నామినేటెడ్ పోటాపోటీ!
ABN , Publish Date - Jul 28 , 2024 | 12:25 AM
ఇంతకు ముందు మాదిరిగా ఒకరిద్దరి పేర్లతో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసే అవకాశం లేదు.

సీనియర్లు, జూనియర్లది ఒకటే ఆశ..బాట
–ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి
ఇంతకు ముందు మాదిరిగా ఒకరిద్దరి పేర్లతో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసే అవకాశం లేదు. నియోజకవర్గాల వారీగా ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో ముందుగా నిర్ధారించి ఆ తరువాతే సిట్టింగ్ ఎమ్మెల్యే ఏ పార్టీకి చెందిన వారు అయితే ఆయా నామినేటెడ్ పోస్టుల్లో ఆ పార్టీ వారికి 60 శాతం, మిగతా 40 శాతం మిగతా పార్టీల్లో వారికి అవకాశం ఇవ్వాలని ఇప్పటికే కూటమి కీలక నిర్ణయం తీసుకుంది. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే తర్వాత అంతే హోదాలో ఉండే నామినేటెడ్ పోస్టు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి. ఇప్పుడు దానికోసమే అన్ని పార్టీల్లోనూ వివిధ స్థాయిల్లోని నేతలు పోటీలు పడుతున్నారు.
నియోజకవర్గాల్లో ఇదే ఆశ
ఎన్నికల సమయంలోనే కొందరు సీనియర్లతో పాటు జూనియర్లకు కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే తగిన గౌరవం ఉన్న పదవిలో మేము మిమ్మల్ని కూర్చోబెడతాం.. అంటూ కూటమి నేతలు హామీలు ఇచ్చారు. ఇప్పుడు నామినే టెడ్ పోస్టులు భర్తీకి సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు కూటమిలో మిగతా నేతలు ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటారో, వారు ఏ పార్టీకి చెందిన వారు అయి ఉంటే నామినేటెడ్ పోస్టుల భర్తీలో అక్కడ ఆ పార్టీకి 60 శాతం, మిగతా 30 శాతం ఒక పార్టీకి, పదిశాతం ఇంకో పార్టీకి దామాషా పద్ధతిలో కేటాయించాల నేది ఒక సారాంశం. ఎలాగో కార్పొరేషన్లు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. వాటితో పాటు దేవాలయాలు, ఇతరత్రా పదవు లకు కొదువేలేదు. కాని నియోజకవర్గాల్లో ఇప్పటికే నేతల దృష్టి అంతా మార్కెట్ కమిటీల మీద పడింది. ఎందు కంటే మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఎవరైతే ఉంటారో ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేతో సమానంగా ప్రోటోకాల్ వర్తిస్తుంది. అదికాక దాదాపు ఇప్పటి వరకు ఆ పదవి నిర్వహించిన వారంతా నెంబర్ –2గానే నియోజకవర్గాల్లో కొనసాగుతూ వచ్చారు. ఇప్పుడు ఆ పదవికోసం కూటమి నేతల మధ్య అక్కడక్కడ పోటీ నెలకొంది. ఏలూరు, దెందులూరు, చింతలపూడి, నూజి వీడు నియోజక వర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు గెలుపొందగా, పోలవరం, ఉంగుటూరులో జనసేన ఎమ్మెల్యేలు గెలుపొందారు. కైకలూరు స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ శ్రీనివాస్ గెలు పొందారు. ఈ నేపఽథ్యంలో ఎక్కడికక్కడ ఇప్పటికే గత ఎన్నికల్లో ప్రాణా లకు తెగించి పనిచేసిన సీనియర్లతో పాటు జూనియర్లకు నామినేటెడ్ పదవుల్లో అవకాశం ఇవ్వాలని, ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఒక భావనకు వచ్చినా ఎవరిని నొప్పించకుండా జాగ్రత్త పడుతున్నారు. పార్టీ ముఖ్యులు చెప్పింది వినటమే కాని దీనిపై చర్చకు ఏ ఎమ్మెల్యే సాహసించడం లేదు. నియోజకవర్గ స్థాయిలో మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్ పదవులను ఇంతకు ముందు వైసీపీ వివిధ వర్గాలతో పాటు మహిళలకు ప్రాధాన్యత ఇచ్చింది. ఇప్పుడు కూటవి నిర్ణయం ఏ విధంగా ఉంటుందో అన్నది సస్పెన్స్.
‘మార్కెట్’ హుషారు
వివిధ నియోజకవర్గాల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఆశిస్తున్న వారి సంఖ్య పెద్దసంఖ్యలోనే ఉంది. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు అరడజను మందికి పైగానే మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఆశిస్తున్నారు. వీరిలో సీనియర్లే అధికం. ప్రత్యేకించి టీడీపీ ఎమ్మెల్యే ఇక్కడ గెలిచారు కాబట్టి, మార్కెట్ కమిటీ చైర్మన్ పదవితో పాటు వివిధ దేవాలయాలు, ఇతరత్రా కమిటీల చైర్మన్ల పద వులు అత్యధికం టీడీపీకే దక్కే అవకాశం ఉంది. చైర్మన్ పదవి నిమిత్తం పూజారి నిరంజన్, లింగి శెట్టి శశికుమార్, ఆర్నేపల్లి మధు, నెరుసు గంగరాజు, కొట్టు మధుతో పాటు కంచన జయరాజు పేర్లు ఇప్పటికే ప్రచారంలో ఉన్నాయి. వీరిలో కొట్టు మధు, దివంగత ఎమ్మెల్యే బడేటి బుజ్జికి వియ్యంకుడు. పూజారి నిరంజన్ ఒక పర్యా యం చైర్మన్‌గా వ్యవహరించారు. మిగతా వారంతా పార్టీకి పూర్తి సమయం కేటా యించి శ్రమించారు. కేడర్‌లోనూ వీరికి కొంత ఆమోదముద్ర లేక పోలేదు కాని ఎమ్మెల్యే చంటి తన మనస్సులోని మాట బయటపడకుండా జాగ్రత్త పడుతున్నా రు. దెందులూరు నియోజకవర్గంలో క్లస్టర్ ఇన్‌ఛార్జ్ తాతా సత్యనారా యణ పేరు దెందులూరు మార్కెట్ కమిటీకి ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే పెదపాడు మండలానికి ఈ సారి చైర్మన్ పదవి కేటాయించాలని ఆ మండల నేతలు ఇప్పటికే ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై ఒత్తిడి తెస్తున్నారు. పైకి బయటపడ క పోయినా మాజీ జడ్పీటీసీ గారపాటి సీత ఈ పదవిని ఆశి స్తున్న ట్టు తెలు స్తోంది. జనసేన పక్షాన ఘంటసాల వెంకటలక్ష్మి, కొఠారి ఆదిశేషు లు సైతం తమ ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి టీడీపీకే దక్కే అవకాశం ఉంది. చింతలపూడి నియోజక వర్గంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని ఆశిస్తున్న వారి సంఖ్య భారీగానే ఉంది. వీరిలో లింగపాలెం మాజీ జడ్పీటీసీ గుత్తావరప్రసాద్ (పెదబాబు), కిలారు సత్యనారాయణ, చందు శ్రీనివాస్ యాదవ్, మరీ దు వెంక ట్రావు, అబ్బిన దత్తాత్రేయ, సూరనేని గోపి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ నిర్ణయాన్ని బట్టి ఈ పదవి ఎవరికి ఇస్తారు అనేది తేలబోతోంది. జనసేన పక్షాన కూడా ఆ పార్టీ నియోజక వర్గ ఇన్‌ఛార్జ్ మేకా ఈశ్వరయ్య తో పాటు వి.నాగ విజయ్ కుమార్, మధుబాబు ఆశిస్తున్నారు. ఆ మేరకు జనసేన పార్టీ నాయకత్వంపై ఒత్తిడి తేవాలని భావిస్తు న్నారు. పోల వరం, ఉంగుటూరు నియోజ కవర్గాల్లోనూ మార్కెట్ కమిటీల కోసం కొంత పోటాపోటీ వ్యవహారం నెలకొంది. ఉంగుటూరు నుంచి జనసేన పక్షాన ఎమ్మెల్యేగా పత్సమట్ల ధర్మరాజు గెలుపొందా రు. అయినా టీడీ పీ పక్షాన పార్టీలో సీనియర్లు అయిన పాతూరి విజయ్ కుమార్, చింతల శ్రీనివాస్ చైర్మన్ పదవి ఆశిస్తున్న వారిలో ఉన్నారు. ఎన్నికల సమయంలోనే ఈ మేరకు కొంత టీడీపీ, జనసేన మధ్య ఒక అవగాహన ఉన్నట్లు ప్రచారం సాగింది. ఇప్పుడు ఎలాగో సిట్టింగ్ ఎమ్మెల్యే జనసేన పక్షానికి చెందిన ధర్మరాజు ఉంటారు కాబట్టి ఆయన నిర్ణయ మే తుది నిర్ణయం కాబోతుంది. కైకలూరులో సిట్టింగ్ ఎమ్మెల్యేగా బీజేపీకి చెందిన డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఉన్నారు. ఈ నియోజకవర్గంలో చైర్మన్ పదవి కోసం టీడీపీ పక్షాన సీనియర్ నేత పెనుమత్స త్రినాథ్‌రాజు, పి.రామచంద్ర రావు ఆశలు పెంచుకున్నారు. కలిదిండి మార్కెట్‌కమిటీలో చైర్మన్‌గా బీజేపీ పక్షాన మురళీ కృష్ణతో పాటు తోకల జోగిరాజు, శ్రీనివాసరావులు పోటీ పడుతున్నారు.
మంత్రి నియోజకవర్గంలో ..
నూజివీడు నియోజకవర్గం నుంచి మంత్రి కొలుసు పార్థసారథి ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఈ నియోజకవర్గంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం ఆశిస్తున్న నేతల సంఖ్య భారీగానే ఉంది. వీరిలో కాపా శ్రీనివాస్, ఢలరామ్, చిట్నేని శివరామకృష్ణ, మోరంపూడి శ్రీను, అక్కినేని చంద్రశేఖర్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. వీరిలో కాపా శ్రీనివాస్ ఇంతకు ముందు ఒకసారి చైర్మన్‌గా వ్యవహరించారు. వీరితో పాటు జనసేన పక్షం నుంచి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బర్మాఫణిబాబు, మరీదు శివరామకృష్ణ ఆశిస్తున్నారు. అయితే ఈ నియోజక వర్గంలో చైర్మన్ పదవికోసం పోటీ తీవ్రంగా ఉండడంతో మంత్రి పార్థసారథి ఆచితూచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.