Share News

చెత్త పన్నుకు స్వస్తి పలికారు

ABN , Publish Date - Jun 09 , 2024 | 12:03 AM

జగన్‌ సర్కార్‌ ప్రజలపై మోపిన చెత్త పన్ను నుంచి జిల్లా ప్రజలకు విముక్తి లభించింది. తాము అధికారంలోకి రాగానే దీనిని రద్దు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు.

చెత్త పన్నుకు స్వస్తి పలికారు

మునిసిపల్‌ అధికారులకు మౌఖిక ఆదేశాలు

2.67 లక్షల గృహాలకు విముక్తి.. అమల్లోకి ఎన్నికల హామీ

జగన్‌ సర్కార్‌ ప్రజలపై మోపిన చెత్త పన్ను నుంచి జిల్లా ప్రజలకు విముక్తి లభించింది. తాము అధికారంలోకి రాగానే దీనిని రద్దు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా కూటమి అధికార పగ్గాలు చేపట్టకుండానే పన్ను వసూలు చేయవద్దంటూ మునిసిపల్‌ అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీచేశారు. ఈ కారణంగా జిల్లాలోని పట్టణాల్లో నివసిస్తున్న 26,73,184 కుటుంబాలకు చెత్త పన్ను భారం తగ్గింది.

నరసాపురం, జూన్‌ 8 : చెత్తపై పన్ను వినేందుకే హాస్యాస్పదంగా ఉంది. 2021 నవంబర్‌లో జగన్‌ ప్రభుత్వం ఈ పన్నును అమల్లోకి తెచ్చింది. మునిసిపల్‌ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రతి కుటుంబం ఈ పన్ను కట్టాలని జీవో తెచ్చింది. దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేఖత వ్యక్తమైంది. ప్రజా సంఘాలు ఉద్యమాలు చేపట్టాయి. కానీ ప్రభుత్వం ‘తగ్గేదేలే’ అంటూ పన్ను వసూళ్లకే మొగ్గు చూపడంతో జిల్లాలోని మునిసిపాలిటీ పరిధిలో నివసిస్తు న్న ప్రజలపై నెలవారీ భారం పడింది. నరసాపురంలో 14,656, తాడేపల్లి గూడెం 28,652, భీమవరం 38,266, పాలకొల్లు 18,959, తణుకు 23,350 కుటుంబాలపై మునిసిపాలిటీ పాలకవర్గాలు తీర్మాణానికి అనుగుణంగా నెల వారీ పన్ను కడుతూ వచ్చారు. భీమవరంలో రూ.90, తాడేపల్లిగూడెం రూ.100, నరసాపురం, పాలకొల్లు రూ.60, తణుకులో ప్రాంతాన్ని బట్టి రూ.60, రూ.30గా పన్ను విధించారు. ఈ పన్ను అమలుకాక ముందు వరకు మునిసిపాల్టీలే వీధుల్లోకి వచ్చి చెత్త సేకరించేవారు. కొన్ని పురపాలక సంఘాల్లో రోజు వారీగా, మరికొన్నింటిల్లో రెండు రోజులకు ఒక్కసారి చెత్త సేకరణ జరిగేది. పన్ను వచ్చిన తర్వాత సేకరణకు ప్రత్యేక వాహనాలను కొనుగోలు చేశారు. ఇందులో నరసాపురంలో 16, తాడేపల్లిగూడెం 33, భీమవరం 35, పాలకొల్లు 19, తణుకు 24 వాహనాలను చెత్త సేకరణకు వినియోగిస్తూ వస్తున్నారు. ఈ వాహనాలు పూర్తిగా ప్రైవేట్‌ ఏజెన్సీ పరిధిలో ఉంచారు.

మునిసిపాలిటీలపై భారం

పన్ను వసూలైనా, కాకపోయినా మునిసిపాల్టీ మాత్రం నెల వారీగా ఏజెన్సీ డిమాండ్‌కు అనుగుణంగా సొమ్మును జమ చేయాల్సి వచ్చేది. ఫలితంగా మునిసిపాల్టీలపై భారం పడుతూ వచ్చింది. ఏజెన్సీ మాత్రం వాహన డ్రైవర్లను ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంది. చెత్త సేకరణకు వాహనంలో వచ్చే శానిటరీ సిబ్బందికి మునిసిపాల్టీనే జీతాలు ఇచ్చేది. ఈ కారణంగా ఈ పన్ను అమలు వల్ల మునిసిపాల్టీకి కలిసొచ్చిందేమీ లేదు. అదనపు భారం తప్ప, మరో వైపు పన్నును వ్యతిరేకిస్తూ చాలా మంది కట్టడం మానేశారు. దీనివల్ల బకాయిలు పేరుకుపోయాయి. వీటి వసూలుకు మునిసిపాల్టీ ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టింది. ఇన్ని లోపాలున్న ఈ విధానాన్ని తాము అధికారంలోకి వస్తే తొలగిస్తామని కూటమి హామీ ఇచ్చింది. దీనికి అనుగుణంగానే అఽధికారం చేపట్టకముందే అమలుకు పచ్చజెండా ఊపింది. ప్రజల నుంచి ఎట్టి పరిస్థితుల్లో చెత్త పన్ను వసూలు చేయవద్దంటూ కమిషనర్లకు మౌఖిక ఆదేశాలు అందాయి.

Updated Date - Jun 09 , 2024 | 12:03 AM