Share News

13 నెలలుగా జీతాల్లేవు

ABN , Publish Date - Feb 01 , 2024 | 12:08 AM

జలవనరుల శాఖలో విధులు నిర్వహించే అవుట్‌ సోర్సింగ్‌ లస్కర్లకు 13 నెలలుగా వేతనాలు లేక అవస్థలు పడుతున్నారు.

13 నెలలుగా జీతాల్లేవు

ఔట్‌సోర్సింగ్‌ లస్కర్ల అవస్థలు

నీటి సంఘాల నిధులతో వేతనాలకు ముడి

పశ్చిమ డెల్టాలో 250కి పైగా సిబ్బంది కష్టాలు

భీమవరం, జనవరి 31 : జలవనరుల శాఖలో విధులు నిర్వహించే అవుట్‌ సోర్సింగ్‌ లస్కర్లకు 13 నెలలుగా వేతనాలు లేక అవస్థలు పడుతున్నారు. ఏప్రిల్‌ నెల నుంచి మార్చి వరకు ఏడాదిలో పదినెలల పాటు నెలకు 10,500 చెల్లించేలా ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో వీరిని విధుల్లోకి తీసుకున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత అధికార పార్టీల నాయకుల సిఫార్సులతో వీరిని విధుల్లోకి తీసుకున్నారు. గోదావరి డెల్టా పరిధిలో 600 మందిని తీసుకోగా జిల్లా పరిధిలో ఆయకట్టులో 250 మంది సిబ్బంది ఉన్నారు. వీరికి ఏడాది వేతనంతో పాటు గతేడాది 3 నెలలు వేతనం పెండింగ్‌లో ఉంది.మార్చి నెల వస్తే 15 నెలలు అవ తుందని వారంతా వాపోతున్నారు. సాగునీటి సంఘాలకు కేటాయించే బడ్జెట్‌ నుంచి ఆ సంఘ కమిటీలు 10 శాతం నిధులను ఖర్చుల కింద వాడుకునేందుకు అవకాశ ం కల్పించారు. ఆ నిధులనే వీరికి ఒప్పందం మేరకు చెల్లిస్తూ ఉంటారు. నెలకు వీరికి ఇచ్చే రూ.10,500 వర్క్‌ విభాగంలో మాత్రమే చెల్లించే విధంగా ఒప్పందం ఉంది. జలవనరుల శాఖలో పర్మినెంట్‌ లస్కర్లు పదవీ విరమణ చేసిన తరువాత ఖాళీలను రిటైర్‌ అయిన లస్కర్ల ఇష్టాల మేరకు వారినే అవుట్‌ సోర్సింగ్‌లో నియమించు కోవచ్చని ఉత్తర్వులు ఉన్నాయి. అయితే కొంతమంది అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు సిఫార్సులతో ఆయా ఖాళీలను భర్తీ చెయ్యడంతో రిటైర్డ్‌ ఉద్యోగులకు అవకాశం లేకుండా పోయింది.

నీటి సంఘాలకే దిక్కు లేదు

ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత సాగునీటి సంఘాలను పక్కన పెట్టేశారు. కమిటీలకు ప్రత్యేక బడ్జెట్‌ కేటాయింపు లేకుండా పోయింది. ఏటా సుమారు 10 నుంచి 12 కోట్ల రూపాయలతో ఆపరేషన్‌ అండ్‌ మెయింటినెన్స్‌ ప్యాకేజీలో మురుగు కాల్వల్లో తూడు, చెత్త తొలగింపు చేస్తూ ఉండేవారు. నాలుగేళ్లుగా టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్ల నుంచి స్పందన లేకపోవటంతో రెండు మూడు కోట్లతో ఖరారైన పనులను మొక్కబడిగా చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ విభాగంపై ఆధారపడిన అవుట్‌ సోర్సింగ్‌ వేతన జీవులకు ఒప్పందం ప్రకారం పనులకు వేతనం ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. వేతనాల కోసం జలవనరుల శాఖ అధికారుల చుట్ట్టూ తిరుగుతున్నారు. కుటంబాల పరిస్థితి చాలా దారుణంగా మారిందని, అప్పు కూడా పుట్టడం లేదని అసోసియేషన్‌ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది బడ్జెట్‌ సమయంలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నందున 15 నెలల వేతనం వచ్చే పరిస్థితి ఉందో లేదో అనే ఆవేదన వ్యక్తం అవుతోంది.

Updated Date - Feb 01 , 2024 | 12:08 AM