Share News

మాటల్లేవ్‌.. దండంతో సరి!

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:40 PM

వైసీపీలో వింత తీరు.. గతంలో ఇచ్చిన హామీలు చేయలేక చేతులెత్తేశారా... ఆ పార్టీ అభ్యర్థుల అందరి నోటా సీఎం తరహా రత్నాలే..టీడీపీపై బురద చల్లేందుకే ప్రాధాన్యత.. ఎలాగు కొత్త మేనిఫెస్టో వస్తుందిగా అంటూ సాగదీస్తూ ఎటువంటి కొత్త హామీ లు ఇవ్వకుండానే జనంలో పర్యటించడం గమనార్హం.

 మాటల్లేవ్‌.. దండంతో సరి!

వైసీపీ అభ్యర్థుల ప్రచారంలో వింత వైఖరి

కొత్త హామీల ఊసే లేదు..

వైసీపీలో వింత తీరు.. గతంలో ఇచ్చిన హామీలు చేయలేక చేతులెత్తేశారా... ఆ పార్టీ అభ్యర్థుల అందరి నోటా సీఎం తరహా రత్నాలే..టీడీపీపై బురద చల్లేందుకే ప్రాధాన్యత.. ఎలాగు కొత్త మేనిఫెస్టో వస్తుందిగా అంటూ సాగదీస్తూ ఎటువంటి కొత్త హామీ లు ఇవ్వకుండానే జనంలో పర్యటించడం గమనార్హం. గత ఎన్నికల్లో వైసీపీ నాయ కులు హామీలతో అరచేతిలో వైకుంఠం చూపారు. సామాన్యుడికి అందుబాటులో ఉంటామంటూ ఊదర కొట్టారు. టీడీపీ హయాంలో వేసిన అభివృద్ధిపై రచ్చ రచ్చ.. వీలైతే అప్పటి అధికారితో టీడీపీపై తీవ్ర ఆరోపణలు.. విమర్శలు. మరి ఇప్పుడు ఏమనుకున్నారో ఏమో గాని జనాలకు ఎక్కడా వాగ్దానాలు ఇవ్వడం లేదు.

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి) :

వాస్తవానికి అధికారమే లక్ష్యంగా గడిచిన ఎన్నికల్లో వైసీపీ జనం చెవులకు చిల్లులు పడేలా వాగ్దానాలు చేసింది. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామంటూ గొప్ప లు చెప్పింది. ప్రాజెక్టు కోసం సర్వం ధారపోసిన కుటుంబాలకు ఇస్తామన్న సాయం అందలేదు. వాగ్దానం ఎప్పుడో గాలిలో కలిసింది. నిర్వాసితులకు అందాల్సిన పరిహారంలో సొమ్ము చేతులు మారింది. కమిషన్‌ల పేరిట నొక్కుడే నొక్కుడు. ఇందులో అధికార పక్ష నాయ కుల పాత్ర ఉన్నట్టు వామ పక్షాలతో సహా మిగతా పక్షాలన్ని ఈ ఐదేళ్లుగా విరుచుకుపడుతూనే ఉన్నాయి. పోలవరం నియోజకవర్గంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే తెల్లం బాలరాజును కాదని ఆయన సతీమణికి వైసీపీ టిక్కెట్‌ ఇచ్చిం ది. ఇప్పుడు ఆమె ఓటు వేయమని కోరుతూ గ్రామాల్లో ప్రచారం చేస్తున్నా ఇంతకుముందు బాలరాజు ఇచ్చిన హామీలు, వాగ్దానాలను మాట వరుసకైనా ప్రస్తావించ కుండా దాటవేస్తున్నారు. పోలవరం నిర్వాసితుల ప్రశ్నల కు తగిన సమాధానం లేదు. చింతలపూడి నియోజకవర్గంలోను ఈ తరహా పరిస్థితే. ఈ నియోజకవర్గంలో దాదాపు అన్ని చోట్ల సమస్యలు కుప్ప కన్పిస్తోంది. దీనిపై ఈ ఐదేళ్లపాటు పాలన చేసిన వైసీపీ ఇప్పుడు నోరెత్తితే ఒట్టు. ఎన్నికల సమయంలో ఓటు వేయండి అంటూ ప్రజలను అభ్యర్థిస్తూ చేతులు జోడిస్తున్నారు. మెట్టలో పంట ఉత్పత్తులు నాశనమైన విషయాన్ని, ఎత్తిపోతలు అదృశ్యమైన విధానం ఎక్కడికక్కడ ఆయా కాలనీలు, ఇంకా ఎదురు చూస్తున్న వేలాది మందికి ఇళ్ల స్థలాలు గురించి మాట వరుసకైనా ప్రస్తావన లేకుండా పోయింది. డెల్టా ప్రాంతంలో దాదాపు నియోజకవర్గ కేంద్రాలన్ని మునిసిపాలిటిలే. ఆయా మునిసిపాలిటీల్లో ఈ ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి జీరో. దీనికి తోడు ఈ నియోజకవర్గాల్లో తిరిగి సిట్టింగ్‌లే తిరిగి పోటీలో ఉన్నారు. వీరంతా నవరత్నాలు తిరిగి రిపీట్‌ చేస్తున్నారే తప్ప కొత్తగా ఏం చేస్తారో మాట వరుసకైనా నోరు జారితే ఒట్టు .భీమవరం, పాలకొల్లు, నరసాపురం, తాడేపల్లిగూడెం, తణుకు, ముసినిపాలిటీల్లో జన సాంద్రత ఎక్కువ. ఇక్కడి సమస్యలు కో కొల్లలలు. వైసీపీ అభ్యర్థులు, వైసీపీ అధినాయకత్వం పట్టించుకోక పోవడంతో ప్రజలు లోలోన ఆగ్రహంగా ఉన్నారు.

వద్దనుకున్నారా.. వదిలేసుకున్నారా..

సాధారణ ఎన్నికల్లో పోటీ కూటమి , వైసీపీ మధ్య జరగబోతుంది. ఈ రెండు పక్షాలకు చెందిన శ్రేణులన్నీ ఇప్పటికే మోహరించాయి. నియోజక వర్గాల వారీగా ఎత్తులు పైఎత్తులకు దిగుతున్నాయి. ఏలూరు లోక్‌ సభ నియోజకవర్గ పరిధిలో వైసీపీ తన సిట్టింగ్‌లను కొందరినే మార్చింది. చింతలపూడి నుంచి సిట్టింగ్‌ ఎమ్మె ల్యేగా ఉన్న ఎలీజాను కాదని కొత్త ముఖానికి అవ కాశం ఇచ్చారు. ఈ లోక్‌ సభ స్థానం పరిధిలో పోటీలో ఉన్న మిగతావారంతా సిట్టింగ్‌లే. గడిచిన ఎన్నికల్లో చెప్పిన మాట ఎలాగు నెరవేర్చుకోలేదు. మళ్ళీ అదే చెబితే జనం ఊరుకుంటారా.. అందుకనేమో.. జగనన్న గెలవాలంటే మేము గెలవాలి. నవరత్నాలు ఇచ్చాం కదా మరెన్నో ఇవ్వాల్సి ఉంది. మా కొత్త మేనిఫెస్టోలో ఇవన్నీ ఉంటాయి.. అంటూ అభ్యర్థులు ప్రచారంలో జనా న్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ పార్టీ అధినేత జగన్‌ ఎవరూ ఊహించని పథకాలతో మా సరికొత్త మేనిఫెస్టో వస్తుంటూ ప్రకటించారు. అనుగుణంగానే నేతలు, కేడర్‌ జనాల ఎదుట ఊదర గొడుతున్నారు.

ప్రచారంలో కూటమి అభ్యర్థుల దూకుడు

ఎన్నికల ప్రక్రియ ఆరంభమైన వద్ద నుంచి కూటమి అభ్యర్థులు అంతా తాము గెలిస్తే సూపర్‌ సిక్స్‌ పథకాలతో పాటు నియోజకవర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉంటా మని ప్రజలు ఎదుట పక్కాగా చెబుతున్నారు. మరోవైపు వైసీపీ తీరును ఎండగడుతున్నారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అక్కడక్కడ గోతులు పూడ్చి రోడ్లుకు షోకులు చేస్తున్నారు... అంటూ వైసీపీపై విరుచుకుపడుతున్నారు. కూటమి గెలిస్తే శాంతి భద్రతలు పక్కాగా అమలవుతాయి.. సంక్షేమ అభివృద్ధి మూడు పువ్వులు, ఆరు కాయలుగా ఉంటాయి. గడిచిన ఐదేళ్లలో జరిగింది ఏమి లేదు. అందుకనే సరికొత్త బాటలో పయనిస్తామంటూ ప్రచార సభలలో చెబుతున్నారు. డెల్టా ప్రాంతాలోనూ నిలిచిన పోయిన పనులు ప్రస్తావిస్తున్నారు. రైతులకు న్యాయం జరగలేదని బీసీ వర్గాలకు కేవలం పదవులతో ఆశ చూపించి సంక్షేమాన్ని విస్మరించారని పట్టణాభివృద్ధి అదృశ్యమై పన్నుల పెనుభారంగా మార్చారని విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. బీజేపీ కేంద్రం అమలు చేసిన పథకాలను ప్రస్తావిస్తోంది. నర సాపురం లోక్‌ సభ బీజేపీ బలపరిచిన అభ్యర్థి కూటమి పక్షాన భూపతి రాజు శ్రీనివాస వర్మ కేంద్ర పథకాలే తమకు శ్రీరామ రక్ష అని, ఆఖరికి కరోనా సమయంలో కేంద్రం ఉదారంగా వ్యవహరించి పేదలకు బియ్యం అందించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఏలూరు లోక్‌ సభ ఉమ్మడి అభ్యర్థి పుట్టా మహేష్‌ కుమార్‌ యాదవ్‌ తన ప్రచారంలో టీడీపీ మాత్రమే అభివృద్ధి సంక్షేమం చేసి చూపించగలదని నొక్కి చెబుతున్నారు. మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు జరిగింది ఎంత.. ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి నెరవేర్చింది ఎంత అంటూ నిలదీస్తూనే ప్రచారం చేస్తున్నారు.

Updated Date - Apr 25 , 2024 | 11:40 PM