజారిటీ వచ్చింది. కూటమికి 1,010 ఓట్ల మెజారిటీ ఇచ్చి పెదగొన్నూరు గ్రామం రెండవ స్థానంలో నిలిచింది. ఇక మండలంలోని పది గ్రామాల్లో 80 నుంచి 200 లోపు 11 గ్రామాల్లో 200 నుంచి 400 లోపు, అయిదు గ్రామాల్లో 500 నుంచి వెయ్యి లోపు ఓట్ల మెజారిటీ వచ్చింది. మండలంలో వచ్చిన భారీ మెజారిటీ కూటమి నాయకుల అంచనాలకు మించి రావడంతో టీడీపీ, బీజేపీ, జనసేన వర్గాల్లో నూతనోత్సాహాన్ని నింపిది. 2019 ఎన్నికల్లో ఈ మండలంలో వైసీపీకి సుమారు 1,400 ఓట్ల మెజారిటీ రాగా, ఈ ఎన్నికల్లో పది వేల ఓట్లకు పైగా మెజారిటీ సాధించటం విశేషం. దీంతో కూటమి శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు.

Updated Date - Jun 06 , 2024 | 12:06 AM