Share News

నో స్మోకింగ్‌..

ABN , Publish Date - May 31 , 2024 | 12:05 AM

ధూమపానం హానికరం అనితెలిసినా.. చాలా మంది ఈ అలవాటుకు బానిసలవుతున్నారు. స్టైల్‌, ఫ్యాషన్‌, రిలాక్సేషన్‌.. ఇలా ఎన్ని పేర్లతో దీన్ని మొదలెట్టినా వ్యసనంగా మారి ప్రాణాలను హరిస్తుంది.

నో స్మోకింగ్‌..

నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం

ధూమపానం హానికరం అనితెలిసినా.. చాలా మంది ఈ అలవాటుకు బానిసలవుతున్నారు. స్టైల్‌, ఫ్యాషన్‌, రిలాక్సేషన్‌.. ఇలా ఎన్ని పేర్లతో దీన్ని మొదలెట్టినా వ్యసనంగా మారి ప్రాణాలను హరిస్తుంది. దేశంలో ధూమపానం కారణంగా ఏటా సుమారు 13.5 లక్షల మంది మృత్యువాత పడుతున్నట్టు అంచనా. పొగాకు వాడకం వల్ల కలిగే ప్రమాదాన్ని తెలిపేందుకు ప్రతీ ఏటా మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పాటిస్తారు. పొగాకులో 600 కంటే ఎక్కువ రసాయనాలున్నాయి. అందులో ఉన్న ఆర్సెనిక్‌, బెంజీన్‌, బెరీలియం, కాడ్మియం, క్రోమియం వంటి 72 రసాయనాలు కచ్చితంగా కేన్సర్‌ కారకాలుగా చెప్పొచ్చు. దీనిని కార్సినోజెన్స్‌ అంటారు. ధూమపానం వల్ల ఊపిరితిత్తుల సామర్ధ్యం తగ్గుతుందని వైద్య నిపుణులు చెబు తున్నారు. మే 31వ తేదీ ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రజలలో చైతన్యం కోసం ఈ ప్రత్యేక కథనం.

ద్వారకాతిరుమల/నిడమర్రు, మే 30 :

పొగాకు, గుట్కా, ఖైనీ, పాన్‌మసాలా వాడకాన్ని ధూమపానంగా భావిస్తారు. పొగాకు మొక్కల ఆకులను ఎండబెట్టి మొత్తటి పొడుం చేసి పలు ద్రవ్యాలు కలిపి ఈ పదార్థాలు తయారుచేస్తారు. సిగెరెట్‌, బీడీలను కాల్చడం ద్వారా వచ్చే వాయువును పీలుస్తూ తాత్కాలిక ఉపశమనం పొందుతున్నట్టు ప్రజలు భావిస్తారు. కానీ దీర్ఘకాలంలో పొగాకు ఉత్పత్తుల ద్వారా మనిషిలో ఊపిరితిత్తులు, గుండె, కాలేయం, కిడ్నీ, నేత్ర సంబంధమైన రోగాలకు దారితీయవచ్చని వైద్యులు చెబుతున్నారు.

సెకండ్‌ హ్యాండ్‌ స్మోక్‌ ప్రమాదమే..

నేరుగా పొగాకు తీసుకోకపోయినా.. పొగ తాగకపోయినా.. వేరేవారు తాగినప్పుడు వారికి దూరంగా ఉండాలి. మన ఆరోగ్యంపై దాని ప్రభావం చాలా ఎక్కువ. ధూమపానం చేసేవారికి మాత్రమే కాకుండా వారి కుటుంబం, స్నేహితులు సహ ఉద్యోగులు, చుట్టుపక్కల వారిపై సైతం ఇది హాని చేస్తుంది. దీనిని సెకండ్‌ హ్యాండ్‌ స్మోకింగ్‌ అంటారు. ఇది మహిళలు, పిల్లలకు మంచిది కాదు. దీనివల్ల శ్వాస, గుండె, గర్భధారణ, ఆర్ధరైటిస్‌ సమస్యలు, లంగ్‌క్యాన్సర్‌, ఇది మన శారీరక ఆరోగ్యంపైనే కాకుండా మన మానసిక ఆరోగ్యాన్ని సైతం ప్రభావితం చేస్తుంది.

ఎముకల ఆరోగ్యంపై ప్రభావం

ధూమపానం అన్ని శరీరభాగాలతో పాటు ముఖ్యంగా ఎముకల ఆరోగ్యంపై హానికర ప్రభావం చూపుతుంది. ఇది ఎముక ద్రవ్యరాశిని తగ్గించడంతో పాటు ఆస్టియోఫొరోసిస్‌ అనే ఎముకల వ్యాధికి దారితీస్తుంది. దీనివల్ల తుంటి, వెన్నుముకకు పగుళ్లు ఏర్పడతాయి. ధూమపానం చేసే స్త్రీలలో ముందస్తు మెనోపాజ్‌ వచ్చి ఆస్టియోఫొరోసిస్‌ వ్యాధిని మరింతగా పెంచుతుంది. ఎముకలు విరిగి శస్త్రచికిత్స చేయించుకున్న వారిలో ధూమపానం వల్ల ఎముక అతుక్కోదని ఇటీవల ఇటువంటి కేసులు ఎక్కువయ్యాయని వైద్యులు చెబుతున్నారు.

ధూమపానం–గణాంకాలు..

ధూమపానం గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూహెచ్‌వో) సంస్థ తెలిపిన వివరాలు పరిశీలిస్తే ఈ మహమ్మారి మానవఆరోగ్యంపై ఎంతటి విష ప్రభావం చూపెడుతోందో అర్ధమవుతోంది. ముఖ్యంగా ధూమపానానికి 13 – 18 ఏళ్ల యువకులు ఎక్కువగా అలవాటు చేసుకొంటున్నారని, తర్వాత దానికి బానిసలవుతున్నారని చెబుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 300 మిలియన్ల జనాభా ఈ ధూమపానానికి వ్యవసనపరులయ్యారు. ఇక భారతదేశంలో సుమారు 1.4 మిలియన్లు జనాభా పొగాకు సంబంధ రోగాలబారిన పడి ప్రతి ఏడాది మరణిస్తున్నారు. కేన్సర్‌ రోగులలో 50శాతం మగవారు, 25శాతం ఆడవారు పొగాకు ఉత్పత్తుల వాడకం వల్లే రోగాలు తెచ్చుకొంటున్నారని వైద్యులు చెబుతున్నారు.

2024 థీమ్‌ ఇది..

ప్రతీ ఏటా వరల్డ్‌ నో టుబాకో డే పలు థీమ్‌లను పాటిస్తారు. ఈ ఏడాది థీమ్‌ ‘పొగాకు పరిశ్రమ జోక్యం నుంచి పిల్లలను రక్షించండి’ అన్నది దీని ఉద్దేశ్యం. ఈ థీమ్‌ హానికరమైన పొగాకు ఉత్పత్తులతో యువతను లక్ష్యంగా చేసుకోవడాన్ని అంతం చేయాలని సూచిస్తుంది.

ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం చరిత్ర..

ప్రపంచ వ్యాప్తంగా పొగాకు చేస్తున్న దుష్పరిణామాలను తగ్గించాలని భావించిన ఐక్యరాజ్యసమితి 1988లో తొలిసారి మే 31వ తేదీన ప్రపంచ పొగాకు వ్యతిరేక దినంగా పాటించాలని ప్రపంచదేశాలను కోరింది. దీనిని ప్రతి ఏడాది ప్రపంచ దేశాలన్నీ పాటిస్తూ వస్తున్నాయి. 2002 అక్టోబరు 22న మన భారత ప్రభుత్వం బహిరంగ ప్రదేశాలైన దేవాలయాలు, ప్రార్ధన మందిరాలు, పాఠశాలలు, కళాశాలలు, సినిమా హాళ్లు, షాపింగ్‌మాల్స్‌ మొదలగు ప్రదేశాలలో దూమపానం నిషేధించింది. ఈ చట్టం అమలు కోసం మీడియా, టీవీ, సినిమా హాల్స్‌లో విపరీతంగా ప్రచారం చేస్తోంది.

దుష్ప్రభావాలు ఇలా..

దూమపానం అలవాటు వల్ల మనిషి రక్త కణజాలంపై, మెదడుపై చెడుప్రభావం చూపెడుతుంది.

ఊపిరితిత్తుల వ్యాధులు, సీవోపీడీ, కేన్సర్‌, బ్రోనికైటిస్‌ విపరీతమైన దగ్గు, ఊపిరి అందకపోవడం మొదలగు వ్యాధులు.

గుండె నరాలు తీవ్రంగా దెబ్బతినడం, తీవ్ర గుండె వ్యాధులకు, గుండె పోటుకు గురై మరణిస్తున్నారు.

మొదడుపై తీవ్ర ఒత్తిడి పెరిగి డిప్రెషన్‌కు గురియ్యే అవకాశం

గర్భాశయ, మూత్రాశయ, జీర్ణాశయ వ్యవస్థలపై చెడు ప్రభావం

ఆడవారిలో గర్భం దాల్చపోలేకపోవడం, పిండవృద్ధిపై ప్రభావం

డయాబిటిక్‌ టైప్‌–2 బారిన పడే అవకాశం ఉంటుంది.

నోటి కేన్సర్‌, కడుపు కేన్సర్‌, దంతక్షయం మొదలగు రోగాలు

కంటి సంబంధ రోగాలలో కేటరాక్ట్‌ దెబ్బతింటుంది. చూపు దెబ్బతినే అవకాశం కలదు.

గోళ్లు పాడవడం, చర్మసంబంధ రోగాలు వస్తాయి.

మానేయడం సాధ్యమా ?

మనిషి కృతనిశ్చయం ఉంటే పొగాకు మానివేయడం అసాధ్యం కాదంటున్నారు వైద్యులు. మనిషి సంకల్పం ఉంటే పొగాకు చాలా సులువుగా మానివేయవచ్చు. దీనికి పలుమార్గాలు సూచిస్తున్నారు.

ప్రొఫెనల్‌ కౌన్సిలర్స్‌ ద్వారా సరైన వైద్యం తీసుకుంటూ మానేయవచ్చు.

నికోటిన్‌ రీప్రైస్‌మెంట్‌ ఽథెరఫీ ద్వారా పొగాకు మానవచ్చు.

పది రోజుల పాటు స్మోకింగ్‌ చేయకుండా అలవాటును దూరం చేయవచ్చు.

ప్రతి రోజు నిత్యం శారీరక కృత్యాలు నిరంతరం చేయడం ద్వారా ఈ దురవాటు మానవచ్చు.

యోగా, ధ్యానం వంటి కార్యక్రమాలు ద్వారా పొగాకు ఉత్పత్తుల వాడకం అలవాటును సులువుగా మానివేయగలరు.

మనిషి ప్రశాంత వాతావరణం అలవాటు పడడం ద్వారా నికోటిన్‌ వాడకాన్ని దూరం చేయవచ్చును.

Updated Date - May 31 , 2024 | 12:05 AM