నిధులు ఫుల్.. జీతాలు నిల్
ABN , Publish Date - Jun 07 , 2024 | 12:15 AM
నిధులు నిండుగా ఉన్నా జీతాలు ఇవ్వడానికి మాత్రం అధికారులు సవలక్షా సాకులు చెబుతు న్నారని విమర్శలు వస్తున్నాయి.

నాలుగు నెలల నుంచి జీతాలు లేని
ఏలూరు ప్రభుత్వాస్పత్రి ఆరోగ్య శ్రీ ఉద్యోగులు
ఏలూరు క్రైం, జూన్ 6 : నిధులు నిండుగా ఉన్నా జీతాలు ఇవ్వడానికి మాత్రం అధికారులు సవలక్షా సాకులు చెబుతు న్నారని విమర్శలు వస్తున్నాయి. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో ఆరోగ్య శ్రీ విభాగంలో 21 మంది ఔట్‌సోర్సింగ్ విభాగంలో వివిధ రకాల ఉద్యోగులు పని చేస్తున్నారు. ఆస్పత్రిలో చేరే ప్రతి రోగికి అవసరమైన ఆపరేషన్లకు ఆరోగ్యశ్రీ సిబ్బంది వారి కే షీట్లను, ఎక్సరేలు, ఇతర ల్యాబ్ రిపోర్టులు, స్కాన్ రిపోర్టలను ఆరోగ్యశ్రీ సెంటర్‌కు అప్‌లోడ్ చేస్తూ ఉంటారు. అక్కడ నుంచి అనుమతులు పొందుతూ ఉంటారు. ఆ తర్వాత ఆరోగ్య శ్రీ ఆపరేషన్లు నిర్వహిస్తారు. ఆరోగ్య శ్రీ ట్రస్టు నుంచి నిధులు జమ అవుతూ ఉంటాయి. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో కోట్లాది రూపాయలు ఆరోగ్య శ్రీ నిధులు ఉన్నాయి. ఉద్యోగులకు మాత్రం ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకూ జీతాలు ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఏలూరు ప్రభుత్వాస్పత్రిని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌లో విలీనం చేశారు. అయితే ఆరోగ్య శ్రీ ఉద్యోగులు మాత్రం థర్డ్‌పార్టీ కాంట్రాక్టులో స్కాట్‌ల్యాండ్ అనే సంస్థ ద్వారా ఔట్‌సోర్సింగ్ విధానంలో 21 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఆస్పత్రి ఆరోగ్యశ్రీ నిధుల నుంచి ఆ సంస్థకు ఉద్యోగుల జీతాలను మెడికల్ సూపరింటెండెంట్ ప్రతి నెలా ఇచ్చేవారు.
ప్రస్తుతం డీఎంఈ పరిధిలోకి వచ్చాక జీతాలను నిలుపుదల చేశారు. రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిని కూడా మెడికల్ కాలేజీగానే తీర్చిదిద్దారు. అక్కడ మెడికల్ సూపరింటెండెంట్ యఽథావిధిగానే ఆరోగ్య శ్రీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలను చెల్లిస్తున్నారు. ఇక్కడ మాత్రం సిబ్బందికి జీతాలు ఇవ్వడంలో అనేక సాకులు చెబుతున్నా రని విమర్శలు వస్తున్నాయి. చివరకు ఉద్యోగులు డీఎంఈ అధికారుల వద్దకు వెళ్ళితే తమ పరిధిలో లేదని ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంటే ఆ నిధుల నుంచి చెల్లించే అధికారం ఉందంటూ అక్కడ చేతులు ఎత్తేశారు. జీతాలు చెల్లించకుండా ఆ నిధులను వివిధ పనులకు అనుమతులు లేకుండా ఖర్చు పెట్టేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా తక్షణం ఉన్నతాధికారులు ఆరోగ్యశ్రీ ఉద్యోగుల వేతనాలపై పరిశీలన చేసి చెల్లించాల్సిన అవసరం ఉంది.