Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

వరి వద్దు.. ఆక్వా ముద్దు

ABN , Publish Date - Mar 04 , 2024 | 12:30 AM

ఆక్వా సాగులో నికర ఆదాయం రావడంతో కైకలూరు నియోజకవర్గంలో మాగాణి భూములన్ని చేపలు, రొయ్యల చెరువులుగా మారిపోతున్నాయి.

వరి వద్దు.. ఆక్వా ముద్దు
కలిదిండిలో చెరువుగా మారిన మాగాణి

చేపలు, రొయ్యల చెరువులుగా మాగాణి భూములు

కలిదిండి, మార్చి 3 : ఆక్వా సాగులో నికర ఆదాయం రావడంతో కైకలూరు నియోజకవర్గంలో మాగాణి భూములన్ని చేపలు, రొయ్యల చెరువులుగా మారిపోతున్నాయి. క్రమేణ వరిసాగు కనుమరుగవుతోంది. ఒకప్పుడు ధాన్యాగారాలకు నిలయంగా ఉన్న కలిదిండి, కైకలూరు, మండవల్లి, ముదినేపల్లి మండలాల్లో నేడు ఆక్వా సాగు మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరాజిల్లుతుండడంతో రైతులు తమ పంట పొలాలను చెరువులుగా తవ్వేశారు. సాగునీరు అందుబాటులో లేక ఎకరాకు లీజు లక్ష రూపాయల వరకు రావడంతో రైతులు తమ మాగాణి భూములను చేపలు, రొయ్యల చెరువులకు బడాబాబులకు ఇచ్చేశారు. కైకలూరు నియోజకవర్గంలో సుమారు లక్షా యాబై ఆరు వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో కలిదిండి మండలంలో 38 వేల ఎకరాల ఆయకట్టుకు గానూ 35 వేల ఎకరాల్లో ఆక్వా సాగు, రెండు వేల ఎకరాల్లో వరి సాగు, కైకలూరు మండలంలో 40 వేల ఎకరాలను గానూ 37 వేల ఎకరాల్లో ఆక్వా సాగు, మూడు వేల ఎకరాల్లో వరి సాగు, మండవల్లి మండలంలో 39 వేల ఎకరాలకు గానూ 35 వేల ఎకరాల్లో ఆక్వా సాగు 4 వేల ఎకరాల్లో వరి సాగు, ముదినేపల్లి మండలంలో 38 వేల ఎకరాలకు గానూ 22 వేల ఎకరాల్లో ఆక్వా సాగు, 16 వేల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. వీటిల్లో అఽధికంగా గరువు ఛానల్‌ పరిధిలో మాత్రమే సార్వాకు వరి, దాళ్వాకు అపరాలు సాగు చేస్తున్నారు. జిల్లాకు శివారు ప్రాంతం కావడంతో సాగునీరు అందక మాగాణి భూములు చేపల, రొయ్యల చెరువులుగా మారిపోయాయి. 2006లో అప్పటి సీఎం వైఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి కొల్లేరులో అక్రమ చేపల చెరువులను బాంబులతో ధ్వంసం చేయడంతో ఆ ప్రాంతంలో ఆక్వా సాగు చేసే బడాబాబులు కలిదిండి మండలంలో బీడు వారిన రొయ్యల చెరువులను తక్కువ లీజుకు తీసుకుని చేపల చెరువులుగా మార్చేశారు. అనంతరం అధిక లాభసాటిగా ఉండడంతో వేలాది పంట పొలాలను చేపలు, రొయ్యల చెరువులుగా తవ్వేశారు. సాగునీరు కొరత, వరి పంట చేతికి వచ్చే సమయానికి తుపాన్లతో పంట నీట మునిగిపోవడంతో నష్టాలు వచ్చి అప్పుల పాలవడంతో వరి సాగుపై విరక్తి చెంది మాగాణి భూములను చేపల, రొయ్యల చెరువులుగా తవ్వేయడంతో నియోజకవర్గంలో వరి సాగు కనుమరుగవుతోంది.

సాగునీటి కొరతతో చెరువులుగా ..

జిల్లాకు శివారు ప్రాంతం కావడంతో సాగు నీరు అందక వరి పంట దెబ్బతిని నష్టాలు వస్తున్నాయి. ఉప్పుటేరులో నీరు అందుబాటులో ఉండడంతో ఆక్వా సాగు చేస్తున్నాం.

– ఎం.సుబ్బరాజు, ఆక్వా రైతు

ధాన్యానికి గిట్టుబాటు ధర లేక..

ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లభించడం లేదు. పెట్టుబడి వ్యయం పెరిగింది. దీంతో పంట పొలాలను చేపల, రొయ్యల చెరువులుగా తవ్వేశాం. వీటిపై నికర ఆదాయం వస్తోంది.

– ఎన్‌.భగవాన్లు

Updated Date - Mar 04 , 2024 | 12:30 AM